
నలుగురు వృద్ధులు మృతి
పింఛన్లు అందలేదని మనస్తాపం
గుండెపోటుతో మరో వికలాంగుడు..
సాక్షి నెట్‌వర్క్: ఆసరా పింఛన్లు అందలేదని కలత చెంది వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయ నాగమ్మ(85), వికలాంగురాలు ఖాజాబీ(35) లకు గతంలో పించణ్ వచ్చేది. తాజా జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో గురువారం గుండెపోటుతో మరణించారు. ఇదే జిల్లా నర్వ మండలం కన్మనూర్ పంచాయతీ పరిధి గాజులయ్య తండాకు చంఎదిన పాలమూరు రుక్కమ్మ(68) గతంలో పింఛన్ పొందేది. ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. గురువారం జాబితా ప్రకటించగా, అందులో ఆమె పేరు లేదు. మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి యూసుఫ్‌పేటకు చెందిన ఉప్పరి తుకారం(70)కు గతంలో పించన వచ్చేది. వికలాంగుడైన మనవడికి, తనకు పింఛన్ మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. గురువారం వేకువ జామున గుండెపోటుకు గురై మరణించాడు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన జె. లక్ష్మయ్య(70) పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జాబితాలో పేరు లేకపోవడంతో మనోవేదనకు గురై మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన బొల్గం రాజు(15)కు పోలియోతో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గతంలో పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో పేరు లేకపోవడంతో తల్లి భాగ్య వీల్‌చెయిర్‌లో రాజును తీసుకొని అధికారుల చుట్టూ తిరిగింది. పింఛన్ రాలేదన్న బెంగతో గురువారం రాజు గుండెపోటుతో మరణించాడు.