ఆ నలుగురి కోసమా! | family politics in telangana says rahul gandhi | Sakshi
Sakshi News home page

ఆ నలుగురి కోసమా!

Published Fri, Jun 2 2017 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఆ నలుగురి కోసమా! - Sakshi

ఆ నలుగురి కోసమా!

తెలంగాణలో కుటుంబ పాలన: ‘ప్రజాగర్జన’ సభలో రాహుల్‌ గాంధీ
తెలంగాణ శక్తి, వనరులన్నీ దోచుకుంటున్నారు
మూడేళ్లలో 2,855 మంది రైతుల ఆత్మహత్యలు..
అందులో సీఎం సొంత నియోజకవర్గంలోనే 100 మంది
భూసేకరణ చట్టానికి తూట్లు.. ఇంటికో ఉద్యోగం ఎక్కడ?
మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్నారు
బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని నిలదీత


సంగారెడ్డి నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. తెలంగాణ శక్తి, వనరులన్నీ కేవలం నలుగురి చేతిలో బందీ అయ్యాయని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన రైతులు, విద్యార్థులు, యువత కలలు కల్లలయాయ్యయని.. కేవలం ఒక కుటుంబం కోసమే వారు పోరాడారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 2,855 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందులో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి చెందినవారే 100 మందికిపైగా ఉన్నారని పేర్కొన్నారు. భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని, మద్దతు ధర కోరిన రైతులకు సంకెళ్లు వేయించిందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఊరికో ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన పథకాల పేర్లు మారుస్తూ, రీడిజైనింగ్‌తో కొత్త అంచనాలు తయారుచేస్తూ.. కేసీఆర్, ఆయన మిత్రులు జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని నిలదీశారు. గురువారం సంగారెడ్డిలోని అంబేద్కర్‌ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘ప్రజాగర్జన’బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ముందుకు నడుస్తోంది, ప్రజలతోనా లేక ల్యాండ్‌ మాఫియాతోనా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిందని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని పేర్కొన్నారు. రాష్టంలోని ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకు, రైతుల మధ్య వెళ్లాలని.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజాగర్జన’సభలో రాహుల్‌గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఒక్క కుటుంబం కోసమేనా..?
‘‘తెలంగాణ ఒక్క కుటుంబం కోసం ఏర్పడినట్లుంది. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీల అధికారాలను లాక్కుని అప్రజాస్వామిక పాలన సాగిస్తోంది. కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడానికా తెలంగాణ ఏర్పడింది? తెలంగాణ శక్తి, వనరులన్నీ కేవలం నలుగురి చేతిలో బందీ అయ్యాయి. మీ కలలు, భవిష్యత్తును నలుగురి చేతిలో పెడతారా? ఇదేలాంటి తెలంగాణ నిర్మాణం. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? విద్యార్థులు, రైతులు కేవలం ఓ కుటుంబం కోసమే పోరాడారా?..

అంతా అప్రజాస్వామిక పాలనే
తెలంగాణ ప్రజలు ఇక్కడి ఆర్థిక, జల, భూవనరులపై హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లభించదని ఇక్కడి రైతులు భావించారు. తెలంగాణ సాకారమైతే నిరుద్యోగ సమస్య ఉండదని యువత భావించింది. అందుకే రైతులు, విద్యార్థులు, యువత ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. ఆ ఆవేదనను కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ అర్థం చేసుకోవడంతో మీకు మీ రాష్ట్రం లభించింది. ఎంత వ్యతిరేకత ఎదురైనా మీ కలను నెరవేర్చాం. ఇంత చేసినా మీ ఆశలు, కలలు, ఆకాంక్షలు సాకారమయ్యాయా? అన్నీ మూడేళ్లలోనే సాకారం కావని నాకు తెలుసు. కానీ ఈ మూడేళ్లలో ఆ కలల సాకారం దిశగా మంచి ప్రారంభమైనా లభించిందా? కేవలం నలుగురి కోసమే తెలంగాణ ఏర్పడినట్లుంది..

రైతుల శ్మశానంగా మార్చడం కోసం కాదు
గత మూడేళ్లలో రాష్ట్రంలో 2,855 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా తెలంగాణ కోసం పోరాడిన వారే.. తమ రక్తాన్ని, చెమటను తెలంగాణ కోసం చిందించిన వారే. కానీ వారు పోరాడింది తెలంగాణను రైతుల స్మశానంగా మార్చడానికి కాదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఏకమొత్తంగా రూ.70 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. రైతులు కొత్త రుణాలు పొందేందుకు బ్యాంకుల తలుపులు తెరుచుకున్నాయి. మరి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు ఎందుకు లభించడం లేదు? రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఆభరణాలు ఇంకా బ్యాంకుల్లోనే ఎందుకు తాకట్టుగా ఉన్నాయి. ఇది ఏరకమైన రుణ మాఫీ. ఇదసలు రుణమాఫీ కాదు. రైతులపై ఇంకా అప్పుల భారం ఉంది. కొత్త రుణాలు అందడం లేదు. ప్రత్యామ్నాయ పంటగా మిర్చి పండించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును నమ్మడం రైతుల పాలిట శాపంగా మారింది. మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే రైతుల చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.

మూడేళ్లలో ఏం లభించింది?
యువత బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ ఆవిర్భావంతో వారికేం లభించింది? ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికలకు ముందు కేసీఆర్‌ హామీలు గుప్పించారు. ఇంటికొకటి కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా రాలేదని ఇక్కడ ప్రజలే ఎద్దేవా చేస్తున్నారు. యువత కోసం కాంగ్రెస్‌ హయాంలో తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పి.. 4 వేల స్కూళ్లను మూసివేయబోతోంది. ఢిల్లీలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌లు మాయ మాటలు చెప్పి ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. మేకిన్‌ ఇండియాతో దేశంలో పరిశ్రమలు స్థాపించి రెండు కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకొన్నారు. మూడేళ్లలో ఎంత మందికి ఉపాధి లభించిందని కొద్దిరోజుల కింద పార్లమెంట్‌లో అడిగితే... గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య ఉందని స్వయంగా కేంద్ర మంత్రే బదులిచ్చారు. యావత్‌ దేశంలో యువత ఉద్యోగాల కోసం తండ్లాడుతోంది. మోసపూరిత మాటలతో మోదీ, కేసీఆర్‌లో యువతను మభ్యపెడుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ లక్ష ఉద్యోగాలు కల్పించారు. మేం మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం మావి మాటలు చెప్పే ప్రభుత్వాలు కాదు. చేతల ద్వారా చూపిస్తాం. ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని, ముఖ్యమంత్రిని యువత నిలదీయాలి.

రైతుల హక్కులు లాక్కుంటున్నారు
దేశంలో అతిపెద్ద అవినీతి రైతుల నుంచి భూసేకరణలో జరిగేది. రైతుల నుంచి లక్షల కోట్లు దోపిడీ చేసేవారు. దానిని ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపేవారు. అందువల్ల మేం భూసేకరణ చట్టం తీసుకొచ్చి రైతులకు భూములపై హక్కులు కల్పించాం. మార్కెట్‌ ధర కన్నా 4 రెట్ల పరిహారం అందించడం, గ్రామ పంచాయతీ, రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించకుండా ఉండడం వంటి నిబంధనలు పెట్టాం. కానీ ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు, రైతుల హక్కులను లాక్కునేందుకు కేంద్రంలో ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కొద్దిరోజుల కిందే రైతుల నుంచి హక్కులను లాక్కున్నారు. గుజరాత్‌ తరహాలోనే తెలంగాణలోనూ ఈ చట్టాన్ని నీరుగార్చారు. గుజరాత్‌ మోడల్‌ తర్వాత తెలంగాణ మోడల్‌గా తయారైంది.

సీఎం జేబులు నింపుకొంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదు. ఆయన ఏం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాల పేర్లు మారుస్తూ, రీడిజైనింగ్‌ చేసి కొత్త అంచనాలు తయారుచేస్తూ.. మీ ముఖ్యమంత్రి, ఆయన మిత్రులు జేబులు నింపుకొంటున్నారు. రూ.350 కోట్లు పెట్టి ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు. అంత డబ్బుతో ఏ ముఖ్యమంత్రీ ఇల్లు కట్టుకోరు. ఇది ఆయన (కేసీఆర్‌) డబ్బు కాదు, ఆయన కుటుంబ డబ్బు కాదు.. తెలంగాణ రైతుల డబ్బు, విద్యార్థులకు ఇవ్వకుండా మిగుల్చుకున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు.. ప్రజల జేబుల నుంచి సమకూరిన డబ్బు.. ఆ డబ్బులతో సీఎం సొంత ఇంటిని కట్టుకున్నారు..

మీ భూమి మీది కాదు.. మీ ముఖ్యమంత్రిది
తెలంగాణ మీ భూమి మీది కాదు.. మీ ముఖ్యమంత్రిది. నీళ్లు మీవి కావు.. మీ ముఖ్యమంత్రివి. మీరు మీ ముఖ్యమంత్రిని నమ్మారు. కానీ వారు మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు. మీ గళాన్ని వినడం లేదు.. మీ బాధను అర్థం చేసుకోవడం లేదు. కానీ కాంగ్రెస్‌ అందరి మాటలు వింటుంది. ఏకవ్యక్తి ప్రభుత్వాన్ని నడపదు. ప్రతి పౌరుడు, ఎమ్మెల్యే, ఎంపీ అందరిని కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తుంది. ఇప్పుడీ స్టేజీపై 160 మంది ఉన్నారు. జనంలో లక్షల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారు. ఇది ఒక కుటుంబ పార్టీ కాదు. ఇది తెలంగాణ పార్టీ. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణను సరైన దిశలో నడిపిస్తాం. తెలంగాణ యువత, రైతు, మహిళల కలలను సాకారం చేస్తాం.

మేడిన్‌ తెలంగాణ కావాలి
మొబైల్‌ఫోన్‌ కొనడానికి వెళితే వాటిపై మేడిన్‌ చైనా అని ఉంటుంది. అది నాకు నిరాశ కలిగిస్తుంది. కానీ మొబైల్‌ ఫోన్‌ మీద మేడిన్‌ తెలంగాణ అని ఉండాలని ఆశిస్తున్నా. మేం అధికారంలోకి వస్తే దానిని సాధించి చూపిస్తాం.

ఖమ్మం రైతులతో రాహుల్‌ భేటీ
సాక్షి, సంగారెడ్డి: ఇటీవల ఖమ్మం మార్కెట్‌యార్డు ఘటనలో అరెస్టయిన రైతులతో రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ప్రజాగర్జన సభ ప్రారంభానికి ముందు ఎంపీ రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క ఆ రైతులను వెంట తీసుకురాగా.. దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ అరెస్టుకు దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వ తీరు, తమ కుటుంబాలు పడిన వేదనను రాహుల్‌కు వివరించారు. మిర్చికి మద్దతు ధర విషయంలో వినతిపత్రం అందజేశారు. రైతులకు తాము అండగా ఉంటామని రాహుల్‌ భరోసా ఇచ్చినట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు.

హైదరాబాద్‌లో ఘన స్వాగతం
సంగారెడ్డి ప్రజాగర్జన సభ కోసం వచ్చిన రాహుల్‌కు టీ కాంగ్రెస్‌ ఘన స్వాగతం పలికింది. జైపాల్‌రెడ్డి, ఉత్తమ్, జానారెడ్డి, పొన్నాల, షబ్బీర్‌అలీ, రేణుకాచౌదరి, డీకే అరుణ, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి రాహుల్‌కు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన రాహుల్‌.. పంజాగుట్ట సర్కిల్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల మీదుగా ప్రయాణించిన ఆయన.. అక్కడక్కడా కొంతసేపు ఆగి మాట్లాడారు.

అయితే.. జగ్గారెడ్డికి ఇచ్చేయ్‌..!
– వీహెచ్‌తో రాహుల్‌ సరదా సంభాషణ
సాక్షి, సంగారెడ్డి: ‘జగ్గారెడ్డి గట్టోడు.. మొండోడు.. వన్‌మెన్‌ షో చేసిండు. కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చుపెట్టుకుని ఏర్పాట్లు చేసిండు..’అంటూ ఎంపీ వి.హనుమంతరావు ప్రజాగర్జన ఏర్పాట్ల గురించి వేదికపై రాహుల్‌ వద్ద పొగడ్తలు గుప్పించారు. దీంతో ‘సభ ఏర్పాట్లకు మీరేం ఇచ్చారు’అని రాహుల్‌ ప్రశ్నించగా.. ‘నా దగ్గరేముంది ఇచ్చేందుకు..’అని వీహెచ్‌ బదులిచ్చారు. దీంతో రాహుల్‌ సరదాగా.. ‘మీ చేతికి ఉన్న బంగారు బ్రేస్‌లెట్‌ను జగ్గారెడ్డికి ఇచ్చేయండి’అన్నారు. ఈ వ్యాఖ్యతో జగ్గారెడ్డితోపాటు వీహెచ్, ఉత్తమ్‌ తదితరులు ఒక్కసారిగా నవ్వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement