ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు?
సంగారెడ్డి: తెలంగాణ ప్రాంత ప్రజలు తమ హక్కుల కోసం సొంత రాష్ట్రాన్ని కోరుకున్నారని, వారి అభీష్టాన్ని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజల బాధను సోనియాగాంధీ అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న ప్రజా గర్జన సభలో రాహుల్ గాంధీ గురువారం ప్రసంగించారు. ఆయన ముందుగా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ...‘ తెలంగాణ ప్రజల కలలు సాకారం అయ్యాయా?. మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిందా?. తెలంగాణ ప్రజలు నలుగురి కోసమే పోరాడారా?. సీఎం కేసీఆర్ ఎవరి కోసం పని చేస్తున్నారు?. కేవలం కాంట్రాక్టర్ల హితం కోసమే పని చేస్తున్నారు?.’ అంటూ ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ శక్తి, వనరులు ఒకే కుటుంబంలో బందీ అయిందని, అందరి అధికారులను లాక్కొని, ఆ కుటుంబం అధికారం చెలాయిస్తుందని రాహుల్ మండిపడ్డారు. ఇదేనా బంగారు తెలంగాణ అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు...బ్యాంకులు ఎందురు రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 2855 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అందులో సీఎం నియోజకవర్గంలోనే 100మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 75వేల కోట్లు రుణాలు మాఫీ చేశామన్నారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తే పట్టా పుస్తకాలు, మహిళల బంగారం ఎందుకు బ్యాంకుల్లో ఉంటాయన్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే రైతులకు సంకెళ్లు వేయడం బాధాకరమన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఒకటే అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో మోదీ, కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని ఆయన ధ్వజమెత్తారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... మీ ఫోన్లపై మేడిన్ తెలంగాణ బ్రాండ్ వచ్చేలా చేస్తానని, తాను మాటలు చెప్పే మనిషిని కాదని అన్నారు. కాంగ్రెస్ పథకాల పేర్లు మార్చి కేసీఆర్ బూటకపు పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేర్లతో కేసీఆర్ సొమ్ము చేసుకుంటున్నారని, ప్రపంచంలో ఏ నాయకుడి లేనట్లుగా రూ.350 కోట్లతో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని రాహుల్ విమర్శించారు. అదంతా ప్రజలు, రైతుల డబ్బు అని అన్నారు. అలాగే రూ.లక్షల కోట్ల విలువైన పేదల భూములను దోచుకుంటున్నారని, పేద రైతుల కోసం కాంగ్రెస్ భూసేకరణ చట్టాన్ని తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. ఒకవేళ ఎవరైనా భూమి తీసుకుంటే నాలుగింతలు మార్కెట్ దర ఇచ్చేలా చట్టం తీసుకొచ్చామన్నారు. రైతుల అనుమతి లేకుండా భూములు తీసుకోకుండా చేశామన్నారు. కానీ, కేసీఆర్ ఇష్టారాజ్యంగా భూములు లాక్కుంటున్నారని నిప్పులు చెరిగారు. ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వం సరైన దిశలో నడుస్తుందన్నారు.
తాము అధికారంలోకి రాగానే రైతులు, యువకులు, మహిళల కలలు సాకారం చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని ఆయన సూచించారు. ప్రజల కలలు కల్లలు కాకుండా చూడాలని, మోసపూరిత వాగ్దానాలు మాని భారత్‌లో పరిశ్రమలు పెట్టాలని ప్రధాని మోదీ, కేసీఆర్‌ను కోరాలన్నారు. యువకులకు ఉద్యోగాల కల్పన ఇప్పుడు పెద్ద సవాల్ అని, ఆ సమస్యకు మోదీ, కేసీఆర్ జవాబు చెప్పకుంటే అధికారం వచ్చాక తాము సమాధానం చెబుతామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.