ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్‌లోని పశువైద్యశాలలో సమయపాలన కరువైంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలు శైలజ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రి పరిధిలో ఆలూర్, మిర్ధాపల్లి, రాంపూర్, గగ్గుపల్లి గ్రామాలు వస్తాయి. సుమారు ఐదారు వేల గేదెలు, ఆవులు, మేకలు తదితర పశువులు ఈ గ్రామాలలో ఉంటాయి. రెండేళ్ల క్రితం పశు వైద్యురాలిగా ప్రభుత్వం శైలజను నియమించింది. పశువులకు చికిత్స చేయడానికి వైద్యురాలు గ్రామంలోనే నివాసం ఉండాల్సి ఉండగా, నిజామాబాద్‌లో ఉంటున్నారు.
పశు వైద్యశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యురాలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే పశువులకు వచ్చే సీజనల్, గాలికుంటు వ్యాధులు, కృత్రిమ గర్భాధారణపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించడంలేదనే ఆరోప ణలున్నాయి. అలాగే ప్రతి రోజు వైద్యశాలలో వైద్యురాలు అందుబాటులో ఉండడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల సమాచారం మేరకు విలేకరులు సోమవారం పశువైద్యశాలకు ఉదయం 10 గంటలకు వెళ్లగా, వైద్యురాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. వారిని చూసిన అటెండర్ నర్సయ్య వెంటనే వైద్యురాలు శైలజకు ఫోన్ చేసి విలేకరులు వచ్చారని చెప్పాడు. దీంతో సెలవులో ఉన్నట్లు చెప్పమని ఫోన్‌లో సూచన చేయడంతో అటెండర్, వైద్యురాలు సెలవులో ఉన్నట్లు తెలిపాడు. పశువైద్యురాలు చేయాల్సిన చికిత్స అటెం డర్ నర్సయ్య చేస్తున్నాడని రైతులు పేర్కొన్నారు. పశువులకు వ్యాధులు వస్తే వైద్యురాలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రైవేట్ వారితో పశువులకు చికిత్స చేయిస్తున్నామని రైతులు వాపోయారు. విధులకు సక్రమంగా హాజరు కాని వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అటెండరే వైద్యుడు..
Published Tue, May 27 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement