
సాక్షి, భూపాల్‌పల్లి: వేసవి ఇలా ప్రారంభమైందో లేదో అప్పుడే అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గంగారం, తాడ్వాయి అడవుల్లో నిప్పు రగులుకుని వృక్షాలు, జీవరాసులు దగ్ధమయ్యాయి. మంటలు అలాగే కొనసాగుతున్నాయి. తాడ్వాయి నుంచి గంగారం, పస్రా నుంచి తాడ్వాయి, ఏటూరునాగారం వరకు ఉన్న అడవుల్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. పశువుల కాపరులు చుట్ట, బీడీలు కాల్చిన అగ్గిపుల్లను అడవుల్లో వేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు.
ఉడుములు, పాములు, కుందేళ్లు మంటల్లో కాలి బూడిదైనట్లు జంతు ప్రేమికులు వెల్లడించారు. అలాగే వన్య ప్రాణులైన జింకలు, దుప్పులు, మేకలు, కనుజులు, కొండముచ్చులు, తదితర జంతువులు మంటల వేడికి, పొగకు తట్టుకోలేక పరుగులు పెట్టి దాహానికి అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవిలో అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు నిప్పు నివారణకు ఫైర్ లైన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment