రుణమాఫీ వర్తించలేదని ఐదుగురు రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు.
కోడేరు: రుణమాఫీ వర్తించలేదని ఐదుగురు రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. కోడేరు మండలంలోని జనుంపల్లి గ్రామానికి చెందిన అంకె శివమ్మ, శ్రీపురం గోపాల్, రాఘవేందర్, ఎర్రోళ్ల కుర్మయ్య, మంతయ్యలు 2013లో నాగర్‌కర్నూల్ మండలంలోని గుడిపల్లి ఐసీఐసీఐ బ్యాంకులో రూ.లక్ష వరకు పంట రుణం తీసుకున్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ వర్తించలేదు.
దీంతో తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి, తిరిగి విసుగు చెందారు. దాంతో వారంతా శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని, వెంట తెచ్చుకున్న విషపు గుళికలను మింగేందుకు యత్నించారు. అక్కడున్న కొందరు వారిని వారించి తహశీల్దార్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయన వారి వద్దకు చేరుకుని రుణ హామీ వర్తింపజేస్తామని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు.