నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు
మల్లన్నసాగర్ సాధన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం, సీతారాంపల్లి, రామచంద్రబోస్, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా కోటి ఎకరాలను సాగులోకి తెస్తామన్నారు. కాళేళ్వరం ఎత్తిపోతలు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి గోదావరి నీటితో రైతుల పాదాలు కడుగుతామని మంత్రి చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు.
గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని, వాటిని మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చ0గొడుతూ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫెదారు రాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, షకీల్ అహ్మద్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.