మీసం మెలేస్తే..!
ఆయన మీసం మెలేస్తే...! సగటు మనిషికి ఓ భరోసా... సంఘ విద్రోహులకు భయం.. పోలీసు పౌరుషానికి ప్రతీక. పని చేసిన ప్రతి చోటా ఆయన పేరు ఓ ఫైర్ బ్రాండ్. జిల్లాను కలవర పెడుతున్న రోడ్డు ప్రమాదాలు, యువత ఆత్మహత్యల నివారణకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని పోలీసు కళాజాత బృందాలతో కలిసి ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలోనైనా, ఆత్మహత్యల నివారణలో అయినా ప్రజా చైతన్యమే కీలకమంటున్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ‘సాక్షి’తో మాట్లాడారు.
ఫైర్ బ్రాండ్‌గా సంగారెడ్డి డీఎస్పీ
⇒ తాగి బండి నడిపితే జైలుకే..
⇒ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రజా చైతన్యమే కీలకం
⇒ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తిరుపతన్న
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కుగానే ఉన్నాయి. జిల్లాలో రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. 67 నంబర్ ముంబయి జాతీయ రహదారిపై మొత్తం ఏడు యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించాం. పెద్దాపూర్, కంకోల్, బుదేరా చౌరస్తా, హుగ్గెల్లి, గంగ్వార్, చిరాగ్‌పల్లి చౌరస్తా, మల్కాపూర్‌ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టాం. కేవలం ట్రాఫిక్ నియంత్రణ కోసమే రాత్రి వేళలో ఒక మొబైల్ పార్టీతో జాతీయ రహదారి మీద పెట్రోలింగ్ చేస్తున్నాం.
సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంగ్ అండ్ డ్రైవింగ్‌తోనే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలు, పాఠశాలల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అవసరమైనంత స్వేచ్ఛ ఇస్తూనే... వారిని ఒక కంట కనిపెట్టాలి. ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తే ప్రమాదాలు తప్పకుండా తగ్గుతాయి.
ప్రస్తుతానికి హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.500 అధిక స్పీడ్‌కు రూ.1000, ట్రిపుల్ రైడ్‌కు రూ.500 జరిమానా విధిస్తున్నాం. తాగి బండినడిపితే మాత్రం కేసు పెట్టి కోర్డుకు పంపుతున్నాం. తాగి బండి నడిపిన వారు జైలుకు వెళ్లాల్సిందే. ఇవన్నీ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ఒక భాగం మాత్రమే. వీటి ద్వారా 100 శాతం ఫలితాలు సాధించలేము. ప్రజలే చైతన్య వంతులు కావాలి. ఎవరికి వారుగా స్వయం నియంత్రణ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
కళాజాతతో ప్రజల్లోకి వెళ్తాం...
జిల్లాలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్ రికార్డు పరంగా చూసుకుంటే కుటుంబ కలహాలు, అప్పుల బాధతో జరుగుతున్న ఆత్మహత్యలే ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని కూడా క్షణిక ఆవేశంలో లిప్తకాలంలో జరిగిపోతున్న అనర్థాలే. ఒక్క క్షణం మనం వాళ్లను ఆపగలిగితే వాళ్లు జీవితకాలం బతికిపోతారు. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
పోలీసుశాఖ పరంగా మేం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. గతంలో ఉన్న పోలీసు కళాజాతను మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం. గ్రామాల్లో కళాజాత బృందాలను తిప్పుతాం. ఆత్మహత్యల సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. అక్కడ సంచార కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నాం.
గ్యాంగ్ లీడర్‌ను పట్టుకుంటాం..
మీడియా ముందు ప్రవేశపెట్టలేదు గానీ, ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని మాల్ధా అనే ప్రాంతంతో పట్టుకున్నాం. ఇదో ఇంటర్నేషనల్ గ్యాంగ్. ఈ ముఠా నాయకుడు ఖాట్మాండ్‌లో ఉన్నట్లు గుర్తించాం. మాల్ధాలో ఖమ్రుద్దీన్, రాజులషేక్ అనే ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకున్నాం. వారి నుంచి 7.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం. కేసు దర్యాప్తు రీత్యా పురోగతి వివరాలు చెప్పలేను, కానీ త్వరలోనే కీలక వ్యక్తిని అరెస్టు చేసి కనీసం 20 కిలోల బంగారం రికవరీ చూపిస్తాం.
ప్రతి బ్యాంకుకు సాయుధ గార్డులను అనుమతిస్తున్నాం. కచ్చితంగా సాయుధ గార్డులను పెట్టుకోవాలని ఇప్పటికే బ్యాంకులకు నోటీసులు పంపించాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్యాంకుల రక్షణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. రాత్రివేళల్లో కనీసం ఒకటి, రెండు సార్లైనా పోలీసు పార్టీ ఆయా బ్యాంకులను పరిశీలించి రావాలి. అయితే మారుమూల ప్రాంతంలో ఉండే బ్యాంకులు ఒక రోజు లావాదేవీలకు మించి డబ్బు ఉంచుకోవద్దని కోరాం. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే సురక్షితమైన బ్రాంచ్‌లోనే దాచుకోవాలని కోరాం. చోరీల నివారణ కోసం విజువల్ పోలీసింగ్ పద్ధతిని అమలు చేస్తున్నాం. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తారు. ఇలా చేయడం వలన దొంగలకు భయం ఉంటుంది.
భూ పంచాయితీల్లో పోలీసులు తలదూర్చరు..
డీఎస్పీ: భూ తగాదాల విషయంలో పోలీసులు తలదూర్చరు. అది మా పరిధి కూడా కాదు. మా దగ్గరికి ఎవరు వచ్చినా కోర్టులోనే తేల్చుకొమ్మని పంపిస్తున్నాం. అయితే క్లియర్ టైటిల్ ఉండి, భూమిని అనుభవిస్తున్న వారిని బెదిరించి, దురాక్రమణ చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. అప్పు కచ్చితంగా మేం వాళ్ల మీద కేసులు పెడుతున్నాం. కోర్టుకు పంపుతున్నాం. ఇలాంటివి నెలలో కనీసం కనీసం 8 నుంచి 10 కేసులు మా దగ్గరకు వస్తున్నాయి.