నల్లగొండ అగ్రికల్చర్ : లక్ష్యం కొండంత..ఇచ్చింది గోరంత.. ఇదీ రబీ పంట రుణాల తీరు. శాసనసభ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల హామీల పుణ్యమా అని అన్నదాతలకు పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపలేదు. అసలు బ్యాంకుల చెంతకు అన్నదాతలను చేరనివ్వని పరిస్థితి. పంటరుణం కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే ఖరీఫ్‌లో తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించి కొత్త రుణం అడగాలని అధికారులు తిరకాసు పెట్టారు. దీంతో ఇదేమి గోల అనుకుని రైతులు వాటివైపు కన్నెత్తిచూడలేదు. జిల్లాలో గత ఖరీఫ్‌లో పంట రుణలక్ష్యం రూ.1,253.93 కోట్లు కాగా, బ్యాంకులు రైతులకు పంట రుణం ఇచ్చింది కేవలం రూ.698.22 కోట్లు. అంటే 55.68 శాతం మాత్రమే రైతులు పంటరుణాలను అందుకున్నారు. అదే విధంగా ఈ రబీలో రుణలక్ష్యం రూ.835.95 కోట్లుగా నిర్దేశించగా, రైతులకు సీజన్ ముగిసినప్పటికీ ఇచ్చింది కేవలం రూ.138.32 కోట్లు. అంటే 16.55 శాతం మాత్రమే పంటరుణాలను ఇచ్చారంటే బ్యాంకులకు రైతులపై ఏమాత్రం చిత్తుశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల హామీ ఎఫెక్టేనా?
శాసనసభ ఎన్నికల ముందు అధికార టీఆర్‌ఎస్ పార్టీ లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, మరోవైపు ప్రతిపక్ష కూటమి రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీల ఎఫెక్ట్ రబీ పంట రుణాలపై స్పష్టంగా కనిపించింది. రుణమాఫీని ఎప్పటినుంచి పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టం చేయకపోవడంతో బ్యాంకులు రబీ రుణాలను ఇవ్వాలంటే ఆలోచనలో పడ్డాయి. ఇచ్చినవాటిని ఎప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుందోనని, మళ్లీ రుణాలిచ్చి ఎందుకు ఇబ్బందులు పడాలన్న ముందుజాగ్రత్తగా బ్యాంకర్లు రబీ రుణాలను ఇవ్వకుండా బ్రేక్ వేసినట్లు సమాచారం. ఎవరైనా రైతులు బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఖరీఫ్ రుణాలను చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వారు అటువైపు వెళ్లలేదు.
పెట్టుబడుల కోసం తిప్పలు
రైతులు రబీ పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బ్యాంకుల వారు దరిచేరనియకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పులు పుట్టని రైతులైతే బంగారు ఆభరణాలను కుదవపెట్టి నగదు తెచ్చుకుని రబీ పంటలను సాగు చేసుకున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ రాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రబీ పంటల సాగు ఇలా
రబీ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 76,531 హెక్లార్లు కాగా, ఇప్పటివరకు 47,674 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వరి 45,603 హెక్టార్లు, జొన్న 10, మొక్కజొన్న 19, పెసర 60, మినుము 35, ఉలువలు 53, శనగలు 141, వేరుశనగ 1753 హెక్టార్లు సాగు చేశారు.
దా‘రుణం’..!
Published Thu, Jan 31 2019 10:03 AM | Last Updated on Thu, Jan 31 2019 10:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment