పది రోజులుగా వరుసగా అకాల వర్షాలు రైతన్నలను కొలుకోలేని దెబ్బ తీశాయి. చేతికొచ్చిన పంటలు తుడిచిపెట్టుకుపోయి అన్నదాత అతలాకుతలమయ్యాడు.
శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : పది రోజులుగా వరుసగా అకాల వర్షాలు రైతన్నలను కొలుకోలేని దెబ్బ తీశాయి. చేతికొచ్చిన పంటలు తుడిచిపెట్టుకుపోయి అన్నదాత అతలాకుతలమయ్యాడు. శామీర్‌పేట్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ సీజన్‌లో వంద ఎకరాల్లో పత్తి, 8వందల ఎకరాల్లో మామిడి, వెయ్యి ఎకరాల్లో వరితో పాటు మరో 2వేల ఎకరాల వరకు ఇతర కూరగాయలు సాగు చేశారు. అయితే పది రోజులుగా ఈదురుగాలులు, వర్షాలకు పంటల్లో 80శాతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మండలంలోని లాల్‌గడిమలక్‌పేట్, శామీర్‌పేట్, బాబాగూడ, అలియాబాద్, పొన్నాల్, బొమ్మరాశిపేట్, కొల్తూర్, అనంతారం, పోతారం, నారాయణపూర్ తదిత ర గ్రామాల్లో అత్యధికంగా వరి, కూరగాయలతో పాటు మామిడి తోటలు ఉన్నాయి.
వరి ఎకరాకు 30నుంచి 40క్వింటాళ్లు, కూరగాయలు ఆశించిన మేరకు పండుతాయని రైతులు ఆశతో ఉన్నారు. అకాల వర్షాలు, వడగళ్లు వారి ఆశలను గల్లంతు చేశాయి. కనీసం వరి ఎకరాకు 10క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. ఆనంతారం, పోతారం, మూడుచింతలపల్లి, నాగిశెట్టిపల్లి, కేశవరం, బొమ్మరాశిపేట్, పోన్నాల్, లక్ష్మాపూర్‌లలో 150 ఎకరాల్లో 80శాతం నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.