మహబూబాబాద్ రూరల్ (వరంగల్): తన ఇద్దరు కొడుకులపై అకారణంగా దొంగతనం నేరాన్ని మోపడంతో ఓ తండ్రి మనస్తాపం చెంది దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాలు..రెడ్యాల గ్రామానికి చెందిన దాసరి యాసయ్య (45) ఖమ్మంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ఖమ్మం వెళ్లి వస్తుంటాడు. యాసయ్యకు 7వ తరగతి చదివే సాయి, 4వ తరగతి చదివే ప్రభాకర్‌తోపాటు ఓ కుమార్తె కూడా ఉంది.
సాయి, ప్రభాకర్లు తన ఇంట్లో రూ.12వేలు దొంగతనం చేశారంటూ ఐలబోయిన భద్రమ్మ వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురిచేసింది. సోమవారం ఖమ్మం వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన యాసయ్యకు విషయం తెలిసింది. ఎందుకు తన పిల్లలను హింసించావని భద్రమ్మను ప్రశ్నించాడు. తన ఇంట్లో రూ.12వేలు దొంగతనం చేశారని ఆమె చెప్పడంతో పిల్లల్ని నిలదీశాడు. వారు దొంగతనం చేయలేదని చెప్పారు. దీంతో తన పిల్లలపై అనవసరంగా దొంగతనం నేరాన్ని మోపారంటూ మనస్తాపం చెందిన యాసయ్య శీతల పానీయంలో పురుగుల మందు కలిపి సాయి, ప్రభాకర్‌లకు తాగించాడు. తర్వాత తానూ తాగాడు. స్థానికులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించేలోపే యాసయ్య మృతి చెందాడు. సాయి, ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.