ఏపీలో ఒక్కొక్కరు రోజుకు 9 గ్రాముల వినియోగం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు 5 గ్రాములే..
ఉప్పు అధిక వినియోగంవల్ల జీవనశైలి జబ్బులు
ఎయిమ్స్ ఢిల్లీ, ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
ఉప్పు, చక్కెర వంటివి గణనీయంగా తగ్గించాలని సూచన
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అతి సర్వత్రా వర్జయేత్.. ఏ విషయంలోనూ అతి పనికిరాదు అని చెప్పడానికి ఉద్దేశించిన సూక్తి ఇది. కానీ, ఇప్పుడిది తలకిందులవుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.. అది కూడా ఉప్పు వాడకంలో. దీని వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగిందని.. ఫలితంగా లక్షలాది మంది వినియోగదారులు జీవనశైలి జబ్బులకు గురవుతున్నట్లు న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్) సంస్థలు గుర్తించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు సగటున ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వాడకూడదని సూచించగా.. ఏపీలో రోజుకు 8.7 గ్రాముల నుంచి 9 గ్రాముల వరకు వాడుతున్నట్లు అవి తేల్చాయి. సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు వాడటంవల్ల జీవితకాల వైకల్యానికి దారితీస్తుందని ఆయా సంస్థలు వెల్లడించాయి.
ఊబకాయులకు అధిక ముప్పు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పు అధిక వినియోగంవల్ల ఊబకాయుల్లో అధిక ముప్పు పొంచి ఉందని ఆ సంస్థలు స్పష్టంచేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది అధిక ఉప్పు వినియోగించడంవల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారని, దీని కారణంగా వారు పక్షవాతం బారిన పడుతున్నారని పేర్కొన్నాయి.
అలాగే, జనాభాలో ఎక్కువమంది అధిక మోతాదులో తీసుకోవడంవల్లే ఉప్పు ఊబిలో కూరుకుపోయి రకరకాల జబ్బులకు గురవుతున్నట్లు తేల్చారు. అదే అధిక ఆదాయ దేశాల్లో ఉప్పు వినియోగం తక్కువగా ఉందని, దీనివల్ల హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కేసులు అక్కడ తక్కువగా ఉన్నాయని గుర్తించారు.
ప్యాక్ చేసినవి, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని.. ఆకుకూరలు, కూరగాయల్లో సహజ సిద్ధంగానే కొంత ఉప్పు శాతం కలిగి ఉంటాయని, వాటిని అనుసరించి అదనపు ఉప్పును తగ్గించుకోవాలని సర్వే సంస్థలు సూచించాయి. ఇక దేశంలో మధుమేహం, బీపీ, గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఉప్పు, చక్కెర వంటివి వీలైనంత తక్కువగా వాడాలని ఐసీఎంఆర్ సూచించింది.
40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా..
ఈ సంస్థలు 18–69 ఏళ్ల వయస్సున్న వారిలో సర్వే నిర్వహించగా.. 70 శాతం మందికి ఉప్పు వినియోగంపై అవగాహన కానీ, దానివల్ల కలిగే ప్రమాదంగానీ తెలీదని తేలింది. సుమారు 3 వేల మందిపై ఈ సర్వే చేయగా.. ఉప్పు వలన కలిగే ప్రతికూలతలపై వారినుంచి సరైన సమాధానాలు రాలేదని, దీన్నిబట్టి వారికి ఉప్పు వినియోగంపై అవగాహనలేదన్న విషయం వెలుగుచూసింది. ఇక పలువురిలో రక్త నమూనాలు, మూత్ర నమూనాలు సేకరించి వారి నుంచి సోషియో డెమోగ్రాఫిక్, బిహేవియర్, మెటబాలిక్ లక్షణాలనూ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment