వాళ్లే...వీళ్లు..: నాయిని
హైదరాబాద్ : సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితులు... పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినవారు...ఒక్కరే అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. దుండగుల కాల్పుల్లో గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను శనివారం ఆయన పరామర్శించారు. అలాగే దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజు మృతదేహానికి నివాళులు అర్పించారు. అతని కుటుంబ సభ్యులను నాయిని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాగరాజు కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించటంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ నల్లగొండ ఘటనను ఉగ్రవాదుల చర్యలుగా అనుకోవటం లేదన్నారు. అంతర్రాష్ట్ర ముఠా పనే అని ఆయన అన్నారు. అరాచక శక్తులను ఉపేక్షించేది లేదని, సంఘ విద్రోహ శక్తులను సహించేది లేదని నాయిని స్పష్టం చేశారు. నల్లగొండ పోలీసులు ప్రాణాలకు తెగించి దుండగులను పట్టుకునేందుకు యత్నించారన్నారు. ఈ సందర్భంగా నాయిని నల్లగొండ జిల్లా పోలీసుల ధైర్యసాహసాలు ప్రశంసించారు.
సూర్యాపేట కాల్పుల నిందితులు దర్గా వద్ద ఉన్నట్లు సమాచారం రావటంతో పోలీసులు అక్కడకు వెళ్లారని, అయితే అప్పటికే వారు అక్కడ నుంచి పరారయ్యారన్నారు. పక్కనే ఉన్న పొదల్లో మాటువేసిన దుండగులు...పోలీసులపై కాల్పులకు తెగబడ్డారన్నారు. ఈ సందర్భంగా జీపు నడుపుతున్న కానిస్టేబుల్ నాగరాజు కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. అలాగే అదే వాహనంలో ఉన్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య గాయపడినట్లు చెప్పారు. వెనక వేరే వాహనంలో వస్తున్న రామన్నపేట సీఐపై కూడా దుండగులు కాల్పులకు తెగబడ్డారని, ఈ సందర్భంగా ఆయన ఎదురు కాల్పులు జరిపినట్లు చెప్పారు. సూర్యాపేటలో పోలీసుల వద్ద నుంచి ఎత్తుకెళ్లిన తుపాకీ ...దుండగుల వద్ద లభించినట్లు నాయిని తెలిపారు.