జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా! | Today is World Zoonoses Day | Sakshi
Sakshi News home page

జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా!

Published Sat, Jul 6 2024 5:51 AM | Last Updated on Sat, Jul 6 2024 5:51 AM

Today is World Zoonoses Day

మూగజీవాల పెంపకంపై పెరిగిన ఆసక్తి

వ్యాధులపై అప్రమత్తత అవసరం

నేడు ప్రపంచ జునోసిస్‌ డే

రాజమహేంద్రవరం రూరల్‌ /రాయవరం/ కాకినాడ సిటీ: మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం అవి మానవ జీవితంతో ముడిపడ్డాయి.. నిన్న మొన్నటి వరకూ సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్‌ సింబల్‌గా మారింది. అలాగే గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. 

ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జునోసిస్‌ డే సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం రండి.

ఆ పేరు ఎలా వచ్చిందంటే..
పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్‌ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్‌ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం జరుపుకొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..
తూర్పుగోదావరి జిల్లాలో వీధికుక్కలు 1,15,771, పెంపుడు కుక్కలు 26,562, ఆవులు 74,778, గేదెలు 1,93,847, గొర్రెలు 1,71,263, మేకలు 69,265, పందులు 2,080 ఉన్నాయి. కోనసీమ జిల్లాలో మొత్తం పెంపుడు జంతువులు 63,953 ఉన్నాయి. ఇందులో కుక్కలు 22,570 ఉండగా, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు 41,383 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పశువైద్య శాలలు, ప్రాంతీయ, వెటర్నటీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లలో జూనోటిక్‌ వ్యాధుల నివారణకు శనివారం ఉచితంగా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాకు 32 వేల యాంటీ రేబిస్‌ టీకాలు సిద్ధం చేశారు. 

ఏ వ్యాధులు వస్తాయంటే..
పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్‌వార్మ్‌ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, సోల్మోనెల్లోసిస్, క్యూ–ఫీవర్, మేంజ్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్‌ వార్మ్, హైడాటిడోసిస్, మీసిల్స్, మంప్స్, మేంజ్‌ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి. 

వైద్యుల సలహాలు తప్పనిసరి
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్‌ డిసీజస్‌ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సరైన వ్యాక్సిన్‌ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. జునోసిస్‌ డే సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్‌ వర్కర్లకు, జంతువధ శాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్‌ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి, తూర్పుగోదావరి

సకాలంలో టీకాలు వేయించాలి 
వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలి.  –డాక్టర్‌ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, అమలాపురం 

వ్యాధులుసంక్రమించకుండా టీకాలు
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్‌ డిసీజస్‌ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏటా జునోసిస్‌ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకోవడం ఆనవాయితీ. పశు­వుల వ్యాధుల పట్ల మరిన్ని సలహాల కోసం ప్రభుత్వం 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రేబిస్‌ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులైన కుక్కలకు టీకాలు వేయించాలి.
–ఎస్‌.సూర్యప్రకాశరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ  సంచాలకుడు, కాకినాడ

శుభ్రత.. భద్రత
ముఖ్యంగా పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం బాగా పెరిగింది. పెంపుడు జంతువులతో ఆటలాడిన తర్వాత శుభ్రత పాటించకుంటే వ్యాధులకు గురవుతుంటారు. జంతువులను పెంచుకునే వారు తగిన జాగ్రత్తలు పాటించకుంటే వాటి నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో రేబిస్, ఆంత్రాక్స్‌ వంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులపై దాడి చేయకుండా యజమానులూ జాగ్రత్త పడాలి.

వ్యాక్సిన్‌ తప్పనిసరి
పెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. కుక్కులకు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లులు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్‌ అవసరాన్ని గుర్తించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement