బతుకులు ఆగమాయె!
గజ్వేల్: ‘వానలు లేక మా బతుకులు ఆగమయ్యేటట్టున్నాయ్.. నా రెండెకరాల భూమిలో పత్తి విత్తులు ఇప్పటికే రెండుసార్ల వేసిన.. వానలు లేకపోవడంతో చెడగొట్టిన.. విత్తనాల ప్యాకెట్లు, పెట్టుబడులతో వేల రూపాయలు మట్టిపాలైనయ్.. అయినా కొన్ని రోజుల కింద వానలు వస్తే మూడోసారి ఆశ చావక విత్తనాలు వేస్తే చిన్నగా మొలకలు వచ్చినయ్.. ఇప్పుడు మల్ల వాన వస్తలేదు.. ఇట్లయితే మొలకలు ఎండిపోతయ్.. అంతా ఆగమాగ ముంది..’ అంటూ భారత వ్యవసాయ పరిశోధన మండలి అధ్వర్యంలో ఆదివారం ఇక్కడికి వచ్చిన శాస్త్రవేత్తల బృందానికి గిరిపల్లి గ్రామానికి చెందిన ఓ పత్తి రైతు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ ఒక్క రైతుదే కాదు.. రైతులందరి పరిస్థితి సుమారు ఇలాగే ఉంది.
వర్షాభావం కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేయడానికి పరిశోధన మండలి అధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వరప్రసాద్, డాక్టర్ శోభరాణి, పద్మయ్య, మహేందర్‌కుమార్, డాక్టర్ సతీష్‌తోపాటు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్, గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ గిరిపల్లిలో పర్యటించారు. పొలాల వద్దకు వెళ్లి రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పాశం హన్మంతరెడ్డి, పిట్ల దశరథ, బండారు నాంపల్లి, పడకంటి శ్రీనివాస్‌లకు చెందిన పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులు చాలావరకు పత్తి విత్తనాలు రెండుమూడుసార్లు వేసి తీవ్రంగా నష్టపోయినట్లు గుర్తించారు. మొక్కజొన్న పంటలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వర్షాభావం నెలకొన్నందు వల్ల ఆముదం, పొద్దుతిరుగుడు వంటి ప్రత్నామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలని, ఆయా విత్తనాలకు భారీగా సబ్సిడీ కల్పించాలని ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు.
కాగా రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పంటలు సాగుకు అంత అనుకూలం కావని.. పత్తి, మొక్కజొన్న పంటలు వేసుకునేందుకు మరింత గడువు ఉన్నందున వాటిపై భారీ సబ్సిడీ ఇస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.
అయ్యప్పన్‌కు నివేదిక...
భారత వ్యవసాయ పరిశోధన మండలి అధ్వర్యంలో 10 శాస్త్రవేత్తల బృందాలు తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం జరుపుతున్నట్లు శాస్త్రవేత్త వరప్రసాద్ చెప్పారు. ఇందులో భాగంగానే జిల్లాలోని గజ్వేల్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజులపాటు ఈ అధ్యయనం జరిపి వర్షాభావ పరిస్థితుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, రైతుల ఆకాంక్షలపై ఇండియన్ కౌన్సిల్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ అయ్యప్పన్‌కు నివేదిక అందజేస్తామని, దీనిని బట్టి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందించే అవకాశముంటుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లిలోని పంటలను కూడా ఈ బృందం పరిశీలించింది.