విదేశీ పెట్టుబడులకే పెద్దపీట | foreign interest | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులకే పెద్దపీట

Published Thu, Apr 2 2015 2:32 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

విదేశీ పెట్టుబడులకే పెద్దపీట - Sakshi

విదేశీ పెట్టుబడులకే పెద్దపీట

  • 2015-2020 పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం
  •  మౌలిక వసతుల కల్పన రంగం, అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యం
  •  పరిశ్రమల కోసం 15 నుంచి 20 లక్షల ఎకరాల భూ సేకరణ
  •  పరిమితంగానే రాయితీలు
  •  విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులతోనే సరి
  •  రాయితీలకు కాలపరిమితిపై పారిశ్రామిక వర్గాల్లో అసంతృప్తి
  • సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడులకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015-2020 పారిశ్రామిక విధానాన్ని బుధవారం ప్రకటించింది. మౌలిక వసతుల కల్పన రంగం, అనుబంధ రంగాల అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు 15 నుంచి 20 లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్థానిక వనరులను పరిగణనలోనికి తీసుకుని,  పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది. కేంద్రం  ప్రత్యేక హోదా కల్పిస్తుందని నిరీక్షించిన రాష్ట్రం, అది సాధ్యం కాకపోవడంతో పారిశ్రామిక రాయితీలను పరిమితం చేసింది.
     
    విద్యుత్ చార్జీలు, స్టాంపు డ్యూటీ, వ్యాట్‌ల నుంచి మినహాయింపులే ప్రత్యేకంగా పేర్కొనదగిన వరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపినా.. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే యంత్ర సామాగ్రిపై రాయితీలకు కొత్త విధానంలో చోటు కల్పించలేదు.
     
    తీర ప్రాంతాలను పరిశ్రమల స్థాపనకు అనువైనవిగా గుర్తించినా, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వాయు, జల, రోడ్డు మార్గాల ఏర్పాటునే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంది. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని టార్గెట్‌గా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదిత ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా పరిశ్రమలకు స్వల్పంగానే  రాయితీలను అందించాలని నిర్ణయించింది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ప్రభుత్వ విధానమైనప్పటికీ, భూ లభ్యతకు ఉన్న సందేహాలకు, ఉత్పాదక విద్యుత్ సరఫరాపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు గరిష్టంగా పదేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. కొత్త రాష్ట్రం కావడం, మౌలిక సదుపాయాల కల్పనకు సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉండటంతో.. పరిశ్రమలు స్థాపించి, ఉత్పత్తి మొదలు పెట్టేసరికే రాయితీల కాలపరిమితి తీరిపోతుందని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యాంశాలు..
     
    2029 నాటికి పారిశ్రామికంగా తూర్పు, దక్షిణ ఆసియా  దేశాలతో పోటీ లక్ష్యం.
     
    ఇప్పుడున్న 15 శాతం తయారీ రంగ వృద్ధి రేటును 17 శాతానికి, పారిశ్రామిక వృద్ధి రేటును 20.7 నుంచి 25 శాతానికి పెంచాలి.
     
    ఆహారశుద్ధి, ఫార్మా, బయోటెక్, వైద్య, జౌళి, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, పెట్రోలియం, రసాయనాలు, ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమల్లో వృద్ధి సాధించాలి.
     
    ఇందుకోసం ప్రత్యేకంగా 15 నుంచి 20 లక్షల ఎకరాలతో లాండ్ బ్యాంక్ ఏర్పాటు.
     
    పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి అర్హత, సామర్థ్యాన్ని బట్టి 99 ఏళ్ల పాటు భూముల లీజు.
     
    పారిశ్రామిక టౌన్ షిప్పులు, మెగాపార్కులు, స్టార్టప్ విలేజీల ఏర్పాటు.
     
    పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల్లోనే క్లియర్ చేసేలా  సింగిల్ డెస్క్ ఏర్పాటు. కొన్ని రకాల పరిశ్రమలకు ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూ.1చొప్పున రీ యింబర్స్‌మెంట్ ఉంటుంది.
     
    పారిశ్రామిక అవసరాలకు కొనుగోలు చేసే భూమి లీజుకు, కుదవ పెట్టేందుకు స్టాంప్ డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు.
     
    వ్యాట్, ఎస్‌జీఎస్‌టీ నుంచి.. సూక్ష్మ స్థాయి, చిన్నతరహా పరిశ్రమలకైతే ఐదేళ్ల పాటు 100 శాతం, మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం (7 ఏళ్లు) భారీ పరిశ్రమలకు 50 శాతం (7 ఏళ్లు) మినహాయింపు.
     
    ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా రాయితీలు. స్టాంప్ డ్యూటీలో, భూ బదలాయింపు చార్జీల్లో రాయితీ. విద్యుత్ స్థిర చార్జీల రీయింబర్స్‌మెంట్.  జౌళి, బయో టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన విధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
     
    జౌళి విధానం కింద టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. జిన్నింగ్, ప్రాసెసింగ్, వీవింగ్, డైయింగ్, గార్మెంట్ తయారీ తదితరాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విశాఖ తీరంలో వెయ్యి ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ అపేరల్ సిటీ ఏర్పాటు లక్ష్యం. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు కొత్త విధానంలో భాగం.ఇందులో 956 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయం.
     
     బయోటెక్నాలజీ పాలసీ కింద 120 పాలిటెక్నిక్, 225 ఇంజనీరింగ్, 35 ఫార్మా ఇనిస్టిట్యూట్‌ల ద్వారా నిపుణులను తయారు చేసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 200 ఎకరాలతో విశాఖలో మెగా లైఫ్‌సైన్స్ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ రంగంలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడిని ఆహ్వానిస్తారు.
     
     ఆటోమొబైల్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యం. 318 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి, 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు.ఈ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఆటో క్లస్టర్లలో 50 శాతం సబ్సిడీతో మౌలికవసతులు కల్పిస్తారు. 10 ఏళ్ల పాటు 100 శాతం సీఎస్‌టీ టాక్స్ మినహాయింపు ఇస్తారు. వ్యాట్ ను తిరిగి చెల్లిస్తారు.
     
     విశాఖపట్నంలో కొత్తగా ఎలక్ట్రానిక్ హబ్‌ను ఏర్పాటు చేస్తారు. కాకినాడలో హార్డ్‌వేర్ పార్క్‌తో పాటు రాష్ట్రంలో మరో 20 చోట్ల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు.ఈ పరిశ్రమల ఏర్పాటుకు  స్టాంపు డ్యూటీలో 100 శాతం, రిజిస్ట్రేషన్, సేల్స్ డీడ్‌లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement