పెట్రో ధరల పెంపుపై భగ్గు
వైఎస్సార్ సీపీ యువజన
విభాగం ఆధ్వర్యంలో.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ..
కవాడిగూడ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నందుకు నిరసనగా విపక్షాలు భగ్గుమన్నాయి. శనివా రం బషీర్‌బాగ్ చౌరస్తాలో పలు పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో...
వైఎస్సార్ సీపీ హైదరాబాద్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అవినాష్ గౌడ్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టి బొమ్మను బషీర్‌బాగ్ చౌరస్తాలో దహనం చేశారు. అనంతరం అవినాష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ధరల పెరుగుదలతో సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ నగర వైస్సార్‌సీపీ మైనార్టీ అధ్యక్షులు అర్షద్, సేవాదళ్ అధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కాలేరు శ్రీనివాస్‌రావు, నరేందర్ రెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అభిలాష్ గౌడ్, ఫిసాల్, సాహెద్, మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, మాజీద్ ఖాన్ పాల్గొన్నారు.
సీపీఐ ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం
పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెట్రో పెంపును నిరిసిస్తూ ప్లకార్డులు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రం గత 10 రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే నా ధ్యేయం అంటూ బీరాలు పలికిన ప్రధాని మోదీ విదేశీ పర్యటనలతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ గ్రేటర్ సౌత్ జోన్ కార్యదర్శి ఇ.టి. నరసింహ, రాష్ట్ర నాయకులు వి.రాం నర్సింహారావు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు చాయాదేవి, నాయకులు ఆర్.శంకర్‌నాయక్, ఆలేటి యాదగిరి, చంద్రమోహన్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.