Veterinary Hospital
-
ఎవరి కోసం మీ ‘పశు’ వాదన రామోజీ?
గ్రామానికి ఒక పశు సంవర్థక సహాయకుడు, రెండు మండలాలకు ఒక వెటర్నరీ అంబులెన్స్, ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం, సర్టిఫై చేసిన నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ, పశు పోషణ, నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా పశు విజ్ఞాన బడులు, గ్రామ స్థాయిలోనే పాడి రైతు ముంగిట నాణ్యమైన పశు వైద్య సేవలు అందరి కళ్లెదుటే కనిపిస్తున్నాయి. మూగ జీవాలకు బీమా రక్షణ, పశు పోషకులకు భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా జనరిక్ పశు ఔషధ కేంద్రాల ఏర్పాటు, జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పన.. ఇలా నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. కానీ ‘పచ్చ’ పైత్యం తలకెక్కించుకున్న ఈనాడు రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోవడం ఆశ్చర్యకరం కానేకాదు. వెటర్నరీ అంబులెన్స్ ద్వారా పశువులకు ఇంటి ముందు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది సాక్షి, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ పశు పోషకుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీ బాటలో పయనిస్తునాయి. పశు వైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీకి కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు.. అవార్డులు.. రివార్డులు దక్కాయి. ఇవన్నీ చూసి ఓర్వలేకపోతున్న రామోజీరావు వాస్తవాలకు ముసుగేసి అభూత కల్పనలు, అవాస్తవాలు వండి వారుస్తూ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ‘ఇది మానవత్వామా..దానవత్వమా..? అంటూ తాజాగా పాడి రైతులను తప్పుదారి పట్టించేలా అబద్ధాలను అచ్చేశారు. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం. ఆరోపణ : పశువులకు మేత కూడా ఇవ్వడం లేదు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో పశువుల శరీర ఎదుగుదలకు, పునరుత్పత్తికి ఉపయోగపడే పచ్చి పశు గ్రాసం (మాగుడు గడ్డి), దాణా వేర్వేరుగా ఇచ్చేవారు. వీటితో పాటు బహిరంగ మార్కెట్లో ఎండుగడ్డి కూడా కొనాల్సి వచ్చేది. కిలో రూ.2 చొప్పున మాగుడు గడ్డి, కిలో రూ.4.50 చొప్పున దాణా, కిలో రూ.2 చొప్పున ఎండుగడ్డి కొనేవారు. ఇలా కిలో మేతకు రూ.8.50 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. దీని వల్ల పశు పోషకులకు అదనపు భారం పడేది. ఈ పరిస్థితిని మారుస్తూ పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా, ఖనిజ లవణాలు కలిగిన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)ను 60 శాతం రాయితీపై కేవలం కిలో రూ.6.40కే ప్రభుత్వం పశు పోషకులకు అందిస్తోంది. ఈ దాణాపై రాయితీ రూపంలో రూ.9.40 భారం పడుతుంది. ఇలా నాలుగేళ్లలో ఇప్పటి వరకు 1,49,340 మంది పశు పోషకులకు ఆర్బీకేల ద్వారా రూ.117.97 కోట్ల విలువైన 74,670 టన్నుల టీఎంఆర్ను అందించింది. ఆరోపణ : పశు సంక్షేమం విస్మరించారు వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు. రూ.18.20 కోట్ల వ్యయంతో నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్సార్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు తీసుకొచ్చారు. వీటి ద్వారా పేడ, రక్త, పాల, మూత్ర, చర్మ సంబంధ వ్యాధుల, జీవ క్రియ వ్యాధుల పరీక్షలతో పాటు యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి రెండు చొప్పున 340 డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను తీసుకొచ్చారు. 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన అర గంటలోనే మారుమూల గ్రామాలకు సైతం ఈ వాహనాలు చేరుకొని పశు పోషకుల గుమ్మం వద్దే నాణ్యమైన పశు వైద్య సేవలందిస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 5.25 లక్షల పశువులకు సేవలందించారు. తద్వారా 3.48 లక్షల పశు పోషకులు లబ్ధి పొందారు. ప్రమాదాలు, విపత్తుల వేళ పశువులు మృతి చెందడం వల్ల జీవనోపాధి కోల్పోయే పశు పోషకులు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకం దారులకు ధీమా కల్పించేందుకు వైఎస్సార్ పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద మరణించిన పశువుకు రూ.30 వేలు, గొర్రె లేదా మేకకు రూ.6 వేలు పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,05,043 మంది పశు పోషకులకు చెందిన 1,72,180 పశువులకు బీమా కల్పించారు. ఇప్పటి వరకు 116 చనిపోగా 3 రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించారు. ఈ ప్రభుత్వ హయాంలో కొత్తగా రూ.20 కోట్లు వెచ్చంచి 5,068 కృత్రిమ గర్భధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది కదా గుర్తింపు అంటే.. పశు పోషకుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగడం లేదని పలు రాష్ట్రాలు కితాబిస్తున్నాయి. ఏపీ బాటలో నడిచేందుకు కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇలా నాలుగేళ్లుగా ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. వరుసగా రెండేళ్ల పాటు అగ్రికల్చర్ టు డే గ్రూప్ ద్వారా ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్ షిప్ అవార్డులు వరించాయి. 2021–22 సిల్వర్ స్కోచ్, 2020లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో పాటు 2023లో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కోచ్, వెటర్నరీ టెలీ కాల్ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌తో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్ మెరిట్ అవార్డులు దక్కాయి. చంద్రబాబు సీఎం పీఠంపై లేనందున రామోజీకి ఇవన్నీ కనిపించడం లేదు. ఆరోపణ : గోకులాలకు మంగళం పాడారు వాస్తవం: గోకులాలు, మినీ గోకులాలకు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిలు దశల వారీగా చెల్లించేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నూరు శాతం పూర్తయిన గోకులాలు, మినీ గోకులాలకు గడిచిన 4 నెలల నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం రామోజీకే చెల్లింది. ఆరోపణ : పశుపోషకులకు ఏ మేలూ చేయలేదు వాస్తవం: ముందెన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలకు నెలకు రూ.2,750 విలువైన పశువుల మందులు, వైద్య పరికరాలు సరఫరా చేసి గ్రామాలలో నాణ్యమైన పశు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు మందులు, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం రూ.65.20 కోట్లు ఖర్చు చేసింది. ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 1.75 కోట్ల జీవాలకు ప్రథమ చికిత్స, 2.44 కోట్ల జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ, 2.26 కోట్ల పశువులకు టీకాలు, 16.38 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా 10.63 దూడలకు జన్మిచ్చేలా చేశారు. 34.36 లక్షల పశువులకు పశు ఆరోగ్య సంరక్షణా కార్డ్స్ పంపిణీ చేశారు. 6.14 పశువుల నుంచి నమూనాలను సేకరించి పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్ ద్వారా కచ్చతమైన వ్యాధి నిర్ధారణ జరిపి సత్వర వైద్య సేవలందించేలా కృషి చేశారు. 40 శాతం రాయితీపై రూ.17.65 కోట్ల విలువైన 5,195 గడ్డి కత్తిరించు యంత్రాలను పశు పోషకులకు అందించారు. మేలైన పశుపోషణ, నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తూ లక్షలాది మందికి పశుపోషణలో శిక్షణనిచ్చారు. ఆరోపణ : ఊరూరా పశుగ్రాసం లేదు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో ఊరూరా పశు గ్రాస క్షేత్రాల పథకం పేరుతో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయి. క్షేత్ర స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు లేకుండానే నిధులు దారి మళ్లించినట్టు పలు విచారణల్లో తేటతెల్లమైంది. ఈ అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 75 శాతం రాయితీపై నాణ్యమైన, ధృవీకరించిన పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తూ ఊరూరా పశు గ్రాసాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇలా 3,67,400 మంది రైతులకు 75 శాతం రాయితీపై 6,948 టన్నుల పశుగ్రాస విత్తనాలను సరఫరా చేశారు. వాటి ద్వారా రైతులు తమ సొంత క్షేత్రాల్లోనే ఊరూరా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 34 లక్షల టన్నులకు పైగా మేలైన పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసి పశువులకు అందించారు. ధ్రువీకరించిన నాణ్యమైన మేత, దాణ, పశుగ్రాసం అభివృద్ధికి రూ.250 కోట్లతో పశుగ్రాస భద్రతా పాలసీని అమలు చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా రామోజీ? -
ఆవు కంటికి క్యాన్సర్... శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
పెద్దతిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరుకు చెందిన బుడ్డాబాబు అనే రైతుకు చెందిన పాడి ఆవు కంటికి క్యాన్సర్ సోకడంతో పశువైద్య నిపుణులు గురువారం శస్త్రచికిత్స చేశారు. తన ఆవుకు మూడు నెలల కిందట కంటి భాగంలో గాయం కావడంతో స్థానిక పశు వైద్యశాలలో బుడ్డా బాబు పరీక్షలు చేయించాడు. కంటికి గ్రోత్ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్ రమేష్ నిర్ధారించారు. ఆ తర్వాత ఆవు కంట్లోని గాయం గడ్డలా మారి చూపు పూర్తిగా మందగించింది. క్యాన్సర్ మెదడుకు సోకకుండా ఉండేందుకు డాక్టర్ రమేష్ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దమండ్యం మండలంలో పని చేసే వెటర్నరీ డాక్టర్ విక్రంరెడ్డి, మదనపల్లిలో పని చేస్తున్న ట్రైనీ డాక్టర్ లోకేష్‌లతో కలిసి ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలోని క్యాన్సర్ కణజాలాన్ని తొలగించారు. -
వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో ఉద్యోగావకాశాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో వివిధ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆ విభాగం హెచ్ఓడీ నరేష్‌యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెటర్నరీ డాక్టర్లు, డ్రైవరు పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29న కర్నూలులోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, వీపీసీ క్యాంపస్, కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వెటర్నరీ డాక్టరు పోస్టుకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. పశు వైద్యులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన వారు కూడా అర్హులు. డ్రైవర్లకు 35 ఏళ్ల లోపు వయస్సు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల అనుభవముండాలి. మరింత సమాచారానికి 94922 22951లో సంప్రదించవచ్చు. (చదవండి : స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు) -
మూగ వేదనకు... స్పందించిన ‘ప్రజావాణి’
అనంతగిరి : మూగజీవాలకు వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఓ రైతు.. లేగ దూడను ఆటోలో తీసుకుని వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ధారూరు మండలం కేరెళ్లికి చెందిన రాములుకు చెందిన ఆవు ఆదివారం లేగదూడకు జన్మనిచ్చింది.పుట్టిన కొద్ది సేపటికే చెంగున ఎగరాల్సిన దూడ చతికిలబడి పేగులు బయటకు ఉండటంతో రైతు గుండె కదిలిపోయింది. వెంటనే పశు వైద్యాధికారులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. సోమవారం ఉదయం ఓ డాక్టర్ వచ్చి పరీక్షించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనితో కలత చెందిన రాములు మరికొందరి సాయంతో ట్రాలీ ఆటోలో దూడను తీసుకుని.. కలెక్టరేట్‌కు వచ్చాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పశు వైద్య జిల్లా అధికారులు దూడకు వికారాబాద్‌లోని పశువుల ఆస్పత్రికి తరలించి వైద్యం చేసి పంపించారు. -
ఎద్దు కడుపులో బంగారు మంగళసూత్రం
ముంబై: ఓ ఎద్దు మహిళ మంగళసూత్రాన్ని మింగేసిన వింత సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఆగస్టులో ‘బెయిల్ పోలా’(ఎద్దుల పండుగ) పేరుతో ఓ పండుగ జరుగుతుంది. మన దగ్గర కనుమ నాడు ఏ విధంగానైతే ఎద్దులను అలంకరించి, పూజలు నిర్వహిస్తామో.. అలానే ఈ రాష్ట్రాల్లో కూడా బెయిల్ పోలా పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎద్దులను అలంకరించి.. వాటికి పూజలు చేసి.. ప్రత్యేకంగా చేసిన ప్రసాదం తినిపిస్తారు. అంతేకాక బంగారు ఆభరాణాన్ని ఎద్దు నుదురుకు తాకిస్తే మంచిదని నమ్ముతారు. ఈ క్రమంలో గత నెల 30న మహారాష్ట్రలోఈ బెయిల్ పోలా వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ రోజు సాయంత్రం ఓ రైతు తన ఎద్దులను అందంగా అలంకరించి పూజ నిమిత్తం ఇంటికి తీసుకువచ్చాడు. అతని భార్య ఓ పళ్లెంలో హరతి, ప్రసాదంతో పాటు తన బంగారు మంగళసూత్రాన్ని కూడా తీసుకుని వచ్చింది. ముందు ఎడ్లకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. మంగళసూత్రాన్ని ఎద్దుల నుదురుకు తాకించి.. ప్రసాదం పెడదామని అనుకుంటుండగా ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దాంతో లోపలికి వెళ్లి క్యాండిల్ తీసుకుని వచ్చి చూడగా.. ప్లేట్లో ఉంచిన ప్రసాదంతో పాటు.. బంగారు మంగళసూత్రం కూడా కనిపించలేదు. ఓ ఎద్దు ప్రసాదం తినడం కనిపించింది. కంగారుపడ్డ దంపతులు ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ మంగళసూత్రం మాత్రం కనిపించలేదు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఎద్దు ప్రసాదంతో పాటు మంగళసూత్రాన్ని కూడా మింగేసి ఉంటుందని చెప్పారు. పేడతో పాటు వస్తుందని సూచించారు. దాంతో ఆ దంపతులు ఓ వారం రోజుల పాటు ఆ ఎద్దు పేడను జాగ్రత్తగా దాచి ఉంచారు. కానీ లాభం లేకపోవడంతో చివరకు వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పారు. దాంతో వైద్యులు ఎద్దుకు స్కాన్ చేయగా.. దాని కడుపులో మంగళసూత్రం కనిపించింది. ఈ క్రమంలో ఈ నెల 8న ఎద్దుకు ఆపరేషన్ చేసి దాని కడుపులో నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. 40గ్రాముల బరువున్న ఈ మంగళసూత్రం ఖరీదు రూ.1.5లక్షలుంటుందని సదరు రైతు తెలిపాడు. ప్రస్తుతం ఎద్దు ఆరోగ్యం బాగానే ఉందని.. నెల రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందిగా వైద్యులు సూచించారని పేర్కొన్నాడు. -
శునకాల రాకతో సందడి
-
వెటర్నరీ వర్సిటీ ముందే ప్రాణం విడిచిన గేదె
రాజేంద్రనగర్: అక్కడ మూగ జీవాలకు ప్రాణం పోసే ఆస్పత్రి ఉంది. దాని పక్కనే రాష్ట్రంలోని మూగ జీవాలకు సోకే రోగాలకు మందులను తయారు చేసే డాక్టర్ల బృందం ఉండే కార్యాలయమూ ఉంది. కానీ, అదే కార్యాలయం ముందు ఒక మూగ జీవం రోడ్డు ప్రమాదంలో గాయపడి నరకయాతన పడి మృతి చెందింది. పదుల సంఖ్యలో డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఆ దారి గుండా వెళ్లారు తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రాణం పోసే ఆస్పత్రి ముందే ప్రాణం విడిచింది ఆ జీవి. వివరాలు.. రాజేంద్రనగర్ రేడియల్ రోడ్డు ప్రాంతంలో పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఇందుకు సంబంధించిన కళాశాల, ఆస్పత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన రహదారిపైనే ఈ భవనాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ గేదెను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలకు గురైన ఆ గేదె.. డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ కార్యాలయం గేటు ముందే పడి విలవిల్లాడింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచింది. ఉదయం ఈ కార్యాలయానికి శాస్త్రవేత్తలు, డాక్టర్లు వచ్చారు తప్ప అక్కడే ఉన్న గేదెను మాత్రం పట్టించుకోలేదు. మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన శాస్త్రవేత్తలు, డాక్టర్లకు నిలయమైన వారి కార్యాలయం ముందే మూగ జీవి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గేదె మృతిచెందిన ప్రాంతానికి కూతవేటు దూరంలో జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఉన్నా గేదె కళేబరాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. -
పశువులకు కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వీధి కుక్కలు పశువులను కరిచినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. నాటు వైద్యంపై ఆధారపడవద్దు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాల కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉన్నా యి. జిల్లాలోని డివిజన్ కేంద్రాలు నిర్మల్‌కు 500, మం చిర్యాలకు 350, ఆదిలాబాద్‌కు 150 వ్యాక్సిన్లు అందజేశాం. కుక్కకాటు బారిన పశువులకు టీకాలు వేయించాలి. జిల్లాలో సుమారు 18వేల వరకు కుక్కలు ఉన్నా యి. ఈ ఏడాది జూలై వరకు సారంగాపూర్ మండలంలో 40, జైపూర్‌లో 25, లక్ష్మణచాందలో 15 పశువులను కుక్కలు కరిచాయి. పశువులను మూతి భాగంలో కరుస్తాయి కాబట్టి వాటికి త్వరగా వెర్రి లేచే ప్రమాదముంది. కుక్కలు పశువుల దగ్గరకు రాగానే కొమ్ములతో పొడిచే ప్రయత్నం చేస్తాయి. దీంతో మూతి, ముక్కు దగ్గర ఎక్కువగా కరుస్తాయి. రేబిస్ వైరస్ రక్తనాళాల గుండా చిన్నమెదడుకు త్వరగా చేరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మనిషిని కాటు వేస్తే 20 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంది. కానీ పశువులు రెండేళ్లకంటే ఎక్కువగా జీవించే అవకాశాలు లేవు. లక్షణాలు.. కుక్కకాటుకు గురైన పశువులు గడ్డి తినకుండా 105 డిగ్రీల నుంచి 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. నోటి నుంచి సొల్లు కారుస్తూ ఎప్పుడూ నిల్చోనే ఉంటాయి. వాటికి కళ్లముందు ఏమీ కనిపించవు. ఎవరినైనా పొడిచే ప్రయత్నం చేస్తాయి. వీటికి నీటిని చూస్తే భయంగా ఉంటుంది. వర్సాకాలం నాడీ వ్యవస్థపై రేబిస్ ప్రభావం త్వరగా మెదడుకు చేరుతుంది. చల్లటి వాతావరణంలో ఇది రక్తనాళాలల్లో చిన్నమెదడుకు చురుగ్గా చేరి దశదిశ లేకుండా ప్రయాణిస్తుంటాయి. నోరు మూగ పడిపోయి తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. వెనక కాలు జాడిస్తూ తలను గోడకు వేసి రాయడం, ఎదురుగా వచ్చేది ఏదైనా చూడకుండా కొమ్ములతో పొడవడానికి, నోటితో కొరికేందుకు ప్రయత్నిస్తాయి. వ్యాక్సిన్ అందించే పద్ధతి.. కాటుకు గురైన రోజు, మూడో రోజు, ఏడో రోజు, 14వ రోజు, 28వ రోజు, 60వ రోజు ఇలా క్రమం తప్పకుండా ఏడు డోసులు టీకాలు వేయించాలి. రెండు మూడు డోసులు వేయించి ఊరుకున్నా ప్రమాదమే. వర్షాకాలంలో అధికంగా కుక్కకాటుకు గురవుతుంటాయి. పశువుల పోషకులు సకాలంలో గమనించి వైద్యం అందించాలి. -
అటెండరే వైద్యుడు..
ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్లోని పశువైద్యశాలలో సమయపాలన కరువైంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలు శైలజ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రి పరిధిలో ఆలూర్, మిర్ధాపల్లి, రాంపూర్, గగ్గుపల్లి గ్రామాలు వస్తాయి. సుమారు ఐదారు వేల గేదెలు, ఆవులు, మేకలు తదితర పశువులు ఈ గ్రామాలలో ఉంటాయి. రెండేళ్ల క్రితం పశు వైద్యురాలిగా ప్రభుత్వం శైలజను నియమించింది. పశువులకు చికిత్స చేయడానికి వైద్యురాలు గ్రామంలోనే నివాసం ఉండాల్సి ఉండగా, నిజామాబాద్‌లో ఉంటున్నారు. పశు వైద్యశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యురాలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే పశువులకు వచ్చే సీజనల్, గాలికుంటు వ్యాధులు, కృత్రిమ గర్భాధారణపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించడంలేదనే ఆరోప ణలున్నాయి. అలాగే ప్రతి రోజు వైద్యశాలలో వైద్యురాలు అందుబాటులో ఉండడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సమాచారం మేరకు విలేకరులు సోమవారం పశువైద్యశాలకు ఉదయం 10 గంటలకు వెళ్లగా, వైద్యురాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. వారిని చూసిన అటెండర్ నర్సయ్య వెంటనే వైద్యురాలు శైలజకు ఫోన్ చేసి విలేకరులు వచ్చారని చెప్పాడు. దీంతో సెలవులో ఉన్నట్లు చెప్పమని ఫోన్లో సూచన చేయడంతో అటెండర్, వైద్యురాలు సెలవులో ఉన్నట్లు తెలిపాడు. పశువైద్యురాలు చేయాల్సిన చికిత్స అటెం డర్ నర్సయ్య చేస్తున్నాడని రైతులు పేర్కొన్నారు. పశువులకు వ్యాధులు వస్తే వైద్యురాలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రైవేట్ వారితో పశువులకు చికిత్స చేయిస్తున్నామని రైతులు వాపోయారు. విధులకు సక్రమంగా హాజరు కాని వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఎంపిక ఓకే...శిక్షణ లేకే..!
గ్రామీణ జీవనంలో కీలక భూమిక పోషిస్తున్న పశుసంతతికి చిక్కులు వచ్చిపడుతున్నాయి. వాటికి ఆరోగ్య రక్షణకని ఎంపికచేసిన ‘పశుమిత్ర’లు ఇంకా శిక్షణ పూర్తిచేసుకోక పోవడంతో పలుచోట్ల వైద్యసేవలు అందడం లేదు. ఇతర జిల్లాల్లో పూర్తయిన ఈ ప్రక్రియ ఇక్కడ యంత్రాంగం చొరవచూపని కారణంగా లక్ష్యం దిశగా అడుగులు వేయడం లేదు. శిక్షణ ఇచ్చినా వారికి చెల్లింపుల విషయంలో రైతులనుంచే వసూళ్లు చేసుకోవాలన్న నిబంధనలు ఆర్థికంగా అన్నదాతలకు భారంగా మారనుంది. ఇప్పటికే మొక్కుబడి తంతుగా మారిన పశువైద్యం ఇప్పుడు మరింత అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. మహబూబ్‌నగర్(వ్యవసాయం)న్యూస్‌లైన్: గ్రా మీణ ప్రాంతాల్లో పశువులకు, పెంపకం దారుల వద్ద ఉండే జీవాలకు సేవలందించేందుకు ఉద్దేశిం చిన ‘ ‘పశుమిత్ర’ పథకం జిల్లాలో గందరగోళ స్థితిలో పడింది. ఇందుకు కావల్సిన అభ్యర్థుల ఎంపిక పూర్తయినా వారికి శిక్షణ ఇవ్వక పోవడం తో పశుసంతతికి సేవలందడం లేదు. ముఖ్యంగా పశువైద్యశాలలు అందుబాటులో లేని గ్రామాల్లో వీరి సేవలు వినియోగించు కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా శిక్షణపై జిల్లా అధికారులు ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకున్న భారీ వర్షాలు... రెండు నెలల కింద జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ శిక్షణ కార్యక్రమానికి కొంత ఆటంకం కలిగింది. ఆ పరిస్థితులనుంచి తేరుకొన్నప్పటికీ ఇంకా అధికారులు శిక్షణ ఏర్పాట్లపై దష్టి పెట్టకపోవడంై విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పశుమిత్రలకు ఎలాంటి ఆర్థికబతి కల్పించకుండా నేరుగా రైతుల నుండే సేవలు అందించినందుకు కొంత మొత్తం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 342 పశువైద్యశాలలుండగా సిబ్బందిలేని చోట్ల,తక్కువ సిబ్బంది ఉన్న 51 పశువైద్యాశాలలకు గుర్తించి అభ్యర్థులను తీసుకున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం 4నెలలపాటు కొనసాగనుంది.మొదటి మూడు నెలలు వారికి పశువైద్యం అందించే విధానం,రోగ లక్షణాలు గుర్తించడం,పశువులకు చికిత్స,వ్యాధినిరోధక టీకాలు ఇవ్వడం వంటి వాటిపై అవగాహణ కల్పిస్తారు.ఇది పూర్తై తరువాత నెలపాటు పశువైద్యశాలలో నేరుగా చికిత్సలను చేయడం ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు.ఇలా నాలుగు నెలలు శిక్షణ కాలం పూర్తై తరువాత అభ్యర్థులకు సర్టిఫికేట్లను ఇస్తారు.అనంతరం ఆయా పశువైద్యాశాలలో వారు వైద్యాసేవలు అందించాల్సి ఉంటుంది. స్థానిక అభ్యర్థులకు మొండిచెయ్యి... జిల్లాలో గుర్తించిన 51 పశువైద్యాశాలలో పశుమిత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సమాచారం అందించడంలో విఫలమైయ్యారు.దీంతో స్థానికులు ఇందుకు ముందుకు రాలేక పోయారు. అధికారులు తమ అనుకూల అభ్యర్థులకు అవకాశం కల్పించడం కోసం ప్రణాళిక ప్రకారమే ఇలా ఎంపిక సమాచారం గోప్యంగా ఉంచారన్న వాదనలూ ఉన్నాయి . ఇతర మండలాల అభ్యర్థులను నియమిస్తే వారు స్థానికంగా అందుబాటులో లేకపోతే ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోయే అవకాశం ఉంది.ఉదాహరణకు భూత్పూర్ మండల కేంద్రంలోని పశువైద్యాశాలలో నియామకానికి అక్కడి అభ్యర్థి ముందుకు రాకపోవడంతో హన్వడ మండల అభ్యర్థికి అవకాశం ఇచ్చినట్లు అక్కడి డాక్టర్ తెలిపారు.ఇలా చాలా చోట్ల ఇతర ప్రాంతాల వారిని తీసుకున్నట్లు సమాచారం.వీరికి ఎలాంటి ఆర్థికభతి ఇవ్వమని చెప్పడంతో దీన్నే ప్రధాన ఆధారంగా చేసుకొని బతికేవారూ తక్కువ ఉంటారని ఇది సరైన పద్ధతి కాదని కొందర వాదన.ఇలా ఉద్యోగ భద్రత,ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం ఉండే అవకాశాలు కనిపించవని ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సేవలకు సొమ్ము బెడద? శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన పశుమిత్రలు గుర్తించిన పశువైద్యశాలలో నియమితులైనా వారికి సంబంధిత కేంద్రం ద్వారా ఎలాంటి జీత భత్యాలు రావు. దీంతో రోజువారిగా వైద్యాసేవల కోసం స్థానిక వైద్యాశాలలకు వచ్చే రైతులు,పెంపకందారుల నుండి వారు వసూళ్లు చేసుకోవాల్సిందే. దీంతో పశుసేవలు ఎలా ఉన్న రైతుల జేబులకు మాత్రం చిల్లులు పడనున్నాయి.దీంతో ప్రజాసంఘాలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఆశించిన పంటలు చేతికి రాక తికమక పడుతున్న తమను ఇంకా ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు.ప్రభుత్వం నేరుగా సిబ్బందిని నియామించాలని రైతులు కోరుతున్నారు. పశుమిత్రలు రైతుల నుండే డబ్బులు తీసుకుంటారు : పశుసంవర్ధక జేడి వెంకటరమణ పశుమిత్రలు వారందించే సేవలను బట్టి పశువైద్యాశాలకు వచ్చే రైతుల నుండి ఒకోక్కరి దగ్గర రూ.50 ఆపైనా తీసుకుంటారు.జిల్లాలో సిబ్బంది కొరతను దష్టిలో పెట్టుకొని నియమించడం జరుగుతుంది.శిక్షణ కాలంలో 4నెలలకు కలిపి ఒక్కోక్క పశుమిత్ర అభ్యర్థికి రూ.8వేలు ఖర్చు చేస్తాం.అనంతరం ఉద్యోగ నిర్వహణలో వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవు.