చినుకులు పట్టి.. చెరువులు నింపి..
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి.. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. మాయమైన చెరువులకు మళ్లీ జీవం పోసి.. నోళ్లు తెరిచిన జలవనరులకు జలకళ కల్పిం చేందుకు మంత్రి హరీష్‌రావు చొరవ చూపుతున్నారు. జిల్లాలోని 5,756 చెరువులకింద ఉన్న 2,37,516 ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేసే దిశగా.. చెరువుల పునరుద్ధరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు వివరాలు సేకరించడంలో వారు తలమునకలవుతున్నారు. జలవనరుల అభివృద్ధి జరిగితే బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుందని అన్నదాతలు ఆశపడుతున్నారు.
మెదక్: కాకతీయుల కాలంలో.. నిజాం రాజ్యంలో నిర్మించిన చెరువులు.. ఆలనా పాలనా కరువై.. అంతర్థానమయ్యాయి. ఆక్రమణదారుల భూ దాహానికి కొన్ని చెరువులు మాయమయ్యాయి. దీంతో ఒకప్పుడు జలకళతో కళకళలాడిన జలవనరులు నేడు ఎడారులను తలపిస్తున్నాయి. గతంలో ప్రతియేటా కోట్లాది రూపాయలు మంజూరు చేసినా.. అవన్నీ నీటి పాలే అయ్యాయి. కాని చెరువులు కొత్తరూపును సంతరించుకోలేదు. నోళ్లు తెరచిన బీడు భూముల దాహం తీరడం లేదు.
దీంతో మంత్రి హరీష్‌రావు ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టగానే చెరువుల పునరుద్ధరణకోసం ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తత్ఫలితంగా ఎగువ చెరువు నుంచి వృధా అయ్యే నీటిని దిగువ చెరువులోకి మళ్లించుకోవచ్చు. మెదక్ డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో 25 ఎకరాల ఆయకట్టు ఉన్నవి.. 1,354 చెరువులు, 25 నుంచి 50 ఎకరాల లోపు ఆయకట్టు గలవి 225, 50 నుంచి 100 ఎకరాల ఆయకట్టు గలవి 213, వంద నుంచి 500 ఎకరాల ఆయకట్టు గలవి 223, 500 ఎకరాల పైబడి ఆయకట్టు గలవి 10 చెరువులున్నాయి.
జైకా నిధులతో
26 చెరువులకు జలకళ
ఘనఫురం ఆనకట్ట పరిధిలోని మహబూబ్‌నహర్, ఫతేనహర్ కెనాళ్ల ఆధునికీకరణ కోసం జైకా నుంచి రూ.21.86 కోట్లు మంజూరయ్యాయి. వీటితో కాల్వల మరమ్మతు చేయడంతోపాటు చెరువుల అభివృద్ధికి కూడా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఫతేనహర్ కెనాల్ నుండి సమీపంలోని 15 చెరువులకు, మహబూబ్ నహర్ కెనా ల్ నుంచి 11 చెరువులకు నీరు అందించేందుకు ఫీడర్ చానళ్లు తవ్వుతున్నారు. దీంతో ఫతేనహర్ కెనాల్ కింద అతి పెద్దవైన యూసుఫ్‌పేట, కొత్తపల్లి చెరువులకు మంజీరా వరద తరలి రానుంది. ఫలితంగా సుమారు 1500 ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది. మొత్తమీద ఈ రెండు కె నాళ్ల పరిధిలోని చెరువులు నిండటం ద్వారా సుమారు 4 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది.
బృహత్‌ప్రణాళిక
జిల్లాలో మొత్తం 5,756 చెరువులు ఉండగా ఇందులో సుమారు 80 శాతం గొలుసుకట్టు చెరువుల పరిధిలోకే వస్తాయని సమాచారం. చెరువుల కింద ఉన్న ఫీడర్ ఛానల్‌ను అభివృద్ధి చేస్తే.. కింది చెరువులు నిండే అవకాశం ఉంది. ఇందులో మెదక్ మండల పరిధిలోని మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన కృష్ణ సముద్రం చెరువు నిండితే దానికి కింద ఉన్న భీం చెరువు(వెంకటాపూర్), కొంటూర్ చెరువు, రాంరెడ్డి చెరువు, రాయిన్‌పల్లి చెరువు, పుష్పలవాగు గొలుసుకట్టులాగా జలప్రయోజనం పొందుతాయి.
ఖజానా(అవుసులపల్లి)కింద ఉన్న మీది చెరువు, కింది చెరువులు కూడా అభివృద్ధి చెందుతాయి. ఔరంగాబాద్ ఊర చెరువు కింద చందం చెరువు ఉంది. పుష్పలవాగుకింద బండ్ల చెరువు, నాయకుని చెరువు, గోసముద్రం, పిట్లం చెరువులు ఉన్నాయి. బ్యాతోల్ చెరువు కింద లింగ్సాన్‌పల్లి, హవేళిఘనాపూర్ చెరువులు ఉన్నాయి. తిమ్మాయిపల్లి కింద లింగ్సాన్‌పల్లి, హవేళిఘణాపూర్ చెరువులున్నాయి.
వివరాలు సేకరిస్తున్నాం
గొలుసుకట్టు చెరువుల వివరాలు సేకరిస్తున్నాం. అలాగే ఆక్రమణకు గురైన చెరువుల వివరాలు కూడా తెలుసుకుంటున్నాం. అనంతరం పూర్తిస్థాయి వివరాలతో అధికారులకు నివేదిక అందజేస్తాం.
- శ్రీహరిగౌడ్,
ఇరిగేషన్ అధికారి