కన్నీళ్లే గిట్టుబాటు! | Farmers Worried on Tomato Prices Down in Rangareddy | Sakshi
Sakshi News home page

కన్నీళ్లే గిట్టుబాటు!

Published Fri, Apr 3 2020 10:13 AM | Last Updated on Fri, Apr 3 2020 10:13 AM

Farmers Worried on Tomato Prices Down in Rangareddy - Sakshi

తాను పండించిన కూరగాయలతో కృష్ణ

టమాట రైతులను కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. మూడు నెలలపాటు శ్రమిస్తే.. వారికి నష్టాలే మిగిలాయి. టమాటను తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులూ వెళ్లని దుర్భరస్థితి. కరోనా కాటు నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌.. టమాట రైతుల పొట్టకొడుతోంది. ఎంతో ఆశతో పంట సాగుచేసిన రైతులు ధరలు లేక దిగాలు చెందుతున్నారు.   

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కూరగాయల సాగుకు జిల్లాకు పెట్టింది పేరు. ముఖ్యంగా టమాట గణనీయంగా సాగవుతోంది. రబీ సీజన్‌లో సుమారు 20 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను రైతులు చేశారు. ఇందులో ఎక్కువ భాగం టమాటదే. 7,752 ఎకరాల్లో ఆరు వేల మంది రైతులు టమాట సాగు చేశారు. గరిష్టంగా 8 టన్నుల దిగుబడి వస్తుంది. కనిష్టంగా ఆరు టన్నుల పంట తీయవచ్చు. ఇలా ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 62 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుతం పెద్ద ఎత్తున పంట మార్కెట్‌కు వస్తోంది. అయితే, ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. కిలో టమాటకు కనీసం రూ.3 కూడా దక్కడం లేదు. 25 కిలోలు ఉండే బాక్సును మార్కెట్లోకి తీసుకెళ్తే.. కనీసం రూ.40 కూడా దక్కని దయనీయ పరిస్థితులు ఉన్నాయి. రూ.40 వేల పెట్టుబడి పెట్టి ఒక్కో ఎకరాలో సాగు చేసిన రైతుకు.. పెట్టుబడుల్లో కనీసం నాలుగో వంతు కూడా రావడం లేదు. తెంపిన కూలీ, మార్కెట్‌కు రవాణా ఖర్చులు కూడా వెళ్లడం లేదు. దీంతో చాలా మంది రైతులు తెంపకుండా పంటను వదిలేశారు. 

షాబాద్‌ మండలం కేశవగూడలో చేనులోనే వదిలేసిన టమాటాలు
ఎందుకీ పరిస్థితి..?
సాధారణంగా వేసవిలో టమాటకు చెప్పుకోదగ్గ రీతిలో ధర ఉంటుంది. లాక్‌డౌన్‌ కొనసాగుతుండటమే ధరలు లేదని మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో వచ్చిన దిగుబడిలో 50 శాతం నగరంలోని గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, కొత్తపేట రైతుబజార్, ఎన్‌టీఆర్‌ నగర్‌ మార్కెట్‌కి వెళ్తుంది. ఇక్కడ నగర అవరాలకుపోను మిగిలింది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. మిగిలిన 50 శాతం పంటలో కొంత జిల్లా ప్రజల అవసరాలకుపోను.. తక్కింది నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు రైతులు తీసుకెళ్తారు. లాక్‌డౌన్‌ కావడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. నగరంలో నివసించే వారిలో చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లారు. అలాగే శుభకార్యాలు కూడా వాయిదా పడ్డాయి. అంతేగాక గత రబీ సీజన్‌తో పోల్చితే ఈ సారి దాదాపు 1,300 ఎకరాల్లో అధికంగా పంట సాగైంది. దీంతో డిమాండ్‌ తక్కువగా ఉండి.. దిగుబడి ఎక్కువైంది.

పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు
చేవెళ్ల: చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామానికి చెందిన రైతు వీరేశం ఎకరం విస్తీర్ణంలో వంకాయలు, రెండు  ఎకరాల్లో టమాట పంట సాగుచేశాడు. రూ.50వేలకు పైగానే పెట్టుబడికింద ఖర్చు చేశాడు. వేసవి కాలం పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయని, ఈ సీజన్‌లో కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉంటుందని భావించాడు. బోరుబావిలో నీళ్లు తగ్గుతున్నా రోజు విడిచి రోజు ఎంతో కష్టపడి పంటలను బతికించుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. కానీ, మార్కెట్‌లో ధరలు లేవు. వంకాయ కిలో రూ.5లోపే పలుకుతోంది. టమాటలు సైతం కిలో రూ.3 నుంచి రూ.5 పలుకుతున్నాయి. కూరగాయలను మార్కెట్‌కు తీసుకువస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా కూరగాయలు బయట మార్కెట్‌లకు పోవటం లేదు. వ్యాపారులు కూడా రావటం లేదు. స్థానిక మార్కెట్‌లో కొంత మంది రైతులవి చిరువ్యాపారులు కొంటున్నారు. దీంతో కొన్ని మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఎంతో కష్టపడి పంట సాగుచేస్తే ఖర్చులు కూడా రావడం లేదని వీరేశం ఆవేదన వ్యక్తం చేశాడు.   

బాక్స్‌ ధర రూ.150 పలికితేనే రైతుకు ఊరట
చేవెళ్ల: నందిగామ మండలం శ్రీనివాసులగూడెం గ్రామానికి చెందిన రైతు ఎల్‌.మల్లారెడ్డి రెండు ఎకరాల్లో  టమాట పంట సాగు చేశాడు. ప్రస్తుతం దిగుబడి వస్తోంది. చేవెళ్ల మార్కెట్‌కు  గురువారం 57 టమాట బాక్స్‌లను తీసుకొచ్చాడు. మార్కెట్‌లో ఒక బాక్స్‌(25కిలోలు) రూ.60కి అమ్ముడుపోగా.. మార్కెట్‌ ఫీజులు, హమాలీపోను ఆయన చేతికి రూ.3వేలు వచ్చాయి.    ఇంకా ఆటో కిరాయి వెయ్యి రూపాయలు, టమాటలు తెంపిన కూలీలకు వెయ్యి రూపాయలు పోతే  మిగిలింది చివరకు ఆయన మిగిలింది వెయ్యి రూపాయలే. రెండు ఎకరాల టమాట పంటను సాగు చేసేందుకు దాదాపు 30 వేలకుపైగా ఖర్చుచేశాడు. ఇవే ధరలు ఉంటే అతని చేతికి వచ్చేది దాదాపు 5వేలే. ఈ ఐదు వేలలో.. తాను పెట్టిన పెట్టుబడులు రావాలి, కుటుంబం గడవాలి. ఎలా సాధ్యమవుతుందని మల్లారెడ్డి వాపోయాడు. బాక్స్‌ టామాట ధర కనీసం రూ.150 పలికితే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయని అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement