బుధవారం మెట్రో రైలులో ప్రయాణిస్తున్న నగరవాసులు, స్టేషన్ వద్ద సందడి
సాక్షి, హైదరాబాద్ : కలల మెట్రోలో తొలిసారి ప్రయాణం.. ఈ ఒక్క అంశం సగటు హైదరాబాదీని ఎంతో ఉద్వేగానికి గురిచేసింది. బుధవారం తొలిరోజే మెట్రో ప్రయాణం కోసం వారిని తొందర పెట్టింది. అంతే మెట్రో జర్నీ కోసం జనం పోటెత్తారు. దీంతో బుధవారం నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ.), అమీర్‌పేట్–మియాపూర్ (13కి.మీ.) మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. మెట్రో జర్నీ కోసం వయోభేదం లేకుండా ప్రజలంతా వేలాదిగా తరలిరావడంతో ప్రతీ మెట్రో స్టేషన్ ప్రాంగణం ఎగ్జిబిషన్‌ను తలపించింది. తొలి రోజు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా మొత్తంగా హైదరాబాదీలతో మెట్రో జర్నీ అదుర్స్ అనిపించింది. మొత్తంగా తొలిరోజు రెండు మార్గాల్లో 14 రైళ్లు పరుగులు తీయగా.. సుమారు 2 లక్షల మంది ప్రయాణించినట్టు మెట్రో అధికారులు వెల్లడించారు.
తొలిరోజు జర్నీ.. యమ స్లో గురూ..
బుధవారం తొలి రోజు నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకో రైలు పరుగులు తీసింది. ఈ మార్గంలో ఒక చివరి నుంచి మరో చివరకు 25 నిమిషాల్లో గమ్యం చేరాలి. కానీ బుధవారం గరిష్టంగా 55 నిమిషాల సమయం పట్టడం గమనార్హం. అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రతి 10 నిమిషాలకు ఓ రైలు రాకపోకలు సాగించింది. ఈ రూట్లో 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవాలి. కానీ 25 నిమిషాలు పట్టింది. ప్రతీ స్టేషన్‌లో రైలును 20 సెకన్లపాటు నిలపాలి. కానీ కొన్నిచోట్ల నిమిషానికి పైగా నిలిపారు. తొలిరోజు ప్రయాణీకులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో స్టేషన్లలో అధిక సమయం రైళ్లను నిలపడం.. రైలు కనీస వేగాన్ని గంటకు 33 కి.మీ.లకుగానూ గంటకు 20 కి.మీ.లకు తగ్గించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. క్రమంగా రైళ్ల వేగం పెరుగుతుందని స్పష్టం చేశారు.
టోకెన్లు.. స్మార్ట్‌కార్డుల తికమక..
ప్రతీ స్టేషన్‌లో మెట్రో జర్నీకి అవసరమైన టోకెన్లు, స్మార్ట్‌కార్డులను ఎలా కొనుగోలు చేయాలో తెలియక తొలిరోజు ప్రయాణీకులు తికమకపడ్డారు. పలు స్టేషన్లలో రెండు వైపుల మాత్రమే కౌంటర్లు ఉండడంతో భారీ క్యూలో నిల్చొని అవస్థలు పడ్డారు. ఇప్పటికే స్మార్ట్‌కార్డులు కొనుగోలు చేసినవారు తిరిగి రీచార్జి చేసుకునేందుకు స్టేషన్‌లోని కౌంటర్‌లో సంప్రదిస్తే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాలేదని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో గందరగోళానికి గురయ్యారు. ఇక బుధవారం అన్ని మెట్రో స్టేషన్లలో కలిపి మొత్తం పది వేల స్మార్ట్ కార్డుల విక్రయించినట్టు అధికారులు తెలిపారు.
పార్కింగ్ తిప్పలు..
రెండు మార్గాల్లో 24 స్టేషన్లకుగానూ నాగోల్, మియాపూర్ డిపోలు, సికింద్రాబాద్‌లోని పాత జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద మినహా మిగతా 21 స్టేషన్ల వద్ద పార్కింగ్ లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలపై వచ్చినవారు అవస్థలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment