గజ్వేల్: తీవ్ర వర్షాభావం.. కూరగాయల సాగుపైనా కనిపిస్తోంది. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. కాగా హైదరాబాద్ నగరవాసుల అవసరాలకు గజ్వేల్ ప్రాంతమే ప్రధాన వనరుగా మారింది. ఇక్కడ ఉత్పత్తులు తగ్గితే నగరంలో జనం అల్లాడే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. రియల్ భూమ్ ఫలితంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చాలామంది రైతులు భూములను తెగనమ్ముకున్నారు. ఫలితంగా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.
ఇదే సమయంలో గజ్వేల్‌లో సాగు పుంజుకోవడంతో నగర వాసులకు కొంత ఉపశమనం కలిగింది. కాగా ఇక్కడి నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోపాటు చెన్నై, ఇతర రాష్ట్రాల ప్రధాన కేంద్రాలకు కూరగాయలను తీసుకెళ్తారు. కూరగాయల సాగు ప్రస్తుతం వాణిజ్యపంటలకు దీటుగా సాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కురగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి.
ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను ఎంచుకుని ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీలాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందిస్తూ రైతుల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను తమ తమ కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా వున్న తమ బ్రాంచీల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కూరగాయల సాగుకు సాధారణంగా జూన్, జూలై నెలలు అనుకూలం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు భారీ వర్షం కురవలేదు. ఫలితంగా నేల కూడా పూర్తిస్థాయిలో తడవని పరిస్థితి ఏర్పడింది. అయినా ఇప్పటికే ఎంతోమంది కూరగాయల సాగును చేపట్టారు. వర్షాభావం కారణంగా ఎక్కడికక్కడ పంటలు ఎండుముఖం పట్టాయి. బోరుబావుల ఆధారంగా పంటల సాగు కొనసాగుతోంది. గత ఏడాది ఈ సమయానికి 8 వేల ఎకరాలకుపైగా సాగితే ప్రస్తుతం 3వేల ఎకరాలు కూడా దాటలేదు. వర్షాభావం ఇదేవిధంగా కొనసాగితే సాగు విస్తీర్ణం పడిపోనుంది. కేవలం బోరుబావులు కలిగిన రైతులు మాత్రమే ఈ పంటల సాగుకు పరిమితమయ్యే అవకాశం వుంది.
ధరలపై ప్రభావం...
కూరగాయల సాగు ప్రారంభం కాకపోవడం, గత సీజన్‌లో వేసిన ఉత్పత్తులు క్రమంగా తగ్గడం కారణంగా ఇప్పటికే ధరలు మండిపోతున్నాయి. కొన్ని నెలల క్రితం తక్కువ ధరకు లభించిన కురగాయలు ప్రస్తుతం మండిపోతున్నాయి. టమాటా రూ.70, బెండ రూ. 35, బీర రూ.35, వంకాయ రూ.30, పచ్చి మిర్చి రూ.40కి పెరిగాయి. ఇవే కాదు ఇతర కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. సాగు తగ్గితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశముంది.
రెండు ఎకరాల్లోనే సాగు..
పోయినసారి వర్షాలు మంచిగా ఉన్నయ్. ఈపాటికి నేను ఆరు ఎకరాల్లో టమాటా, మిర్చి, వంకాయలా ంటి కురగాయల పంటలు సాగుచేసిన. ఈసారి వర్షాలు లేవు. కురిసిన కొద్దిపాటి జల్లులకు భూమి కూడా తడవలేదు. అందుకని డ్రిప్‌తో రెండు ఎకరాల్లో మాత్రమే పందిరి విధానంలో సొర, చిక్కుడు సాగుచేసిన. బోరుబావిలో నీటిమట్టం పడిపోయిం ది. రెండు ఎకరాలకు కూడా నీరు అందడంలేదు. -గుడిపల్లి భుజేంధర్‌రెడ్డి, రైతు, క్షీరసాగర్, ములుగు మండలం
‘వెజిటబుల్ హబ్’పై కరువు ఛాయలు
Published Mon, Aug 4 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement
Advertisement