వివరాలు వెల్లడిస్తున్న బ్రహ్మంగారి తండావాసులు
సాక్షి, మహబూబాబాద్ అర్బన్: తక్కువ వడ్డీకే రుణాలిస్తామని, ఒక్కొక్కరి నుంచి రూ.2800 చొప్పున వసూలు చేసి నట్టేటా ముంచారు. పదిమంది గ్రూపుగా ఏర్పడితే ఒక్కొక్కరికి రైస్‌కుక్కర్‌తో పాటు, రూ.50వేల వరకు ఒక్కరూపాయి వడ్డికే రుణాలు ఇస్తామని, ఒక్కొక్కరి వద్ద రూ.2800ల చొప్పున పలువురి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలోని శివారు బ్రహ్మంగారితండా, బడితండాలో బుధవారం చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మంగారితండాకు 15 రోజుల క్రితం నలుగురు వ్యక్తులు వాహనంలో వచ్చి తమది విజయవాడ అని, మాకు ఉన్న సంస్థ ద్వారా మీకు ఒక్కొక్కరికి రూ.50వేల వరకు రుణాలు ఇస్తామని, ఇందుకు మీరు పదిమంది చొప్పున గ్రూపుగా ఏర్పడి, ఒక్కొక్కరు రూ.2800ల చొప్పున చెల్లించాలన్నారు.
కానీ, మీకు రూ.50వేల రుణాలిస్తామన్న విషయం ఎవరికి చెప్పొద్దన్నారు. అదేవిధంగా ఒక్కొక్కరికి రైస్‌కుక్కర్ ఇస్తామని ఎవరైనా అడిగితే మీరు ఇచ్చిన డబ్బులకు రైస్‌కుక్కర్ ఇచ్చినట్లు చెప్పాలని వారిని నమ్మించారు. దీంతో తండాల్లో పలు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక్కొక్కరు రూ.2800ల చొప్పున చెల్లించారు. దీంతో ఇంటింటికీ కొంతమందికి రూ.600ల నుంచి రూ.800ల లోపు విలువగల రైస్‌కుక్కర్లను ఇచ్చి నమ్మించారు. కాగా, ఈనెల 26న మీ తండాకు వచ్చి ప్రతి ఒక్కరికి రూ.50వేలు ఇస్తామని చెప్పారు. దీంతో తండావాసులు వారి కోసం ఎదురుచూస్తుండిపోయారు. సాయంత్రం వరకూ రాకపోవడంతో మండల కేంద్రంలో ఉన్న ఆఫీస్ వద్దకు వెల్లి చూడగా తాళం వేసి వెల్లిపోయినట్లు యజమాని తెలిపింది.
వెంటనే వారికి ఇచ్చిన ఫోన్ నెంబర్లకు బాధితులు ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వస్తుండటంతో, తమను మోసగించారంటూ తండావాసులు లబోదిబోమన్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులకు తెలిపారు. అసలు ఒక్కరూపాయి వడ్డికి రూ.50వేల రుణం ఇస్తామని, తక్కువ విలువైన రైస్‌కుక్కర్లను ఇచ్చి తమను మోసగించారంటూ తండావాసులు వాపోయారు. రూ.50వేలు ఇస్తామని చెప్పడంతో తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కుదువపెట్టి మరి డబ్బులు చెల్లించామంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమతోపాటు చుట్టుపక్కలున్న తండావాసులు, పలుగ్రామాల ప్రజలు మోసపోయినట్లుగా తండావాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment