రుణ మాఫీ.. రైతు హ్యాపీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాలపరిమితితో సంబంధం లేకుండా రూ.లక్ష లోపు అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మెతుకుసీమ రైతాంగం మోములో చిరు నవ్వులు విరిశాయి. బంగారం తనఖాపెట్టి తెచ్చుకున్న రుణాలతో పాటు, స్వల్పకాలిక, రుణాలను కూడా మాఫీ కానుండడంతో జిల్లాలోని 3,65,787 మంది రైతులకు లబ్ధి కలగనుంది. మొత్తంగా జిల్లాలో రూ.2403.66 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని అంచనా .
లీడ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జిల్లాలో 4,58,637 మంది రైతులకు సంబంధించిన మొత్తం రూ.3321.95 కోట్ల రుణాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1559.92 కోట్లు బంగారం కుదవ బెట్టిన రుణాలు, మరికొన్ని టర్మ్ రుణాలు ఉన్నాయి. గత నాలుగేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే రూ.లక్ష, అంతకు లోపు రుణాలు తీసుకున్న రైతులు 2,76,678 మంది ఉన్నారు.
ఈ రైతులు తీసుకున్న రుణాలు మొత్తంగా రూ.1762.09 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు 29,347 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి 184.58 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీటితో పాటు మరో 5,670 మంది రైతులు 89.29 కోట్లు ఇతర వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్నారు. కేబినెట్‌నిర్ణయం నేపథ్యంలో ఈ మొత్తం రుణం మాఫీ కానుంది.
వీటితో పాటు బంగారు రుణాలు కూడా మాఫీ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు అధికారుల కసరత్తు కూడా దాదాపు పూర్తైయింది. అందువల్ల వెంటనే రైతుల రుణాలు మాఫీ కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.