ప్రాదేశిక పోరు
ప్రాదేశిక సమరానికి తెరలేచింది. సోమవారం జిల్లా పరిషత్ ఎన్నికలకు కలెక్టర్ టి.చిరంజీవులు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పంచాయతీరాజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
స్థానిక ఎన్నికల పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ 835, జెడ్పీటీసీ 59 స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీక రిస్తారు. 20వ తేదీ నాటికి నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వీలుగా జెడ్పీ కార్యాలయంలో 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి అధికారులను మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగాను, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు వ్యవహరిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సీపీఓ డిప్యూటీ డెరైక్టర్ మోహన్‌రావు వ్యవహరిస్తారు.
అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు...
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు, వారిని గెలిపించుకునే బాధ్యత వరకు రాజకీయ పార్టీల మీదనే ఆధారపడి ఉంది. దీంతో పార్టీ జెండా మోసిన వారిని కాకుండా ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలబడితే తమ పని మరింత సులువుగా ఉంటుందని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపించుకోన్నట్లయితే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము గట్టెక్కడం అసాధ్యమన్న భావన వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది.
స్థానికంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటూనే సాధారణ ఎన్నికల్లో లాభసాటిగా ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైన సరే కాంగ్రెస్‌ను మట్టికరిపించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు పొత్తులపై విశ్లేషణ చేస్తున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ల జాతర ప్రారంభం కానున్నప్పటికీ రాజకీయ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఏటూ తేలకపోవడం దీనికి అద్దం పడుతోంది.
నామినేషన్లు వేసే అభ్యర్థులు పాటించాల్సినవి...
జెడ్పీటీసీ స్థానాలకు బీసీ/ఎస్సీ/ఎస్టీ/బీసీ ఈ (ముస్లింమైనార్టీలు)లు రూ.2,500, ఇతరులు 5,000
ఎంపీటీసీ స్థానాలకు బీసీ/ఎస్సీ/ఎస్టీ/బీసీఈ రూ.1250, ఇతరులు రూ.2500 జనరల్ స్థానాల్లో పోటీ చే సే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కూడా ఇదే రాయితీ వర్తిస్తుంది రిజర్వేషన్లు వర్తింపచేసుకునే అభ్యర్థులు తహసీల్దారు/మీ సేవా కేంద్రాల నుంచి కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. బీసీ‘ఈ’ అభ్యర్థులు కూడా కుల ధ్రువీకరణ సమర్పించాలి.
అంగన్‌వాడీ వర్కర్లు, ప్రభుత్వ నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు, ఉద్యోగులు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
రేషన్‌డీలర్లు, కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నవారు పోటీకి అర్హులు.
ఎంపీటీసీ అభ్యర్థులు పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి.
అయితే వారిని ప్రతిపాదించే వారు మాత్రం సంబంధిత ఎంపీటీసీ పరిధిలో ఓటరు అయి ఉండాలి. ఉదాహరణకు ఎంపీటీసీ 1 వ స్థానంలో పోటీ చేసే అభ్యర్థికి పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఓటు ఉండొచ్చుగానీ, ప్రతిపాదించే వ్యక్తికి మాత్రం 1వ స్థానంలో ఓటు హక్కు ఉన్నవారే బలపర్చాలి.
జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లాలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో ఓటు హక్కు ఉన్న వారు పోటీకి అనర్హులు. బలపర్చే అభ్యర్థికి స్థానిక మండలంలోనే ఓటు హక్కు ఉండాలి.
నామినేషన్ వేయడానికి ముగ్గురు వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థి రాని పక్షంలో ప్రతిపాదించే వ్యక్తులకు కూడా ఇదే వర్తిస్తుంది.
30.5.1995కు పూర్వం ఇద్దరు సంతానానికి పైబడి ఉన్నవారు పోటీకి అర్హులు.
ఆ తర్వాత ఇద్దరికి మించి సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు.
ముగ్గురు సంతానంలో ఒకరు మరణించినట్లయితే అలాంటి అభ్యర్థులు పోటీకి అర్హులు.
ముగ్గురు సంతానంలో ఒకరిని ఇతరులకు దత్తత ఇచ్చినప్పటికి కూడా వారు పోటీకి అనర్హులు.
ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు కలిగి ఉండి ఒక భార్యకు ఒకరు, మరొక భార్యకు ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాల్లో పోటీ చేసేందుకు భార్యలకు అవకాశం ఉంటుంది కానీ, భర్తలకు పోటీ అర్హత ఉండదు.