ఎవరి కోసం మీ ‘పశు’ వాదన రామోజీ? | Eenadu Ramoji Rao Fake News On Veterinary Medical services | Sakshi
Sakshi News home page

ఎవరి కోసం మీ ‘పశు’ వాదన రామోజీ?

Published Sat, Aug 19 2023 5:07 AM | Last Updated on Sat, Aug 19 2023 8:12 AM

Eenadu Ramoji Rao Fake News On Veterinary Medical services - Sakshi

గ్రామానికి ఒక పశు సంవర్థక సహాయకుడు, రెండు మండలాలకు ఒక వెటర్నరీ అంబులెన్స్, ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం, సర్టిఫై చేసిన నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ, పశు పోషణ, నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా పశు విజ్ఞాన బడులు, గ్రామ స్థాయిలోనే పాడి రైతు ముంగిట నాణ్యమైన పశు వైద్య సేవలు అందరి కళ్లెదుటే కనిపిస్తున్నాయి. మూగ జీవాలకు బీమా రక్షణ, పశు పోషకులకు భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా జనరిక్‌ పశు ఔషధ కేంద్రాల ఏర్పాటు, జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పన.. ఇలా నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. కానీ ‘పచ్చ’ పైత్యం తలకెక్కించుకున్న ఈనాడు రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోవడం ఆశ్చర్యకరం కానేకాదు.  

వెటర్నరీ అంబులెన్స్‌ ద్వారా పశువులకు ఇంటి ముందు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది   

సాక్షి, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ పశు పోషకుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచింది. పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీ బాటలో పయనిస్తునాయి. పశు వైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీకి కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు.. అవార్డులు.. రివార్డులు దక్కాయి.

ఇవన్నీ చూసి ఓర్వలేకపోతున్న రామోజీరావు వాస్తవాలకు ముసుగేసి అభూత కల్పనలు, అవాస్తవాలు వండి వారుస్తూ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ‘ఇది మానవత్వామా..దానవత్వమా..? అంటూ తాజాగా పాడి రైతులను తప్పుదారి పట్టించేలా అబద్ధాలను అచ్చేశారు. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం.  

ఆరోపణ : పశువులకు మేత కూడా ఇవ్వడం లేదు 
వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో పశువుల శరీర ఎదుగుదలకు, పునరుత్పత్తికి ఉపయోగపడే పచ్చి పశు గ్రాసం (మాగుడు గడ్డి), దాణా వేర్వేరుగా ఇచ్చేవారు. వీటితో పాటు బహిరంగ మార్కెట్‌లో ఎండుగడ్డి కూడా కొనాల్సి వచ్చేది. కిలో రూ.2 చొప్పున మాగుడు గడ్డి, కిలో రూ.4.50 చొప్పున దాణా, కిలో రూ.2 చొప్పున ఎండుగడ్డి కొనేవారు. ఇలా కిలో మేతకు రూ.8.50 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. దీని వల్ల పశు పోషకులకు అదనపు భారం పడేది.

ఈ పరిస్థితిని మారుస్తూ పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా, ఖనిజ లవణాలు కలిగిన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్‌)ను 60 శాతం రాయితీపై కేవలం కిలో రూ.6.40కే ప్రభుత్వం పశు పోషకులకు అందిస్తోంది. ఈ దాణాపై రాయితీ రూపంలో రూ.9.40 భారం పడుతుంది. ఇలా నాలుగేళ్లలో ఇప్పటి వరకు 1,49,340 మంది పశు పోషకులకు ఆర్బీకేల ద్వారా రూ.117.97 కోట్ల విలువైన 74,670 టన్నుల టీఎంఆర్‌ను అందించింది.  

ఆరోపణ : పశు సంక్షేమం విస్మరించారు 
వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు. రూ.18.20 కోట్ల వ్యయంతో నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్సార్‌ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు తీసుకొచ్చారు. వీటి ద్వారా పేడ, రక్త, పాల, మూత్ర, చర్మ సంబంధ వ్యాధుల, జీవ క్రియ వ్యాధుల పరీక్షలతో పాటు యాంటీ బయోటిక్‌ సెన్సిటివిటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి రెండు చొప్పున 340 డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను తీసుకొచ్చారు. 1962 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసిన అర గంటలోనే మారుమూల గ్రామాలకు సైతం ఈ వాహనాలు చేరుకొని పశు పోషకుల గుమ్మం వద్దే నాణ్యమైన పశు వైద్య సేవలందిస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 5.25 లక్షల పశువులకు సేవలందించారు. తద్వారా 3.48 లక్షల పశు పోషకులు లబ్ధి పొందారు.

ప్రమాదాలు, విపత్తుల వేళ పశువులు మృతి చెందడం వల్ల జీవనోపాధి కోల్పోయే పశు పోషకులు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకం దారులకు ధీమా కల్పించేందుకు వైఎస్సార్‌ పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద మరణించిన పశువుకు రూ.30 వేలు, గొర్రె లేదా మేకకు రూ.6 వేలు పరిహారం చెల్లిస్తున్నారు.

ఇలా ఇప్పటి వరకు 1,05,043 మంది పశు పోషకులకు చెందిన 1,72,180 పశువులకు బీమా కల్పించారు. ఇప్పటి వరకు 116 చనిపోగా 3 రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించారు. ఈ ప్రభుత్వ హయాంలో కొత్తగా రూ.20 కోట్లు వెచ్చంచి 5,068 కృత్రిమ గర్భధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఇది కదా గుర్తింపు అంటే..  
పశు పోషకుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగడం లేదని పలు రాష్ట్రాలు కితాబిస్తున్నాయి. ఏపీ బాటలో నడిచేందుకు కేరళ, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇలా నాలుగేళ్లుగా ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి.

వరుసగా రెండేళ్ల పాటు అగ్రికల్చర్‌ టు డే గ్రూప్‌ ద్వారా ఏపీకి యానిమల్‌ హెల్త్‌ లీడర్‌ షిప్‌ అవార్డులు వరించాయి. 2021–22 సిల్వర్‌ స్కోచ్, 2020లో కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి అవార్డు ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌తో పాటు 2023లో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్‌ స్కోచ్, వెటర్నరీ టెలీ కాల్‌ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌తో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్‌ మెరిట్‌ అవార్డులు దక్కాయి. చంద్రబాబు సీఎం పీఠంపై లేనందున రామోజీకి ఇవన్నీ కనిపించడం లేదు.  

ఆరోపణ : గోకులాలకు మంగళం పాడారు 
వాస్తవం: గోకులాలు, మినీ గోకులాలకు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిలు  దశల వారీగా చెల్లించేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నూరు శాతం పూర్తయిన గోకులాలు, మినీ గోకులాలకు గడిచిన 4 నెలల నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం రామోజీకే చెల్లింది. 

ఆరోపణ : పశుపోషకులకు ఏ మేలూ చేయలేదు 
వాస్తవం: ముందెన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలకు నెలకు రూ.2,750 విలువైన పశువుల మందులు, వైద్య పరికరాలు సరఫరా చేసి గ్రామాలలో నాణ్యమైన పశు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు మందులు, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం రూ.65.20 కోట్లు ఖర్చు చేసింది. ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 1.75 కోట్ల జీవాలకు ప్రథమ చికిత్స, 2.44 కోట్ల జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ, 2.26 కోట్ల పశువులకు టీకాలు, 16.38 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ  చేయడం ద్వారా 10.63 దూడలకు జన్మిచ్చేలా చేశారు.

34.36 లక్షల పశువులకు పశు ఆరోగ్య సంరక్షణా కార్డ్స్‌ పంపిణీ చేశారు. 6.14 పశువుల నుంచి నమూనాలను సేకరించి పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌ ద్వారా కచ్చతమైన వ్యాధి నిర్ధారణ జరిపి సత్వర వైద్య సేవలందించేలా కృషి చేశారు. 40 శాతం రాయితీపై రూ.17.65 కోట్ల విలువైన 5,195 గడ్డి కత్తిరించు యంత్రాలను పశు పోషకులకు అందించారు. మేలైన పశుపోషణ, నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తూ లక్షలాది మందికి పశుపోషణలో శిక్షణనిచ్చారు. 

ఆరోపణ : ఊరూరా పశుగ్రాసం లేదు 
వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో ఊరూరా పశు గ్రాస క్షేత్రాల పథకం పేరుతో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయి.  క్షేత్ర స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు లేకుండానే నిధులు దారి మళ్లించినట్టు పలు విచారణల్లో తేటతెల్లమైంది. ఈ అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 75 శాతం రాయితీపై నాణ్యమైన, ధృవీకరించిన పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తూ ఊరూరా పశు గ్రాసాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

ఇలా 3,67,400 మంది రైతులకు 75 శాతం రాయితీపై 6,948 టన్నుల పశుగ్రాస విత్తనాలను సరఫరా చేశారు. వాటి ద్వారా రైతులు తమ సొంత క్షేత్రాల్లోనే ఊరూరా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 34 లక్షల టన్నులకు పైగా మేలైన పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసి పశువులకు అందించారు. ధ్రువీకరించిన నాణ్యమైన మేత, దాణ, పశుగ్రాసం అభివృద్ధికి రూ.250 కోట్లతో పశుగ్రాస భద్రతా పాలసీని అమలు చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా రామోజీ?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement