టికెట్ వస్తుందో రాదోనని టెన్షన్.. తీరా వచ్చాక అన్ని ప్రధాన పార్టీల గుండెల్లో మోగిన రె‘బెల్స్’.. నిన్నటి వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని దారికి తెచ్చుకునేందుకు తంటాలు..
- ఇక పోటాపోటీ
- తప్పుకున్న రెబల్స్
- పార్టీలకు లైన్ క్లియర్
- ప్రచారాస్త్రాలకు పదును
- గ్రేటర్ అసెంబ్లీ బరిలో 511 మంది
- లోక్‌సభ స్థానాలకు పోటీలో 91 మంది
సాక్షి, సిటీబ్యూరో: టికెట్ వస్తుందో రాదోనని టెన్షన్.. తీరా వచ్చాక అన్ని ప్రధాన పార్టీల గుండెల్లో మోగిన రె‘బెల్స్’.. నిన్నటి వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని దారికి తెచ్చుకునేందుకు తంటాలు.. ఇప్పుడిక బుజ్జగింపులు, బేరసారాలు ముగిశాయి. అన్నీ సర్దుకున్నాయి. ఉత్కంఠకు తెరపడింది. అసలు పోరు షురూ అయింది. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో విస్తృత ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మరోపక్క ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు అధికారులు సన్నాహాల్లో మునిగారు.
ప్రధానంగా ఈవీఎంలపై దృష్టి సారించారు. ఒక్కో ఈవీఎంలో 16 మీటలుండగా, ఒకటి నోటాకు కేటాయించారు. ఇదిపోను దీనిపై 15 పార్టీ గుర్తులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు పోటీలో ఉన్నచోట రెండేసి ఈవీఎంలు ఉండాల్సిందే. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 13,150 ఈవీఎంలను సిద్ధం చేశారు.
అసెంబ్లీ స్థానాలకు 511 మంది..
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 511 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలతో పాటు పలువురు స్వతంత్రులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెబల్స్‌ను బరి నుంచి తప్పించడంలో ప్రధాన పార్టీలు సఫలమయ్యాయి.
గోషామహల్, పటాన్‌చెరులలో బీజేపీ రెబల్ అభ్యర్థులు నందకిశోర్‌వ్యాస్, సి.అంజిరెడ్డి పోటీ నుంచి తప్పుకోలేదు. ఇంతకుమించి చెప్పుకోదగ్గ రెబల్స్ ఎవరూ ఆయా పార్టీల్లో బరిలో లేరు. గ్రేటర్‌లోని అంబర్‌పేట నియోజకవర్గంలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 31 మంది, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌లలో 29 మంది తుది పోరులో నిలిచారు. అత్యల్పంగా కంటోన్మెంట్ నుంచి పది మంది పోటీలో మిగిలారు.
లోక్‌సభ స్థానాల్లో 91 మంది..
గ్రేటర్ పరిధిలోని 4 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. సికిం ద్రాబాద్ లోక్‌సభకు 34 అర్హమైన నామినేషన్లు ఉండగా, శనివారం నలుగురు పోటీ నుంచి తప్పుకున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా 15 మంది మిగిలారు. మల్కాజిగిరి లోక్‌సభ నుంచి 30 మంది, హైదరాబాద్ లోక్‌సభ నుంచి 16 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు.
బెట్టు చేసి.. మెట్టు దిగి..
ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా ఉన్న సామ రంగారెడ్డి, కాచం సత్యనారాయణ, మల్కాజిగిరి కుమార్, శోభారాణి, ఎస్.వెంకటసుబ్బయ్య, సునీతప్రకాశ్‌గౌడ్, నగేశ్ ముదిరాజ్, జి.సాల్మన్‌రాజు, జగదీశ్వర్‌గౌడ్, మొవ్వా సత్యనారాయణ, పీఎల్ శ్రీనివాస్, ఉప్పల శారద, నదీముల్లా తదితరులు పార్టీ అధినేతల బుజ్జగింపులు, హామీలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ రెబల్స్‌కు దానం, సబితా, టీడీపీ రెబల్స్‌కు చంద్రబాబునాయుడు తగు హామీలిచ్చి మెత్తబరిచారు.
పోటీలో ప్రముఖులు
అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ప్రకాశ్‌గౌడ్, అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖేశ్‌గౌడ్, కె.లక్ష్మణ్, జి.బాల్‌రెడ్డి, ముఠాగోపాల్, కూన శ్రీశైలంగౌడ్, కొలను శ్రీనివాసరెడ్డి, ఆర్.కృష్ణయ్య, సుధీర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బిక్షపతియాదవ్, ముక్కా రూపానందరెడ్డి, ముంతాజ్‌అహ్మద్‌ఖాన్, బద్దం బాల్‌రెడ్డి, జయసుధ, విజయారెడ్డి, జాఫర్‌హుస్సేన్, మల్‌రెడ్డి రంగారెడ్డి, జి.సాయన్న, పాషాఖాద్రి, మోజంఖాన్, బలాల, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. లోక్‌సభ స్థానాలకు పోటీలో ఉన్న ప్రముఖుల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భగవంతరావు పవార్ (హైదరాబాద్), బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్, భీమ్‌సేన్, సయ్యద్ సాజిద్‌అలీ, ఛాయారతన్ (సికింద్రాబాద్), సర్వే సత్యనారాయణ, వి.దినేశ్‌రెడ్డి, జేపీ, డాక్టర్ నాగేశ్వర్, మల్లారెడ్డి (మల్కాజిగిరి) ఉన్నారు.