
మిర్చి విత్తన చట్టం ముసాయిదాకు తుది రూపు!
► వ్యవసాయ మంత్రి పోచారంతో న్యాయ శాఖ కార్యదర్శి భేటీ
► త్వరలో కేబినెట్ ముందుకు ముసాయిదా..
► గవర్నర్ ఆమోదం అనంతరం అసెంబ్లీకి బిల్లు
సాక్షి, హైదరాబాద్: మిర్చీ విత్తన చట్టం–2017 ముసాయిదాకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తుది రూపు తీసుకొచ్చారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ ముసాయిదాను ప్రవేశపెడతామని, గవర్నర్ ఆమోదంతో ఆర్డి నెన్స్ తీసుకొస్తామని తెలిపారు. తదుపరి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
బుధవారం ఈ మేరకు మంత్రి పోచారంతో న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు సమావేశమయ్యారు. మిర్చీ నకిలీ విత్తనాల విక్రయదారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టంలో కఠిన అంశాలను పాందుపరిచామని తెలిపారు. అయితే ఖరీఫ్ కంటే ముందే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావించినా అది ఆలస్యమైంది.
అన్ని విత్తనాలకు అన్నారు కానీ...
2007లో ఉమ్మడి రాష్ట్రంలో పత్తి పంటకు నష్టం జరిగితే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే ఏపీ కాటన్ సీడ్స్ యాక్ట్–2007ను తీసుకొచ్చారు. అందులో పత్తికి తప్ప మిగతా పంటలకు సంబంధించి నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే పరిహారం ఇప్పించే అంశం లేదు. దీంతో ఇతర పంటలకు సంబంధించిన విత్తనాల్లో కల్తీ జరిగితే పరిహారం ఇప్పించేందుకు కొత్త చట్టం అవసరమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలకు చట్టం అవస రమని భావించింది. పత్తి తర్వాత అత్యధికంగా రైతు లు నకిలీ విత్తనాలతో నష్టపోయేది మిర్చితోనేనని భావించిన ప్రభుత్వం ఆ ఒక్కదానికే పరిమితమైంది. దీంతో ఇతర నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు.
కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ
తాజా విత్తన ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో జిల్లా వ్యవసా యాధికారి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా ఉద్యానాధికారి, సంబంధిత పంటకు సంబం ధించిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు, విత్తన ఉత్పత్తి దారులు సభ్యులుగా ఉంటారు. నకిలీ విత్తనా ల కారణంగా మిర్చి పంటకు నష్టం వాటిల్లితే జిల్లా కమిటీనే పరిహారం ఇప్పిస్తుంది.
నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగిన రైతు వ్యవసాయ క్షేత్రాల్లో కమిటీ పర్యటించి నష్టం విలువను అంచనా వేస్తుంది. ఆ ప్రకారం కంపెనీలను పిలిపించి పరిహారం ఇప్పిస్తుంది. అవసరమైన శిక్షలను ఖరారు చేస్తుంది. జిల్లాస్థాయి కమిటీలో రైతు తనకు న్యాయం జరగలేదని భావిస్తే రాష్ట్రస్థాయి కమిటీకి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్డినెన్స్ జారీ చేశాక నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. కంపెనీలు ఎంత నష్టపరి హారం చెల్లించాలి, వాటి యాజమాన్యాలకు ఎలాంటి శిక్షలు అమలు చేయాలి, పరి హారం, జైలు శిక్ష రెండూ ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేస్తారు.
ముసాయిదా బిల్లులోని ఇతర ముఖ్యాంశాలు
♦ నకిలీ విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని రైతు లేదా రైతు బృందం జిల్లా కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వొచ్చు.
♦ రైతుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన అధికారి, ఉద్యోగి, ఏజెన్సీ, డీలరు ఇలా ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవచ్చు.
♦ మిర్చి విత్తన కంపెనీల రిజిస్ట్రేషన్ ఇక ఇష్టారాజ్యంగా చేయడానికి కుదరదు. అందుకోసం సరైన నిబంధనలు రూపొందిస్తారు.