
సిద్దిపేట టౌన్: ఇంట్లో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం సిద్దిపేటలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌నగర్‌లో నివాసముండే గోపరి మల్లేశం 35 సంవత్సరాలుగా ఆక్సిజన్ సిలిండర్‌లను విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే ఇంట్లో చిన్న సిలిండర్లలోకి ఆక్సిజన్ నింపుతుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఈ పనిని పర్యవేక్షిస్తున్న మల్లేశం తల్లి లింగమ్మ(70)కు తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలు తెగిపోయింది.
అక్కడే ఉన్న ఆమె మనవడు వెంకటేశ్(27) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లింగమ్మ మృతిచెందింది. వెంకటేశ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పేలుడు ధాటికి ఇంటిముందు నిలిపిన బైకులు చెల్లాచెదురుగా పడ్డాయి. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను రిటైల్‌గా విక్రయించడంతో పాటు జనావాసంలో నిల్వ ఉంచడం వల్లే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు. గతంలోనూ మూడుసార్లు ఆక్సిజన్ సిలిండర్‌లు లీకైన సందర్భాలు ఉన్నాయని వారు చెప్పారు.