నలుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్‌వర్క్: నమ్ముకున్న ఎవుసం నట్టేట ముంచింది. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా మారాయి. దీంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. సోమవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
► మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మం డలం బలీదుపల్లిలో కుమ్మరి సూగూరు నాగన్న(41) కిందటి ఏడాది ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట వర్షాభావం వల్ల ఎండిపోయింది. కుటుంబ అవసరాలకు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు రూ.2 లక్షలకుపైగా అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక ఆదివారంరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మల్దకల్ మండలం తాటికుం టలో బోయ వీరన్న(45) నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, ఆముదం పంటలు సాగు చేశాడు. పెట్టుబడుల కోసం దాదాపు రూ.4 లక్షలకుపైగా అప్పులు చేశాడు. పంటలు సరిగా పండక అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులు తీర్చలేక సోమవారం ఉరేసుకున్నాడు. పెద్ద దిక్కు లేక ఆయన కుటుంబం వీధిన పడింది.
► నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్(బి)లో మామిడి చిన్న దేవన్న (38) ఖరీఫ్‌లో మొత్తం మూడున్నర ఎకరాల భూమిలో పసుపు, సోయా, మొక్క జొన్న పం టలు సాగు చేశాడు. వర్షాభావంతో పంటల కు నీరందక ఎండిపోయాయి. రూ.4 లక్షల అప్పు తీర్చేదెలా.. అంటూ మథన పడేవాడు. ఈ క్రమంలో సోమవారం పురుగు మందు తాగాడు. పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచనిస్థితిలో పడింది. 10వ తరగతి పూర్తి చేసిన కుమారుడి పైచదువు తం డ్రి మరణంతో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
► మెదక్ జిల్లా రామాయంపేట మండలం నగరం తండాకు చెందిన గుగ్లోత్ రంజా (65) రూ.4 లక్షల వరకు అప్పు చేసి నాలుగు బోర్లు తవ్వించినా ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. మనవరాలి పెళ్లికి మరికొంత అప్పు చేశాడు. పంటలసాగు లేక, అప్పులు తీర్చలేకపోవడంతో సోమవారం ఉరేసుకున్నాడు.
పంటలు పండక.. అప్పులు తీరక..
Published Tue, Jun 7 2016 9:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement