
ఇటీవల ప్యారడైజ్–బేగంపేట్ రూట్లో మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్‌తీగలపై తెగిపడిన ఫ్లెక్సీ (ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: మరో వారం రోజుల్లో రుతుపవనాలు సిటీని పలకరించనున్నాయి. ఈదురుగాలులు భారీగా వీచే ప్రమాదం పొంచి ఉంది.. ఈ తరుణంలో మెట్రో రైళ్లకు భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్ వాటిపైనున్న ఫ్లెక్సీలు గండంలా పరిణమించాయి. ఈదురుగాలులు వీచిన ప్రతిసారి ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో తరచూ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఎల్భీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో ఇలాంటివి ఏకంగా 95 భారీహోర్డింగ్‌లు, యూనిపోల్స్ మెట్రో రైళ్లకు శాపంగా మారాయి. వీటిని తొలగించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ విషయమై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ప్యారడైజ్–బేగంపేట్ మార్గంలో ఓ భారీ ఫ్లెక్సీ చిరిగి మెట్రో మార్గంలోని ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడడంతో మెట్రో రైళ్లు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడిన ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. హైటెన్షన్ తీగలు కావడం ..25 కెవి విద్యుత్ ప్రసారం అవుతుండటంతో సుమారు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో సుమారు 20–30 నిమిషాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రూట్లలో మెట్రో రైళ్లు తరచూ నిలిచిపోతుండడంతో ప్రయాణీకుల విలువైన సమయం సైతం వృథా అవుతుండడం గమనార్హం.
అనుభవాల నుంచి పాఠాలు నేర్వని వైనం..
గతంలో తార్నాక, మెట్టుగూడా, అమీర్‌పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లకున్న ఫెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను గుర్తించారు. వీటిని వేరొకచోటికి తరలించాలని బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయితే సదరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణీకుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తొలగించాలని మెట్రో ప్రయాణీకులు,హెచ్‌ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సైతం వీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం.
కాంబి టికెట్‌పై వీడని సందిగ్ధం...
ఆర్టీసీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కాంబిటికెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆయా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో కాంబిటిక్కెట్ అంశంపై నెలకొన్న సందిగ్ధం వీడడంలేదు. ఈ కాంబి టికెట్‌తో తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని..ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉండటంతో ఆర్టీసీ వర్గాలు విముఖంగా ఉన్నట్లు తెలిసింది.
ఏడు కోట్లు దాటిన మెట్రోప్రయాణికులు..
మెట్రో ప్రయాణీకులు ఏడు కోట్ల మార్క్‌ను దాటారు. గ్రేటర్ నగరంలో 2017 నవంబరు 29 నుంచి మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు సుమారు ఏడు కోట్ల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ప్రతివారం ఐదు వేల చొప్పున ప్రయాణికుల సంఖ్యలో పురోగతి ఉన్నట్లు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్భీనగర్–మియాపూర్ రూట్లో నిత్యం 3 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని తెలిపాయి. అధికారుల అంచనాల ప్రకారం ఈ రెండు రూట్లలో నిత్యం 6 లక్షలమంది రాకపోకలు సాగిస్తారని మెట్రో ప్రారంభానికి ముందు అంచనా వేయగా..అందులో సగం మార్కును దాటకపోవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో వాణిజ్యకార్యకలాపాలు మెట్రో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి.
లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి అవే తిప్పలు..
ఇక మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణీకులకు కష్టాలు తప్పడంలేదు. స్టేషన్‌లలో దిగి క్యాబ్‌లు, ఆటోల్లో ఇంటికి చేరుకునేందుకు రూ. వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో ఛార్జీలకంటే ఈ బాదుడు రెట్టింపు స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఎల్భీనగర్ నుంచి మెట్రోరైలులో మియాపూర్ మెట్రో స్టేషన్‌లో దిగిన వ్యక్తి అక్కడి నుంచి లింగంపల్లికి క్యాబ్‌లో బయలుదేరితే సుమారు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. మెట్రో టిక్కెట్ ఛార్జీ రూ.60 కాగా..క్యాబ్ చార్జీ అంతకు మూడింతలకు పైగానే ఉండడం గమనార్హం. గతంలో మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు మెర్రీ గో అరౌండ్ బస్సులను నడపాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణలో సాధ్యపడలేదు. దీంతో సిటీజన్లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ తిప్పలు తప్పడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment