వీధికెక్కిన గడీ వివాదం! | Fighting Between Heirs For Domakonda Fort In Nizamabad | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 8:37 AM | Last Updated on Sun, Jun 10 2018 8:37 AM

Fighting Between Heirs For Domakonda Fort In Nizamabad - Sakshi

తాళాలు వేసి, ఫ్లె్లక్సీలు కట్టిన కోట వారసులు

సాక్షి, కామారెడ్డి/దోమకొండ: ప్రసిద్ధి గాంచిన దోమకొండ గడీ వారసత్వ పోరు వీధికెక్కింది. సంస్థానాధీశుల వారసులు కోటలోని భవనాలను స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. దశాబ్దాల కాలంగా వారసత్వ పోరు నడుస్తున్నప్పటికీ శనివారం రాజా ఉమాపతిరావ్‌ వారసులు కోటలోని ముఖ్య భవనాలకు తాళాలు వేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు కట్టడంతో వ్యవహారం మరోమారు రచ్చకెక్కింది.

ప్రస్తుతం గడీలో మరో వారసుడు అనిల్‌ కామినేని (నటుడు చిరంజీవి వియ్యంకుడు) గడీకోటలో గత పది పదిహేనేళ్లుగా మరమ్మతులు చేయిస్తూ, అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. ఆయన కూతురు ఉపాసన, అల్లుడు రామ్‌చరణ్‌ పలుమార్లు కోటలోని మహదేవుని ఆలయంలో పూజలు సైతం నిర్వహించారు. ఇప్పుడు మరో వారసుడు కోటలోని భవనాలు తమవేనంటూ తాళం వేయడంతో పోరు తారాస్థాయికి చేరింది. 

ఆది నుంచీ వివాదాలే.. 
అనిల్‌ కామినేని నటుడు చిరంజీవితో వియ్యం అందుకున్న సందర్భంలో కోటలో మరమ్మతులు జరిగాయి. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్‌ తేజ, అనిల్‌ కామినేని కూతురు ఉపాసనల వివాహానికి ముందు కొన్ని కార్యక్రమాలు కోటలోనే నిర్వహించారు. కోటలోని భవనాలన్నింటినీ మరమ్మతులు చేయడంతో పాటు మహదేవుని ఆలయాన్ని పునర్నిర్మించారు. మహదేవుని ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, దానికి మరమ్మతులు చేయడం అప్పట్లో వివాదాలకు తావిచ్చింది. కోటలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న ఎండపల్లి లింబయ్య అనే వ్యక్తి కామారెడ్డి కోర్టులో కేసు సైతం దాఖలు చేశాడు.

మరమ్మతులు జరుగుతున్నపుడే మిగతా వారసుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. గడీ ప్రహరీ, మహదేవుని ఆలయం మాత్రమే పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. మిగతా భవనాలు రూపు మారకుండా మరమ్మతులు చేయడానికి మాత్రం పురావస్తు శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని అడ్డు పెట్టుకుని గడి లోపలికి సామాన్య ప్రజల రాకపోకలను పూర్తిగా కట్టడి చేశారు. ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. కాగా భవనాలు తమవేనంటూ కొందరు వారసులు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

అసలు పోరు ఇదే.. 
దోమకొండ గడీలో పలు భవనాలు ఉన్నాయి. ఇందులో అద్దాల మేడ, ఉమా మహాల్, వెంకట్‌ భవన్, ఆగన్న భవంతి పేరుతో ఉన్న భవనాలు ప్రైవేటు ఆస్తులుగా ఉన్నాయి. ఆయా భవనాలను తమకు చెందినవని అనిల్‌ కామినేని కొంత కాలంగా చెబుతూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, శనివారం దోమకొండ గడీకోటకు వచ్చిన ఇతర వారసులు.. ఆస్తుల పంపకాల్లో వెంకట్‌భవన్‌ అనిల్‌ కామినేనికి, అద్దాల మేడతో పాటు అందులోని బావి రాజేశ్వర్‌రావ్, సత్యనారాయణరావ్‌లకు, ఉమా మహాల్‌ రాజేశ్వర్‌ భూపాల్‌లకు చెందినవంటూ ఆయా భవనాలకు తాళాలు వేసుకున్నారు. గడీకోటలోని గడీకోటలోని సిబ్బందిని బయటకు పంపి.. వెంకటపతిభవన్‌ గేటుకు, ఉమా మంజిల్, అద్దాలమేడ, క్లాక్‌ టవర్‌ గేటుకు వారు తాళాలు వేశారు. కోటలోని అస్తులు ప్రైవేట్‌ ఆస్తులని, అవి మూడు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తులని పేర్కొంటూ ఫ్లెక్సీలను గడీకోటలోని భవనాలు, ఇతర ప్రదేశాల్లో కట్టారు. 

వెంకటపతి భవన్‌ మాత్రమే కామినేని అనిల్‌దని, మిగతావి తమ ఆస్తులని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ తమ వద్ద ఉన్నాయని సత్యనారయణరావ్, రాజేశ్వర్‌రావు తెలిపారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు, డీపీవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. గడీకోట వివాదంపై జిల్లా పంచాయతీ అధికారి రాములును ‘సాక్షి’ వివరణ కోరగా.. తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టామని, కుటుంబానికి సంబంధించిన సమస్య అయినందున వారే పరిష్కరించుకోవాలని సూచించామని బదులిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement