సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా పని చేస్తూ దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండ పంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యం లో సమీక్ష జరిగింది.
ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇంటర్‌లో గతంలో లక్ష 25 వేల మంది విద్యార్థులుండగా, తమ ప్రభుత్వం వచ్చాక లక్ష 75వేలకు పెరిగిందని, వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచాలని కోరారు. కేసీఆర్ హామీ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకు జివో నంబర్ 16ను తీసుకువస్తే కొంత మంది కోర్టుకు పోవటంతో వారి క్రమబద్దీకరణ ఆగిపోయిందని, ఐతే ప్రభు త్వం వారి జీతాలను 37వేలకు పెంచింద న్నారు. కార్పొరేటర్ విద్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, అనేక ఇబ్బందు లకు గురౌతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని, అందుకే ప్రభుత్వ కాలేజీలను బలోపే తం చేయాలన్నారు.
కస్తూరిభా గాంధీ విద్యాలయాలను(కేబీజీవీ) అప్‌గ్రేడ్ చేయా లని కేంద్రానికి నివేదిక పంపామని, అలా చేస్తే 475 కేబీజీవీలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ అవుతాయని, దీంతో విద్యార్థుల సంఖ్య 5 లక్షల వరకు పెరిగే అవ కాశం ఉందన్నారు. ప్రభుత్వ కాలేజీలు మూత పడే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని అన్నారు. ప్రతిభ గల విద్యార్థుల కోసం పాత 10 జిల్లాల్లో జిల్లాకు 2 చొప్పున 20 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నీట్, జేఈఈ, ఎంసెట్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు కడియం వెల్లడించారు.
2018–19 విద్యా సంవత్సరానికి మెయింటనెన్స్ కింద కాలేజీ ఓపెనింగ్‌కు ముందు లక్ష రూపాయలు మంజూరు చేస్తామన్నారు. పరీక్షల సమయంలోనైనా అధ్యాపకులు హెడ్ క్వార్టర్‌లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ అశోక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో పాటు ప్రిన్సిపల్స్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫలితాల్లో సత్తా చాటాలి
ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు తీసుకురావాల్సిన బాధ్యత బోధనా సిబ్బందిదేనని కడియం అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్ల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతులను విడతలవారీగా కల్పిస్తున్నామని, రెండేళ్లలో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లు, ల్యాబ్ మెటీరియల్, గేమ్స్–స్పోర్ట్స్ సామగ్రి, ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్ ల్యాబ్ తదితర వసతుల కోసం రూ.275 కోట్లు మంజూరు చేశామన్నారు. లెక్చరర్లు బాగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వీటిని చూసి వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాలన్నారు.
(విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం. చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ అశోక్)
Comments
Please login to add a commentAdd a comment