
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం
- నకిలీ ఆర్డర్లు జారీ చేసిన ముఠా
- రూ.2.50 కోట్లు టోకరా..
బెల్లంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా నిరుద్యోగులకు టోకరా వేసింది. సుమారు రూ.2.50 కోట్ల వరకు వసూలు చేసి అపారుుంట్‌మెంట్ ఆర్డర్లూ జారీ చేసింది. తీరా ఆ అపారుుంట్‌మెంట్లు నకిలీవని తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన ఓ వ్యక్తి మరికొంత మందిని పోగు చేసుకొని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర వేసి మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో సుమారు 50 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో నిరుద్యోగి నుంచి కనిష్టంగా రూ.6 లక్షల నుంచి గరిష్టంగా రూ.12 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ముఠా సభ్యులు ఏమాత్రం అనుమానం రాకుండా ఎస్‌బీఐ, ఎస్‌బీహె చ్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకోవడం గమనార్హం.
నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు..
డబ్బులిచ్చిన తర్వాత ఏళ్ల తరబడి ఉద్యోగం కల్పించకపోవడంతో నిరుద్యోగులు ఒత్తిడి తేవడంతో కొందరికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను అందజేశారు. రైల్వేలో జూనియర్ అసిస్టెంట్‌గా, టీసీగా ఉద్యోగం వచ్చినట్లు నకిలీ ఆర్డర్లను అందించారు. వరంగల్ జిల్లాకు చెందిన కొంతమందిని సికింద్రాబాద్ రైల్ నిలయంకు తీసుకెళ్లి అక్కడ ముందస్తుగా కొంత మంది అనుయాయులను ఏర్పాటు చేసుకుని ఫేక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినట్లు సమాచారం.
పరారీలో ముఠా..
ఈ ముఠా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనిలో కొంత కాలంపాటు నివసించిన ముఠా నాయకుడు ప్రస్తుతం హైదరాబాద్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎల్.రఘు తెలిపారు.