కార్తెలు కదలిపోతున్నా వరుణుడు కరుణించడం లేదు. చినుకు రాలక.. దుక్కులు సాగక.. రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా వాన జాడే లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. భారంగా మారిన విత్తనాలు.. ఎరువులను నానా తంటాలు పడి కొనుగోలు చేసి రుతుపవనాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఎడారిని తలపిస్తున్న ‘ఘనపురం’ ప్రాజెక్టు.. రైతుల్లో గుబులు
రేపుతోంది.
మెదక్: రైతన్నకు ఆదిలోనే ఖరీఫ్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఆశలతో సాగుకు సమాయత్తమవుతున్న అన్నదాతలకు వరుణుడి కరుణ కరువవుతోంది. దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కోటి ఆశల సౌధమైన ఘనపురంలో చుక్క నీరు లేకపోవడంతో రైతాంగం ఆందోళనకు లోనవుతోంది. రబీ సీజన్ నుంచి రావాల్సిన 0.4 టీఎంసీ నీటిని సింగూరు నుంచి విడుదల చేస్తే వరి తుకాలు వేసుకుంటామని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో ఎక్కడా ఆశించిన వర్షాలు పడలేదు. గత మూడేళ్ళలో జూన్ రెండో వారం వరకే భారీ వర్షాలు కురిశాయి.
దీంతో మృగసిర కార్తెనాటికి దుక్కులు దున్ని, తుకాలు కూడా పోశారు. అయితే ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో దుక్కులు కూడా సాగడం లేదు. కేవలం బోర్ల వద్ద మాత్రమే రైతులు తుకాలు పోసుకున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాల సాగుభూమి ఉండగా 10 శాతం రైతులు కూడా తుకాలు వేయలేదు.వాతావరణం అనుకూలిస్తే సాధారణంగా రైతులు రోహిణి, మృగసిర కార్తెల్లో వరి తుకాలు వేస్తారు. పత్తి, వేరుసెనగ,సోయా చిక్కుడు విత్తనాలు సైతం విత్తుతారు. కాని ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు మందగించాయని, మరో మూడు రోజుల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎడారిలా ఘనపురం..
మెదక్, పాపన్నపేట,కొల్చారం మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాలకు ఆధారమైన ఘనపురం ఎడారిలా మారింది. దీంతో ఆధారిత రైతులు తుకాలు వేసుకునే అవకాశం లేక దిక్కులు చూస్తున్నారు. గత రబీలో సింగూరు నుంచి 6 విడతలుగా 1.95 టీఎంసీ నీటిని వదిలేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అయితే అప్పట్లో 5 విడతల్లో 1.5 టీఎంసీ నీరు మాత్రమే విడుదల అయ్యింది. మిగతా 0.4 టీఎంసీ నీటిని ప్రస్తుతం విడుదల చేస్తే వరి తుకాలు పోసుకునే అవకాశం ఉంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు శిథిలమైన ఘనపురం కాల్వలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది.
కాగా, రుణమాఫీ పథకం ఇంకా కొలిక్కి రాక, కొత్త రుణాలు అందక, ఖరీఫ్‌పై ఆశతో రైతన్నలు ఇప్పటికే అప్పులు చేసి విత్తులను,ఎరువులను కొనుగోళ్లు చేశారు. ఈ సారి సమయానికి సబ్సిడీ వరి విత్తనాలు అందక పోవడంతో వేలాది రూపాయలు పోసి విత్తనాలు కొనుగోలు చేశారు.మరో వైపు రైతుల అవసరాన్ని బట్టి వ్యాపారులు ఎరువుల ధరలను ఎక్కువ చేసి అమ్ముతున్నారు.అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశామని ఒక వేళ వాతావరణం సహకరించక పోతే తమ గతేమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చినుకమ్మా.. రావమ్మా
Published Tue, Jun 17 2014 11:41 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement