సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు సహా ఏడు పురపాలక సంఘాల్లో నాలుగు చోట్ల సొంతంగా కైవసం.. 59 జెడ్పీటీసీ స్థానాల్లో 43 చోట్ల ఘన విజయం.. 59 మండలాల్లో 25 చోట్ల ఎంపీపీలను సొంతం చేసుకునే బలం.. ఈ గణాంకాలు చూస్తే చాలు జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం కనిపిస్తుంది. కానీ, ఈ ఫలితాలు వెలువడిన కేవలం పదిహేను రోజుల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాలనే మూట గట్టుకుంది.
గతంతో పోలిస్తే, ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లను పోగొట్టుకుంది. ఈసారి ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకే పరిమితమైంది. ప్రాదేశిక ఎన్నికలు ముగిసిన రెండు వారాల్లోనే కాంగ్రెస్ ఇలా దెబ్బతినడానికి కారణం ఏమిటి..? ఎవరు దీనికి బాధ్యులు..? ఇప్పుడు ఈ విషయం తేల్చే పనిలోనే పడింది ఆ పార్టీ హైకమాండ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా, ఈ ప్రాంత ప్రజలు తమను గుండెల్లో పెట్టుకుంటారని, ఎన్నికల్లో తమకు గెలుపును పువ్వుల్లో పెట్టి ఇస్తారని భావించిన కాంగ్రెస్ నేతల ఆశలు గల్లంతయ్యాయి. ఈ పరిస్థితి వెనుకున్న బలమైన కారణాలను వెదికే పనిలో పార్టీ నాయకత్వం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించాకే, కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని పార్టీ నేతలు కొందరు ఏఐసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఈ మేరకు ఏఐసీసీ అధినే త్రి సోనియాగాంధీకి లేఖ కూడా రాశారు. ఇంటా బయటి నుంచి టీపీసీసీ నాయకత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో, అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది..? ఎందుకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పడింది. ఈ మేరకు డీ సీసీల నుంచి నివేదికలు కోరింది. కాగా, పార్టీలోని విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా నుంచి ఈ ‘పోస్టుమార్టం’ నివేదిక ఏదీ ఇంకా హైకమాండ్‌కు పంపలేదు.
‘ఎన్నికల ముందు ఎన్నో రకాల విశ్లేషణలతో, ఆయా పార్టీల అభ్యర్థిత్వాల కాంబినేషన్లు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు.. ఇలా, వివిధ నివేదికలు పంపాం. కానీ, ఏం జరిగింది. అసలు ఆ నివేదికలను పట్టించుకున్నారా..? ఇప్పుడు ఫలితాలు వెలువడ్డాక, జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఈ రిపోర్టులు తీసుకుని ఏం చేస్తారు..?’ అని జిల్లా కాంగ్రెస్ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. పెద్దగా ప్రయోజనం ఉండదన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకునే డీసీసీ ఇంకా, నివేదిక పంపలేదని తెలుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్-సీపీఐ కూటమి చెరిసగం సీట్లు గెలుచుకున్నాయి. ఉన్న రెండు ఎంపీ సీట్లతో చెరొక చోట విజయం సాధించాయి. భువనగిరి లోక్‌సభా నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో ఒక విధంగా, నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక విధంగా ఫలితాలు వెలువడ్డాయి. భువనగిరి పూర్తిగా టీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపగా, నల్లగొండ లోక్‌సభ స్థానంలో ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ వశమయ్యాయి. ఓడిపోయిన సీట్లు సహా, ఇరు పార్టీలు సంపాదించిన ఓట్లలో మాత్రం 52,966 ఓట్ల తేడా ఉంది. టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు పొందిన కాంగ్రెస్ - సీపీఐ కూటమి ఆ స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలను మాత్రం దక్కించుకోలేదు.
తక్కువ ఓట్ల తేడాతో స్థానాలనూ కోల్పోయింది. మొత్తంగా తెలంగాణ ఇచ్చామన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడమే తమ వైఫల్యమని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే అంగీకరించారు. ‘అన్ని విషయాలు, అందరికీ తెలిసినవే. ఓటమి కారణాలూ బహిరంగమే. ఇక, ఫలితాలపై ప్రత్యేకంగా చేసే పోస్టుమార్టం ఏం ఉంటుంది. ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి అడుగుతున్న నివేదికలే తప్ప, వీటికి ఏం ప్రయోజనం లేదు’ అని కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. డీసీసీ ఎలాంటి నివేదికను హైకమాండ్‌కు ఇంకా పంపకపోవడం, బహుశా ఈ కారణంతోనే కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘చేతులు’.. కాలాక!
Published Sun, May 25 2014 2:40 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM
Advertisement
Advertisement