⇒ ఇల్లు లేకున్నా భవనం ఉన్నట్లుగా యాజమాన్య ధ్రువపత్రం
⇒ ఫోర్జరీ సంతకాలతో ఆస్తులు మారుస్తున్న ముఠా
⇒ మున్సిపాలిటీలో నకిలీ బిల్లులు
⇒ పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆస్తి కావాలా.. అయితే రూ. లక్ష ఇస్తే చాలు రూ. 10 లక్షల విలువైన భవనాన్ని మీ పేరున ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం.
ఆ తర్వాత బ్యాంక్‌ల ద్వారా రూ. లక్షల రుణం పొందవచ్చని అమాయకులను నమ్మబలికి ఫోర్జరీ సంతకాలతో ఆస్తులను మారుస్తున్న ఓ ముఠా సంగారెడ్డిలో వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని గత నెల 20న పట్టణంలోని బర్మా కాలనీకి చెంది ఈశ్వరమ్మ (ఇంటి నంబర్ 4-7-23/5/7/1) 2008 జూన్ 30 నుంచి ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో మున్సిపల్‌కు ఆస్తి పన్నుతో పాటు నల్లా బిల్లులు చెల్లిస్తోంది. ఇదే ఇంటి నంబర్ 4-7-23/5/71 బాలాజీనగర్‌లో ఉన్నట్లుగా పట్టణానికి చెందిన ఉమర్ తండ్రి సర్దార్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకున్నాడు.
ఇందు కోసం 31 మార్చి, 2014న ఆస్తి పన్ను కట్టినట్లుగా బోగస్ రశీదును సంపాదించారు. కాగా.. మున్సిపాలిటీకి సంబంధించిన నకిలీ ధ్రువ పత్రాలతో పాటు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బోగస్ రశీదులతో పై ఆస్తిని పట్టణానికి చెందిన జహీనుద్దీన్ సాబేర్ తండ్రి ఎండీ ఇసాలుకు ఈశ్వరమ్మకు చెందిన ఆస్తిని 20 జనవరి 2015న రిజిస్ట్రర్ చేయించారు. వాస్తవానికి 4-7-23/5/71 గల ఇల్లు బర్మా కాలనీలో ఉండగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో మాత్రం బాలాజీనగర్‌లో ఉన్నట్లు చూపారు. దీంతో తమ ఆస్తిలో ఇతరులున్నారని జహీనుద్దీన్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చాడు.
కోర్టు ఆర్డర్ చూసి అసలు ఇంటి యజమాని ఈశ్వరమ్మ మున్సిపల్ కమిషనర్‌ను నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. ఆస్తి మార్పు కోసం వినియోగించిన మున్సిపల్ రశీదులు బోగస్ అని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కమిషనర్ నిర్ధారించారు. ఈ మేరకు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ ఆంజనేయులు ఫిబ్రవరి 12న కేను నమోదు చేశారు. కాగా కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుచ్చిన వ్యక్తులు బోగస్ ధ్రువపత్రాలు సమర్పించినట్లు కమిషనర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థానిక కోర్టులో కేసు కొట్టి వేశారు. ఇంత వరకు బాగానే ఉన్న అసలు సూత్రధారులు ఎవ్వరు అనేది పోలీసులు విచారణ జరుపలేకపోయారు.
విచారణలో జాప్యం ఎందుకు..?
ఒక ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా ఇతరుల ఆస్తులను తమ పేర్లపై మార్చుకునేందుకు నకిలీ బిల్లులు సృష్టించిన వ్యక్తులపై మున్సిపల్ కమిషనర్ ఆధారాలతో ఫిర్యాదు చేసి 20 రోజులు కావస్తున్నా.. ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారనే విమర్శలున్నాయి. ఫోర్జరీ సంతకాలకు పాల్పడిన వారు గతంలో సైతం ఇలాంటి వ్యవహారాలతో ఆస్తులకు సంబంధించిన యాజమానుల పేర్లు మార్చి కోర్టులో కేసులు వేస్తూ సెటిల్‌మెంట్ల పేరుతో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లుగా తెలిసింది. తాజాగా ఈశ్వరమ్మ ఆస్తి మార్పులో సైతం ఇదే అంశం తెరపైకి వచ్చింది.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే శాం
ఫోర్జరీ సంతకంతో నకిలీ బిల్లు బుక్కులు లభించిన దానిపై మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వ్యవహరంలో ఎంత మంది ఉన్నారన్న కోణంలో విచారణ చేస్తున్నాం. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు.
- సీఐ ఆంజనేయులు
రూ.లక్ష ఇస్తే.. ఏ ఇల్లైనా మీదే!
Published Wed, Feb 25 2015 11:33 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement