తొలకరి..హరిహరి..!
తొలకరి తొలుత ఊరించింది. అరకలు చకచకా కదిలేలా చేసింది. ఇప్పుడు మందగించి రైతులను కలవరపరుస్తోంది. దీంతో విత్తనాల వేతలోనే అన్నదాతలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. మరో వైపు అప్పు పుట్టడం లేదు. పెట్టుబడులు తెచ్చినా వేసిన విత్తనాలు ఎంతవరకు ఉపకరిస్తాయో..తెలీని పరిస్థితి తలెత్తింది. ఇంకా ఎన్ని ఎకరాల్లో సాగుకు సిద్దపడాలో కూడా అంచనాకు దొరకడం లేదు.
పాలమూరు : ఖరీఫ్ సాగుకోసం తగిన వర్షాలు పడాలని జిల్లాలోని రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులతోపాటు వర్షం కురుస్తుందనే భరోసాతో ఇప్పటికే కొంత మంది రైతులు విత్తనాలు వేశారు. అందుకు తగ్గా వాన ఇంకా నమోదు కాలేదు.
జిల్లాలో 7,91,300 హెక్టార్లలో పంటల సాగు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 20 శాతం భూమిలో మాత్రమే విత్తనాల వేత పూర్తయింది. ఇంకా లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉంది. వర్షాలు కావల్సినంత పడి ఉంటే ఈ సమయానికి 50 శాతం విత్తనాల వేత పూర్తయ్యేది. జూన్‌నెలలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 71.2 మీమీలు కురవాల్సి ఉండగా 42.4 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లాలోని 27 మండలాల్లో వర్షాలు సాధారణం కంటే అతి తక్కువగా పడ్డాయి. అరకొర వర్షాల కారణంగా రైతులకు ఖరీఫ్ పంట సాగు భారంగా మారింది. మరోవైపు రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఖరీఫ్‌లోనూ రైతులకు ఇక్కట్లు తప్పడంలేదు.
రుణాలేవీ?
రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో కొత్తగా రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. గతేడాదికి చెందిన ఖరీఫ్, రబీలకు సంబంధించిన రూ.లక్షలోపు పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ. 3000 కోట్లకు పైగా పంట రుణాలు తీసుకోగా రూ.1650 కోట్ల మేరకు రూ.లక్షలోపు తీసుకున్న రుణాలే.. వాటికి మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశాలున్నాయి. అంతకుముందు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలకు కూడా మాఫీ వర్తింప చేయాలనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం వాటిపైన కూడా పునరాలోచిస్తోంది. ఆయా రుణాల లెక్కలను బ్యాంకుల వారీగా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలోనూ రూ2,262 కోట్ల మేరకు రుణ లక్ష్యం పెట్టుకున్నా.. పాత అప్పులపై స్పష్టత రాకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడంలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పంటల సాగు అంచనాలు సిద్ధం..!
ఈఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సాగయ్యే ఆయా పంటల రకాలు, గతేడాది మొత్తం, ఈసారి సాగయ్యే పంటలు, అవసరమైన ఎరువులు, సాగుకు అనుకూల పరిస్థితులు వంటి వాటిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించి శుక్రవారం రాష్ట్రస్థాయి అధికారులకు సమాచారం పంపారు. దీని ప్రకారం ఖరీఫ్‌లో పంటల సాగు హెక్టార్లలో ఇలా..!