తండ్రి మరణించినా.. స్వదేశం రాలేక..! | Father Died In Jagtial Son And Daughter In Foreign Countries Amid Corona | Sakshi
Sakshi News home page

తండ్రి మరణించినా.. స్వదేశం రాలేక..!

Published Mon, May 4 2020 9:04 AM | Last Updated on Mon, May 4 2020 9:16 AM

Father Died In Jagtial Son And Daughter In Foreign Countries Amid Corona - Sakshi

జగిత్యాల ‌: కరోనా వైరస్‌.. ఈ మహమ్మారి కన్న తండ్రిని చివరి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తోంది. పిల్లల ఉన్నతిని కాంక్షిస్తూ వారిని విదేశాలకు పంపిస్తే.. అక్కడి నుంచే ఆన్‌లైన్లో అంత్యక్రియలను చూడాల్సి వస్తుందని వారు కలలో కూడా అనుకొని ఉండరు. ఈ హృదయవిదారకర సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌.. చివరకు కనిపెంచిన వారిని చివరి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తోంది. తండ్రి చనిపోతే తలకొరివి పెట్టాల్సిన కొడుకులు రాలేని దుర్భర పరిస్థితి. చివరకు బంధువులు, స్నేహితులు స్వగ్రామంలో తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తుంటే, ఆన్‌లైన్‌లో చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. దేశం కాని దేశంలో ఉండలేక, స్వదేశానికి రాలేక ఆ బిడ్డలు కన్నీళ్లతోనే తమవారిని తలచుకుంటున్నారు. కరోనా కాటేయడమే కాకుండా, మానవ సంబంధాలను కూడా కనుమరుగు చేస్తుందనడానికి ఆదివారం జరిగిన ఓ సంఘటన అద్దం పడుతోంది.

కూతురు అమెరికాలో.. కొడుకు న్యూజిలాండ్‌లో..
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన వూట్కూరి అశోక్‌రెడ్డి జగిత్యాల జిల్లాకేంద్రంలో సీనియర్‌ న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు. కూతురు అమెరికాలో ఉంటుండగా, కొడుకు న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన అశోక్‌రెడ్డి ఆదివారం మృతిచెందాడు. కరోనా లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమానాలు నడవకపోవడంతో, ఇతర దేశాల్లో ఉన్న కొడుకు, కూతురు రాలేకపోయారు. దీంతో ఆయా దేశాల్లో ఉన్న వారి పిల్లలు నాన్న అశోక్‌రెడ్డికి తలకొరివి పెట్టే పరిస్థితి లేక అక్కడే తండ్రిని తలుచుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి చివరి చూపునకు పిల్లలు నోచుకోలేకపోయారని ఆయన భార్య విలపించడం అంత్యక్రియలకు హాజరైనవారికి కన్నీళ్లు తెప్పిచింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో వారి బంధువులతో తలకొరివి పెట్టించి అశోక్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు.

నివాళి..
35 ఏళ్లుగా సివిల్, క్రిమినల్‌ కేసులు వాదించిన ఆయన.. ఆ గ్రామానికి రెండుమార్లు సర్పంచ్‌గా సైతం పని చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ పటిష్టతకు కృషి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, అశోక్‌రెడ్డి మృతిదేహంపై బీజేపీ జెండా కప్పి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మోరపల్లి సత్యనారాయణరావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, ఏసీఎస్‌ రాజు, ఇతర పార్టీల నాయకులు, జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.

నాన్నంటే ప్రాణం
నాన్నంటే ప్రాణం. రోజు ఫోన్లో మాట్లాడుతుండేవాడు. నాన్న లేడంటే నమ్మలేని పరిస్థితి. చివరకు కడసారి చూపునకు కూడా నోచుకోలేక కన్నీళ్లను దిగమింగుతున్నాం. అమ్మతో గంటకోసారి మాట్లాడుతూనే ఉన్నా.
– కావ్య, అమెరికాలో ఉన్న అశోక్‌రెడ్డి కూతురు

ఉండలేకపోతున్నా..
నా మనస్సంతా నాన్న మీదే ఉంది. ఇక్కడ ఉండలేకపోతున్నా. నాన్నకు అంత్యక్రియలు కూడా చేయలేకపోయా. విమానాలు ఇప్పటికిప్పుడు నడిచే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచే నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
– క్రాంతి, న్యూజిలాండ్‌లో ఉన్న అశోక్‌రెడ్డి కొడుకు   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement