
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల కలెక్టరేట్లకు ఎట్టకేలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. పాత జిల్లాల్లో కూడా అవసరమైన చోట్ల కొత్త భవనాలు రానున్నాయి. గతేడాది దసరా రోజున ఒకేసారి అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరహాలోనే ఈ నెల 11, 12 తేదీల్లో కొత్త కలెక్టరేట్ భవనాలకు భూమి పూజ చేయబోతున్నారు. కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నతాధికారుల నివాస భవనాలకు కూడా శంకుస్థాపనలు చేస్తారు.
సిద్దిపేటలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా, మిగతా జిల్లాల్లో మంత్రులు ఈ పనులు ప్రారంభిస్తున్నారు. 26 కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి టెండర్లు, కాంట్రాక్టర్లతో ఒప్పందం ఖరారయ్యాయి. వీటిలో 21 చోట్ల అధికారుల గృహ సముదాయాల నిర్మాణమూ చేపట్టనున్నారు. వాటిలో భూ సేకరణ పూర్తైన 18 చోట్ల ప్రస్తుతం శంకుస్థాపన జరుగుతోంది.
ఈ జాబితాలో సిద్దిపేట, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ పట్టణ, జనగామ, వికారాబాద్, మేడ్చల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నిజామా బాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం, మెదక్, కొత్తగూడెంలలో స్థలాలను గుర్తించి భూ సేకరణ జరుపుతున్నారు. మంచిర్యాల, నిర్మల్, వరంగల్ గ్రామీణ, మహబూబాబాదుల్లో గుర్తించిన స్థలాలు బాగాలేక ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని నిర్ణయించారు.
విశేషాలు...
♦ పనులు చేపట్టబోయే భవనాల నిర్మాణానికి 1,032 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పర్యావరణ హితంగా వీటిని నిర్మిస్తారు.
♦ వరంగల్ పట్టణ, రంగారెడ్డి, సిద్దిపేట సహా కొన్ని కలెక్టరేట్లు లక్షన్నర చదరపు అడుగుల్లో, మిగతావి 1.2 లక్షల చ.అ.ల్లో నిర్మితమవుతాయి. కలెక్టర్ల నివాసాలు 6,000 చ.అ., జేసీల గృహాలు 3,000 చ.అ., జిల్లా రెవెన్యూ అధికారుల గృహాలు 2,500 చ.అ., ఇతర జిల్లా అధికారులకు 148 గృహాలను 1,500 చ.అ.ల్లో నిర్మిస్తారు.
♦ అన్ని నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేసి వచ్చే దసరా నాడు గృహప్రవేశాలు జరపాలన్నది లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment