పటోళ్ల నర్సింహారెడఇడ మృతదేహం
జహీరాబాద్ మెదక్ : జహీరాబాద్ మాజీ శాసనసభ్యుడు పట్లోళ్ల నర్సింహారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. 1989 నుంచి 1994 వరకు ఆయన జహీరాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. 1971నుంచి 1976 వరకు మెదక్ జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఒక పర్యాయం జహీరాబాద్ సమితి ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఎమ్మెల్యే కాక ముందు జనతాపార్టీ తరపున ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేసి బాగారెడ్డి చేతిలో ఓడిపోయారు.
అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థిపై గెలుపొందారు. నర్సింహారెడ్డి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య అంతా ఉర్దూలోనే కొనసాగింది. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివి జహీరాబాద్, సంగారెడ్డి కోర్టుల్లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. కోహీర్ మండలం పిచారాగడి ఆయన స్వగ్రామం. గ్రామం పక్కన ఉన్న గురుజువాడలో 4వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకోగా, 5నుంచి 7వ తరగతి వరకు కోహీర్‌లో, 8నుంచి ఉన్నతా భ్యాసం హైదరాబాద్‌లో కొనసాగించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1931లో వ్యవసాయ కుటుంబంలో లక్ష్మారెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించిన నర్సింహారెడ్డి జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు 1951లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1972లో మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసీ టీపీఎస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో ఓటమిపాలయ్యారు. 1978లో జనతాపార్టీ
నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాగారెడ్డి చేతిలో ఓడిపోయారు.
1992 నుంచి 1994 వరకు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. 1994లో రూ.50 లక్షల వ్యయంతో బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్‌ను నిర్మింపజేసి అప్పట్లో సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో ప్రారంభింపజేశారు. నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హమాలీకాలనీ, రాంనగర్, ఫరీద్‌నగర్, కాంతారెడ్డి నగర్ కాలనీలను ఏర్పాటు చేయించి పేదలకు ఇళ్లు మంజూరు చేయించారు.
1994లో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆయనను రాష్ట్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గా పని చేశారు. ప్రస్తుతం అదే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. సోమవారం సాయంత్రం నర్సింహారెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం జహీరాబాద్ పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహంలో ఉంచారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన స్వగ్రామం పిచరాగడిలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. నర్సింహారెడ్డికి భార్య పార్వతమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పలువురి సంతాపం
మాజీ ఎమ్మెల్యే పి.నర్సింహారెడ్డి మృతిపై ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఉంచిన భౌతికకాయం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వై.నరోత్తం, సినీ నిర్మాత ఎం.శివకుమార్, మాజీ ఎమ్మెల్సీ టి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రిటైర్డ్ పించన్‌దారుల సంఘం నాయకులు జి.జనార్ధన్, నేత్రయ్యతో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు నర్సింహారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు.
పిచరాగడిలో విషాదం
మాజీ ఎమ్మెల్యే పి.నర్సింహారెడ్డి మరణంతో ఆయన స్వగ్రాయం పిచరాగడి గ్రామంలో విషాదం అలుముకుంది. నర్సింహారెడ్డి జ్ఞాపకాలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లోనూ ఆయన తన వ్యవసాయ పొలాలకు పాత సైకిల్‌పైనే ప్రయాణించే వారని, సాదాసీదా జీవనాన్ని సాగించే వారన్నారు. ఆయన లేని లోటు గ్రామానికి తీరనిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment