వర్షపాతం సాధారణం కంటే దారుణంగా ఉన్నా, చినుకు రాలకపోతే నారు బతకదని తెలిసినా ఆ రైతు సాహసం చేస్తున్నాడు. మిర్చి సాగుకు ఉపక్రమిస్తున్నాడు. ఆయిల్ ఇంజన్ల సాయంతో నీరుతోడి పోస్తున్నాడు. ఖర్చుకు వెనకాడకుండా మిరప నారు కొనుగోలు చేసి మరీ నాటుతున్నాడు. వరుణుడు కరుణించపోతే పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలు కాకతప్పదని తెలిసినా ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నాడు.
ప్రత్తిపాడు : ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఎక్కువ మంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు.దీనికి భిన్నంగా మండలంలోని కోయవారిపాలెంకు చెందిన రైతు పొనకల సాంబయ్య మాత్రం ఐదు ఎకరాల్లో మిర్చి సాగుకు నడుం బిగించాడు. చెరువులు, కుంటల్లోని నీటిని ఆయిల్ ఇంజన్ల సాయంతో తోడి సాగు చేపట్టాడు. మిర్చి పంటపై మమకారంతో సాంబయ్య కొండంత తెగువ చూపుతున్నాడని తోటి రైతులు అంటున్నారు.
మిరప నారు స్థానికంగా అందుబాటులో లేనప్పటికీ పాములపాడు నుంచి కట్ట రూ. 30 నుంచి రూ.40లకు కొనుగోలు చేసి నాటుతున్నాడు.ఈ విధానంలో ఎకరాకు సుమారు 80 కట్టల(పదిహేను వేల మొక్కలు) వరకు నారు పట్టే అవకాశం ఉంది. ఇలా నారు కొనుగోలుకు రూ. 3200, రవాణాకు మరో ఐదు వందల వరకు ఖర్చు చేస్తున్నాడు.
ఎకరా మిర్చి నారు నాటేం దుకు కూలీలకు మూడు వేలు (అది కూడా కాంట్రక్ట్ ఇస్తేనే) చెల్లిస్తున్నాడు. ఆయిల్ ఇంజన్ల ద్వారా సుమారు రెండు మూడు వందల మీటర్లు పైపు వేసి దగ్గర లో ఉన్న పంటకాలువలు, చెరువులు, కుంటల నుంచి నీరు తోడుతున్నాడు. దీనికి మరో ఐదు వందల వరకు ఖర్చు పెడుతున్నట్టు చెబుతున్నాడు. మొత్తం మీద ఎకరాకు దాదాపు రూ. ఐదువేలపైగానే ఖర్చు చేస్తున్నాడు.
ఇంత చేసినా వానలు కురిస్తేనే నాటిన నారైనా బతికేదని చెబుతున్న రైతు వరుణుడిపై భారం వేస్తున్నాడు. నీరు పెట్టి నారును బతికించుకునే పరిస్థితి ఉండదని, వానలు కురవకపోతే ఇప్పుడు చేసిన ఖర్చంతా మట్టిలో పోసినట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
సాధారణ వర్షపాతం.. గత మూడు నెలల్లో మండలంలో కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే జూలై మినహా మి గిలిన రెండు నెలలు సాధారణం కంటే దారుణంగా ఉంది.
జూన్ నెలలో సాధారణ వర్షపాతం 89 మి.మీ కాగా 5.2 మి.మీ కురిసింది. జూలైలో సాధారణ వర్షపాతం 138 మి.మీ కాగా 144 మి.మీ నమోదైంది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 135 మి.మీ కాగా, కురిసింది 92.6 మి.మీ. దీంతో రైతులు మిర్చి పంటకు దూరమయ్యారు.
ఓ రైతు సాహసం
Published Fri, Sep 5 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement