వ్యాధులు ప్రబలుతున్నా ఒక్క పంచాయతీలోనూ చెత్త సేకరించని సర్కార్
తాజాగా ఒక్క పంచాయతీలోనూ చెత్తను సేకరించని వైనం
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా వ్యాధులు ప్రబలుతున్నా పారిశుద్ధ్యం ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, నగరాల మాదిరిగానే రాష్ట్రంలోని దాదాపు 90 శాతానికి పైగా గ్రామాల్లో గత మూడేళ్లు కనీసం రెండు రోజులకు ఒకసారి ఇంటింటా చెత్త సేకరణ జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేసే క్లాప్ మిత్రలు ప్రతి రోజూ తమ పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరించేవారు. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా గత రెండున్నర నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపట్టే పంచాయతీల సంఖ్య నామమాత్రంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెబ్‌సైట్ ప్రకారం శనివారం (ఆగస్టు 24వ తేదీ) రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఐదేళ్ల క్రితం కూడా ఇవే పరిస్థితులు నెలకొనగా మాజీ సీఎం వైఎస్ జగన్ 2021లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించారు. గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దాదాపు 14 వేల దాకా మూడు చక్రాల రిక్షాలు, వెయ్యి చెత్త సేకరణ ఆటోలతో పాటు గ్రామాల్లో దోమలు నియంత్రణకు ఫాగింగ్ కోసం 10,628 యంత్రాలు, 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, 6,417 శానిటరీ వేస్ట్ ఇన్సినేటర్స్‌లను ప్రభుత్వ నిధులతో మంజూరు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు 75 వేల కోట్ల టన్నుల తడి, పొడి చెత్తను గ్రామాల్లో ఇంటింటా సేకరించారు. దీన్ని వర్మీ కంపోస్టుగా మార్చి విక్రయించడం ద్వారా ఆయా గ్రామాలు ప్రాథమిక దశలో రూ.5 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని పొందాయి. ఇప్పుడు గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోవడంతో రోగాలు ముసురుకుంటున్నాయి.
మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీ
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆర్టీపీసీఆర్ కిట్ విశాఖలో తయారైంది. ఏపీ మెడ్‌టెక్‌జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. ఈ ఆర్‌టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణపత్రం అందించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతిని పొందింది. గంటలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఈ కిట్ ద్వారా తేలనుంది. కోవిడ్–19 మాలిక్యులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్‌లలో వీటిని తయారు చేసి ప్రయోగాలు నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వజిరానీ వెల్లడించారు.
నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమలో వానలు
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తేమ గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి దిశగా వస్తున్నాయి. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు గోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలకు ఆస్కారముంది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 29, 30, 31 తేదీలు, సెప్టెంబర్ మొదటి వారంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
మార్చి 31లోపు రిటైరయ్యే వారికి బదిలీ వద్దు
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయవద్దని, వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయాలంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉద్యోగులకు కూడా బదిలీలను వర్తింప చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో 15 శాఖలకు బదిలీలు వర్తింప చేయగా ఇప్పుడు 16వ శాఖగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌కు
వర్తింప చేశారు.
మలేరియాలో కుప్పం మహిళ గల్లంతు
తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: మలేరియా రాజధాని కౌలాలంపూర్‌లో ఫుట్‌పాత్ కుంగిపోవడంతో కుప్పం అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి (45) అనే మహిళ మురుగు కాలువలో పడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణం గాలింపు చర్యలు చేపట్టే విధంగా మలేషియా అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా ఏపీ ఎన్‌ఆరీ్టఎస్‌ను ఆదేశించారు. మహిళ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ, గాలింపు చర్యలు పగడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. మలేషియాలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని, శనివారం రాత్రి వరకు గల్లంతైన విజయలక్ష్మి ఆచూకీ తెలియలేదని ఏపీ ఎన్‌ఆరీ్టఎస్ అధికారులు
వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment