ఇల్లు కట్టించిన ఫేస్‌బుక్ మిత్రులు..
ఆనందంలో నిరుపేద పుష్ప కుటుంబీకులు
బెల్లంపల్లి (మంచిర్యాల): పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి ఫేస్‌బుక్ స్నేహితులు గూడు కల్పించారు. రూ.లక్షా ఆరు వేల రూపాయలతో ఇంటిని నిర్మించారు. ఆదివారం గృహ ప్రవేశం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన లక్కపట్ల పుష్పది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పుష్పకు ఇద్దరు చెల్లెళ్లు. వారి వివాహ బాధ్యతలను స్వీకరించిన పుష్ప పెళ్లి చేసుకోలేదు. ఓ చెల్లెలికి పెళ్లి చేయడంతో ఆమె ఓ కూతురు రమ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చెల్లెలు భర్త అకాల మరణం చెందాడు. రమ్య పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో పుష్ప ఆమెను దత్తత తీసుకుంది.
వీరి దుస్థితిని గమనించిన బెల్లంపల్లి మైహార్ట్ బీట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుదర్శన్, కల్పన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రమేశ్ ఈ నెల 1న పుష్ప దీనస్థితిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి మిత్రుల సహకారం అర్థించగా.. రూ.1.06 లక్షలు జమయ్యాయి. వీటితో పుష్పకు ఇల్లు నిర్మించారు.