అరుణమ్మా.. మజాకా! | Galla aruna kumari conducts postal ballot | Sakshi
Sakshi News home page

అరుణమ్మా.. మజాకా!

Published Sat, Apr 26 2014 8:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

అరుణమ్మా.. మజాకా!

అరుణమ్మా.. మజాకా!

‘దేశం’ కల్యాణ మండపంలో 27న పోస్టల్ బ్యాలెట్!
 
చంద్రగిరి, న్యూస్‌లైన్ : చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వారి పోస్టల్ బ్యాలెట్‌ను ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా తెలుగుదేశం నేత కల్యాణమండపంలో నిర్వహించేలా చూసుకున్నారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులు, ఇతర ఉద్యోగులకు సంబంధించి 600 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఓటూ కీలకంగా మారిన తరుణంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈ ఓట్లపై కన్నేశారు. గుంపగుత్తగా ఈ ఓట్లన్నీ తనకే పడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేతకు చెందిన టీఎల్‌ఆర్ కల్యాణ మండపంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించేలా మంత్రాంగం నడిపారు.

ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 27న టీడీపీ నేత పీ.లవ్‌లీ రెడ్డి కల్యాణ మండపంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. గతంలోనూ పీవోల శిక్షణ తరగతులు ఇక్కడే నిర్వహించారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్‌ను సైతం ఇదే కల్యాణ మండపంలో నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవడం వెనుక పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోనున్న 600 మంది ఉద్యోగుల వివరాలు శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రికి చేరాయని తెలిసింది. ఆమె ఫ్యాక్టరీ సిబ్బంది పోస్టల్ బ్యాలె ట్‌లోని ఉద్యోగులకు ఫోన్ చేసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నారు. ‘‘ఓటు కల్యాణ మండపంలో వేయండి.. పక్కనే ఉన్న పీఎల్‌ఆర్ క్యాండీ హోటల్‌లో భోజనం ఏర్పాటు చేశాం.. తినండి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మీ కోసం కవర్ ఉంటుంది తీసుకెళ్లండి’’ అంటూ ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీనిపై కొందరు ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా చంద్రగిరిలో పెద్ద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం అందుబాటులో ఉన్నాయి. అయినా అధికారులు పోస్టల్ బ్యాలెట్ కోసం టీడీపీ వారి కల్యాణమండపం ఎంపిక చేయడం మాజీ మంత్రి కోసమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement