వరద గోదారి | Flood godari | Sakshi
Sakshi News home page

వరద గోదారి

Published Tue, Jul 12 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

వరద గోదారి

వరద గోదారి

విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
 
 సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి వరద ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి 51 అడుగులకు చేరింది. అటు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 30 అడుగుల (9.92 మీటర్లు)కు, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద 33 అడుగులకు (11.2 మీటర్ల)కు చేరుకుంది. దీంతో భద్రాచలం, రామన్నగూడెంలలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం వద్ద వరద 12 మీటర్లకు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక భారీగా వరదలు పోటెత్తుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యూరు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

 ఆదిలాబాద్ అతలాకుతలం
 నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భైంసా పరిధిలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీటితో బైపాస్ రోడ్డు, వంతెన నీట మునగడంతో 12 మంది చిక్కుకుపోయారు. వారిని సహాయక సిబ్బంది కాపాడారు. వేమనపల్లి మండలంలో ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని 18 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 32 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బెజ్జూరు మండలంలో తీగలబర్రె వాగు ఉప్పొంగడంతో తలాయి, ఇక్కపల్లి, భీమారం గ్రామాలు రెండు రోజుల నుంచి జల దిగ్బంధంలో ఉన్నాయి. ఆసిఫాబాద్, ఖానాపూర్ మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ మండలం వాంకిడి వద్ద తాత్కలిక వంతెన కొట్టుకుపోవడంతో వాహనాలను జాతీయరహదారి మీదుగా మళ్లించారు.

 కాళేశ్వరం వద్ద ఉధృతంగా..
 కరీంనగర్ జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. సోమవారం సాయంత్రానికి కాళేశ్వరం వద్ద నీటిమట్టం 11.2 మీటర్లకు చేరింది. కాళేశ్వరం దిగువన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెనను తాకేంతగా వరద ప్రవహిస్తోంది. నీటిమట్టం 12 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరితే మహదేవపూర్ మండలంలోని పలు లోతట్టు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో.. అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి కమ్మునీటితో మండలంలోని పెద్దంపేట వాగు ఉప్పొం గింది. దాంతో నాలుగు రోజులుగా పెద్దం పేట, లెంకలగడ్డ, పంకెన, మోదేడు, పలి మెల, అప్పాజీపేట, బోడాయిగూడెం, సర్వాయిపేట, దమ్మూరు, బూర్గుగూడెం, నీలంపల్లి, వెంచంపల్లి, ముకునూర్, తిమ్మటిగూడెంలకు రాకపోకలు స్తంభించాయి. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో వాగు వద్ద చిక్కిపోయూరు. వాగుకు ఇటు పక్కన ఉన్న అంబట్‌పల్లి, సూరారం తదితర గ్రామాల్లో బంధువులు, తెలిసినవారి ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇక గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని గోదావరిలో నాటు పడవలు తిప్పడాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు నిషేధించారు.

 భద్రాచలంలో పరవళ్లు..
 ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచ లం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో గోదావరి విశ్వరూపం చూపిస్తోంది. వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య కిలోమీటర్ మేర రహదారి నీటిలో మునిగిపోయింది. స్తంభాలు దెబ్బతిని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాజేడు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన నీట మునిగింది. దూలాపురం, పూసూరు, కాసారం ప్రాంతాల్లో పంట పొలాల్లో వరద నీరు చేరింది. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, సీతమ్మ వారి నారచీరలు, సీతవాగుకు భారీగా నీరు చేరడంతో రామాయణ దృశ్యాలు నీట మునిగాయి. భద్రాచలం స్నానఘట్టాలపైకి వరద నీరు చేరింది. గోదావరి కరకట్ట స్లూయిస్‌ల లీకేజీతో భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీలోకి వరద నీరు వచ్చింది. దీంతో కాలనీ వాసులను సమీపంలోని పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు.

 శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద
 వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గెడ్డన్న వాగు నుంచి 18 వేల క్యూసెక్కులు, స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 12 వేల క్యూసెక్కులు కలిపి మొత్తంగా 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం ఒక్కరోజులోనే 1.5 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (90 టీఎంసీలు) కాగా... సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,050.40 అడుగుల (6.42 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో గతేడాది ఇదే రోజున 1,057.80 అడుగుల (11.34 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువన మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
 
 ప్రాజెక్టులకు జలకళ
 భారీగా వచ్చి చేరుతున్న వరదతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కొమురం భీమ్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ఐదు గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 24 వేల క్యూసెక్కులు ఉండగా.. 25,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 700 అడుగులుకాగా.. 695.13 అడుగుల వరకు నీరు చేరింది. ఇంకా 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో.. అధికారులు తొమ్మిది గేట్లు ఎత్తి 99,400 క్యూసెక్కులు వదిలిపెడుతున్నారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 138.3 మీటర్లుకాగా.. సోమవారం సాయంత్రానికి 138.25 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 8,600 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 158 క్యూసెక్కులుగా ఉంది.
 
 చెరువుల్లో ఆశాజనకం
 ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులకు నీటి కళ వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2,300 చెరువులకు వెయ్యి చెరువులు నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలో మొత్తంగా 4,500 చెరువులకు 1,900 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. మరో వెయ్యి చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. మహబూబ్‌నగర్‌లో 30 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా.. మరో 400 చెరువులు నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరంగల్‌లో 69, నల్లగొండలో 50 చెరువులు పూర్తిస్థాయిలో నిండినట్లు చిన్న నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా భూగర్భ జలాలు భారీగా క్షీణించడంతో చెరువుల్లోకి నీటి ప్రవాహాలున్నా అవి ఇంకిపోతున్నాయని... ప్రస్తుత వర్షాలు మరిన్ని రోజులు కొనసాగితే గోదావరి బేసిన్‌లోని చెరువులన్నీ నిండుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
 నీట మునిగిన పంటలు
 వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండ లం రామన్నగూడెం, గొంటైని పం టలు నీట మునిగాయి. రాంనగర్, కోయగూడ ఎల్లాపురం, లంబాడీతండా జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రాంనగర్-రామన్నగూడెం మధ్య కాజ్‌వేపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ గ్రామా ల వారికి మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా రుు. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారు లు సోమవారం పడవలు ఏర్పాటు చేశా రు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు రెం డు ఇళ్లు కూలిపోయాయి. వర్షాలతో కరీం నగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లలో నీరు చేరి బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు స్తంభించారుు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాం పూర్, రెబ్బెన, బెల్లంపల్లి గనుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement