జగన్‌మోహన్ మంతెన (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్ ఉగ్ర దాడులు, ఆపైకవ్వింపు చర్యలను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత మాజీ సైనికులు ప్రకటించారు. రాష్ట్రం నుంచి అనేక మంది యుద్ధవీరులు భారత్–పాకిస్తాన్, చైనా యుద్ధాల్లో పనిచేసిన అనుభవంతో పాటు కశ్మీర్ లోయపైభౌగోళిక అవగాహన కలిగి ఉన్నారు. దీంతో సైనిక సంక్షేమ శాఖకు పలువురు మాజీ సైనికులు తాము దేశం తరఫున మళ్లీ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని బుధవారం సంకేతాలిచ్చారు. వారిలో పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మళ్లీ మిగ్ 21 ఎక్కేస్తా..
‘మన వైమానిక శక్తి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైంది, బలమైంది కూడా. యుద్ధ విమానాలను మనకు సరఫరా చేసిన దేశాలు సైతం వాటిని మనం వినియోగిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపడ్డ ఘటనలు అనేకం’ అని భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా పనిచేసిన జగన్‌మోహన్ మంతెన అన్నారు. మిగ్–21తో పాటు అనేయ యుద్ధవిమానాలు నడపడంలో నిపుణుడైన జగన్ మోహన్.. సైనిక శక్తిపరంగా పాకిస్తాన్‌కు మనకు ఏ పోలికా లేదన్నారు. పుల్వామా ఘటనతో జాతి యావత్తు కలత చెందిందని, ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే ప్రక్రియ విజయవంతం కావడం సంతోషకరమన్నారు. యుద్ధం అనివార్యమైతే తామంతా మళ్లీ మిగ్ విమానాలతో దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇంకెంత మంది చావాలి
‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నన్ని రోజులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారతీయులను బలి తీసుకుంటూనే ఉంటుంది. అందుకే ప్రత్యేక హక్కులను రద్దు చేసేందుకు ఇదే సమయం’ అని 1971లోభారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్‌లింగాల పాండురంగారెడ్డి అన్నారు. పుల్వామా–బాలాకోట్ ఘటనల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేయడం శుభపరిణామమని, ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పీచమణచాలన్నారు. అవసరమైతే మళ్లీ మేమంతా సాయుధులైయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని పాండురంగారెడ్డి చెప్పారు. పాకిస్తాన్ వల్లించే శాంతి వచనాలు నమ్మి మోసపోవద్దని, దృఢమైన రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలన్నారు. జాతి యావత్తు ఒక్కటై ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment