ఖరీఫ్ కష్టాలు | Farmers hopes on Southwest monsoon | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ కష్టాలు

Published Mon, Jun 16 2014 3:13 AM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM

ఖరీఫ్ కష్టాలు - Sakshi

ఖరీఫ్ కష్టాలు

ఖమ్మం వ్యవసాయం : ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ ముందుగా నిర్దేశించిన విధంగా విత్తనాలు అందుబాటులో లేవు. పత్తి, మొక్కజొన్న సీడ్స్ ప్రైవేట్ కంపెనీలు విక్రయిస్తున్నప్పటికీ.. వరి, జీలుగు, పిల్లిపెసర, పెసర, జనుము, మినుము, కంది తదితర విత్తనాలు ఏపీ సీడ్స్ ద్వారానే సరఫరా చేయాల్సి ఉంది.

జిల్లాలో పత్తి, వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం సుమారు 1.80 లక్షల హెక్టార్లు కాగా, వరి సుమారు 1.37 లక్షల హెక్టార్లు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం వరి విత్తనాలు సుమారు 24 వేల క్వింటాళ్లు అవసరం కాగా, ప్రస్తుతం ఏపీ సీడ్స్ వద్ద 7,420 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి.
 
బీపీటీ 5204 రకం 12,500 క్వింటాళ్లకు గాను 4 వేల క్వింటాళ్లు, ఎంటీయూ-1001 రకం 6 వేల క్వింటాళ్లకు గాను, 200 క్వింటాళ్లు, ఎంటీయూ -1061 రకం 2,500 క్వింటాళ్లకు గాను 220 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎంటీయూ -1010 రకం మాత్రం 3 వేల క్వింటాళ్లకు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ఇక భూసారాన్ని పెంచే జీలుగు, పిల్లిపెసర, జనుము వంటి విత్తనాలకూ కొరతే ఉంది. వీటిని పూర్తిస్థాయిలో తెప్పించడంలో ఏపీ సీడ్స్ విఫలమైందని రైతులు అంటున్నారు. జీలుగు విత్తనాలు 10 వేల క్వింటాళ్ల సరఫరా లక్ష్యం కాగా, సహకార సంఘాలకు 5 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు.
 
పిల్లిపెసర 4 వేల క్వింటాళ్లకు 1000 క్వింటాళ్లు అందుబాటులోఉన్నాయి. జనుము 300 క్వింటాళ్లు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ కోరగా, ఇంత వరకు వాటి జాడే లేదు. పెసర 295, 460 రకం విత్తనాలు రెండూ కలిపి 500 క్వింటాళ్లు కావాలని కోరగా ప్రస్తుతం 200 క్వింటాళ్లు మాత్రమే సిద్ధంగా ఉంచారు. మినుము, కంది వంటి విత్తనాలకు ఇంకా మోక్షమే లేదు.
 
భూసారం పెరిగేదెలా..?
మాగాణి భూముల్లో భూసారాన్ని పెంచేందుకు వరి సాగుకు ముందు తొలకరి వర్షాలు కురియగానే జీలుగు, పిల్లిపెసర, జనుము, పెసర విత్తనాలు వేస్తారు. 45 రోజుల తర్వాత ఈ పంటలను దున్ని వరి సాగు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఈ విత్తనాలు పూర్తి స్థాయిలో అందలేదు. దీంతో భూసారం పెరగడం కష్టమేనని రైతులు వాపోతున్నారు. జీలుగు, పిల్లిపెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. వీటితోనైనా భూసారం పెంచుకోవచ్చని భావించిన రైతులకు అక్కడా నిరాశే ఎదురైంది. ఈ విత్తనాలను సైతం పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. ఇక వరి విత్తనాలైనా పూర్తిస్థాయిలో అందిస్తారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు.
 
 విత్తనాల ధరలు ఇలా..
 వరి విత్తనాలను నిర్ణీత ధరపై కిలోకు రూ.5 చొప్పున సబ్సిడీపై అందజేయాలని నిర్ణయించారు. బీపీటీ-5204 రకం కిలో రూ.27.50 కాగా, రూ.22.50 చొప్పున, ఎంటీయూ-1001 రకం ధర రూ.25 కాగా, రూ.20కి, ఎంటీయూ -1010 రకం ధర రూ.24.60 కాగా, రూ.19.60కి, ఎంటీయూ-1061 ధర రూ.26.20 కాగా, వీటిని రూ.21.20కి రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. జీలుగు కిలో రూ.30.86 కాగా, వీటిని 50 శాతం సబ్సిడీపై రూ.15.43 చొప్పున, పిల్లిపెసర కిలో రూ.57.96 కాగా, రూ.28.98 పైసలకు, జనుములు రూ.41.76 కాగా, రూ.20.88కి అమ్మాలని నిర్ణయించారు. పెసర కిలోకు రూ.88 కాగా, వీటికి రూ.29.25 పైసలు, మినుములు రూ.74 కాగా, రూ.24.50, కందులు రూ.59 కాగా, రూ.19.50 సబ్సిడీ ఇచ్చి విక్రయించాల్సి ఉంది. అయితే ఆ విత్తనాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో అధిక ధర వెచ్చించి ప్రైవేటు డీలర్ల వద్ద కొనక తప్పేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
విత్తనాలు సరఫరా చేస్తాం : ఏపీ సీడ్స్ మేనేజర్
రైతులకు అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేస్తామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వరి విత్తనాలు వరంగల్, కరీంనగర్, తణుకు, నిడమనూరు వంటి ప్రాంతాల నుంచి రావాల్సి ఉందని చెప్పారు. జీలుగులు ఢిల్లీ నుంచి, పిల్లిపెసర, పెసర, జనుము, మినుము, కంది విత్తనాలు గుంటూరు నుంచి రావాల్సి ఉందన్నారు. గోడౌన్‌లలో సిద్ధంగా ఉన్న వరి విత్తనాలను ఒకటి, రెండు రోజుల్లో సహకార సంఘాలకు సరఫరా చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement