ఆ పెంపును ఉపసంహరించాల్సిందే | The increase upasanharincalsinde | Sakshi
Sakshi News home page

ఆ పెంపును ఉపసంహరించాల్సిందే

Published Fri, Feb 6 2015 2:36 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

ఆ పెంపును ఉపసంహరించాల్సిందే - Sakshi

ఆ పెంపును ఉపసంహరించాల్సిందే

  • వైఎస్సార్‌సీపీ డిమాండ్
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను, పెట్రోలు, డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విద్యుత్ చార్జీల పెంపుపై ఒక్క అడుగు ముందుకు పడినా, ఒక్క పైసా చార్జీలు పెంచినా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించింది.

    కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పైసా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, 2013-14లో పెంచిన విద్యుత్ చార్జీలు కూడా తగ్గిస్తామని 2013 ఏప్రిల్ 2న కాకినాడలో తాను చేసిన ప్రకటన కనీసం చంద్రబాబునాయుడుకు గుర్తుందా అని ప్రశ్నించింది. 1994 నుంచి నేటివరకు ఈ 21 ఏళ్ల కాలంలో టీడీపీ మొదటి పదేళ్లు పరిపాలించి ఏటా కరెంటు చార్జీల వాత పెట్టే విధానాన్ని అనుసరించిందని గుర్తుచేసింది. 2004-2009 మధ్య దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలంలో మాత్రమే రాష్ట్రంలో ఏ ఒక్క కేటగిరీకి ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేసింది.

    2004-2009 మధ్య రైతులకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్తు 800 కోట్ల యూనిట్ల నుంచి 1,400 కోట్ల యూనిట్లకు పెరిగినా ఆ ఐదేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఆర్టీసీ చార్జీలు, పన్నులు కూడా పెంచని ఏకైక సువర్ణయుగం అదేనని పేర్కొంది. వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు.. చంద్రబాబు బాటలో నడిచి వేలకోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, ఆనాడు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు టన్నుకు 130 నుంచి 140 డాలర్ల మధ్య ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారని తెలిపింది.

    ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర ఒకప్పటి 110 డాలర్ల నుంచి బ్యారల్‌కు 50 డాలర్లు పడిపోయిందని, బొగ్గు ధరలు కూడా 130-140 డాలర్ల నుంచి 62 డాలర్లకు పడిపోయాయని ఇలాంటి సమయంలో కరెంటు చార్జీలు తగ్గించాల్సింది పోయి పెంచే ప్రయత్నం చేయడం అంటే ప్రజలతో చెలగాటం ఆడటమేనని పేర్కొంది. దేశంలోనే వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ప్రతిపక్ష నాయకుడిగా వాదించిన చంద్రబాబు ఈ రోజున పెట్రో ఉత్పత్తులపై మరో రెండు శాతం వ్యాట్ పెంచడం సిగ్గుచేటని విమర్శించింది. పెంచిన వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. 2013 మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ చార్జీలు పెంచినపుడు చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకోవాలని సలహా ఇచ్చింది.
     
    2013లో చంద్రబాబు ఏం మాట్లాడారు?

    పెంచిన కరెంటు చార్జీలను బేషరతుగా తగ్గించాలని లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని, విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని, ప్రభుత్వ చేతకాని తనానికి ప్రజలు పరిహారం చెల్లించాలా.. అని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు ప్రశ్నించారని గుర్తుచేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు సర్కారుపై తిరగబడాలని చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారని.. మరి ఈ రోజున ప్రజలు చంద్రబాబు సర్కారు మీద తిరగబడరా? అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని 2013 ఏప్రిల్ 1న కాకినాడలో చంద్రబాబు ప్రకటించారని, ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచినా ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement