
రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన రైతులు
మాడ్గుల: గ్రామాల్లోని రైతుల వద్దకే నేరుగా వచ్చి భూసమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామంటూ అధికారులు డబ్బా కొట్టుకోవడమే తప్ప ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అంటూ రైతులు రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. మాడ్గుల మండలం ఆర్కపల్లిలో మంగళవారం తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆర్కపల్లితో పాటు పరిసర గ్రామాలు, తండాలకు చెందిన 180 మంది రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలు పెట్టుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు కేవలం ముగ్గురు రైతుల అర్జీలు మాత్రమే పరిష్కరించి, మిగతా 177 అర్జీలను పెండింగ్‌లో పెట్టారు.దీంతో రైతులు గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారుల తీరు వల్లనే ఇక్కడ ఇన్ని సమస్యలు పేరుకుపోయాయని, వారిని మీరు అజామాయిషీలో పెట్టనందుకే మా వద్ద డబ్బులు తీసుకుని మా భూముల రికార్డులు సక్రమంగా నమోదు చేయలేదంటూ తహసీల్దార్ చంద్రశేఖర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆర్కపల్లి శివారులో 450 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిని 600 పైచిలుకు ఎకరాలను రైతుల పేర ఉన్నట్లు రెవెన్యూ అధికారులు, మధ్యవర్తులు రికార్డులు సృష్టించారని ఇప్పుడు భూముల లెక్కలు ఎలా సక్రమంగా ఉంటాయని రెవెన్యూ ఉన్నతాధికారులు మరోమారు సర్వేలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment